Saturday, October 3, 2020

ఓ అనిత కథ (ఎపిసోడ్ -2 పుట్టని కొడుకు తో తాగుబోతు తండ్రి)

 ప్లేస్ : ఉమేష్ నగర్ లో రద్దీ గా ఉన్న ఒక వైన్స్ 

సమయం : ప్లేస్ నువ్వు చెప్పినాసరే...నన్ను చెప్పమన్న సరే...టైం నువ్వు చెప్పినా సరే ..నన్ను చెప్పమన్నా సరే...అంటూ కొందరు తొడలు కొడుతున్నారు... సో ప్లేస్ నేను చెప్పాను కాబట్టి  టైం వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాను...

చమురయ్య ముచ్చటగా మూడో క్వార్టర్ మూత తీస్తున్నప్పుడు 

అయ్యా బాగున్నావే ....అంటూ ఒక వాయిస్ 

చమురయ్య : నేనైతే బాగున్నా గని నీకైతే మందు పొయ్య ....ఎందుకంటే నాకే సరిపోదు.

అపరిచిత వ్యక్తి : నాకు మందేం అవసరం లేదు గని నీ గురించే అచ్చిన...

చమురయ్య : నా గురించా...ఎవరు బిడ్డా నువ్ ....

అపరిచిత వ్యక్తి: నేను నీకు పుట్టని కొడుకుని నాన్న ....

చమురయ్య : నేను పెద్ద కొడుకిన్నా...చిన్న కొడుకిన్నాగని గీ పుట్టని కొడుకుని ఇనలే...

అపరిచిత వ్యక్తి: నిజం నాన్న .. కావాలంటే నువ్ తాగే మందు మీదొట్టు నాన్న ...

చమురయ్య :  మొగోడు మందు మీదొట్టేసి చెప్తండంటే నిజమే బిడ్డ...నువ్ నా  కొడుకువే.. నువ్ అచ్చినవ్ కదా ఇప్పుడు ...ఇప్పుడు వాని సంగతి చెప్తా ...

పుట్టని కొడుకు : ఎవని సంగతి ....

చమురయ్య :  గదే బిడ్డ నీ రెండో బావ సంగతి .... వాణ్ని ఇయ్యాళ మలేషియా ల మచ్చల పిల్లిని కొట్టినట్టు... దుబాయ్ ల దున్నపోతును కొట్టినట్టు కొట్టాలి బిడ్డ ....వాని గూబ పగల గొట్టుడే .....కాదు కాదు నీ చేత పగలగొట్టిచ్చుడే...   

పుట్టని కొడుకు : అంటే అమ్మను ముందుకు తోసి ఎనకాల నిల్చున్నట్టు ....ఇప్పుడు నన్ను ముందు పెట్టి నువ్ ఎనక నిల్చుంటావా ....మోడీకి భయపడి సోనియా గాంధీ ఎనకాల దాక్కున్న రాహుల్ గాంధీ లెక్క కనపడ్తన్నవ్ నాన్న నాకు ..

చమురయ్య :  అదంత కాదు బిడ్డ ...అక్కడ వాడెక్కువ చేస్తండు....వాంది పలిగి పోవాలియాల..

పుట్టని కొడుకు : సరే పోదాం గని ముందుగాల నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి గవి క్లారిఫై చేయి..

చమురయ్య : హా ..చెప్పు బిడ్డ చేత్తా..

పుట్టని కొడుకు : గది గాదె నాన్న మన బావలు....సారి సారి నా బావలు  ఎసొంటోళ్లే ....

చమురయ్య :బావలా ...బిడ్డ సరే నేను చెప్తా గని నేను ఒక్కొక్కరి గురించి చెప్పేటప్పుడు ఒక్కో పాటేస్కో ...పెద్దొని గురించి చెప్పేటపుడేమో అతడు సినిమా ల "అదరక బదులే  చెప్పేటి తెగువకి తోడితడే " టైటిల్ సాంగ్ అన్న మాట ఆదేసుకో...ఇగ చిన్నోని గురించి చెప్పేటప్పుడేమో గబ్బర్ సింగ్ ల "దేఖో దేఖో గబ్బర్ సింగ్ " అదేసుకో ...ఎందుకంటే ఆయనే అసలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ...  

పుట్టని కొడుకు : అవసరమా నాన్న ఇదంతా ....

చమురయ్య : నువ్వేం బాధ పడకు బిడ్డ ...ముందు ఎత్తుడు ....తర్వాత పడేసుడు మనకు అలవాటే .. ఇగ చెప్తాన్న ఇనుకో ...పెద్దోడు మన "పే"నోడే...పేరు రబీ  ....మనిషి బంగారం

పుట్టని కొడుకు : "రబీ" నా .. ఇదేదో సీజన్ పేరు లా ఉందే ...

చమురయ్య :వాళ్ళ నాన్నకు దొంగరేణి పని రాకముందు ఆయనే ఒక రైతు ....అయినేకు  రబీ సీజన్ అంటే బొచ్చెడు ఇష్టం అందుకనే ...కొడుకు పుట్టుడు తోనే గా పేరు పెట్టిండు

పుట్టని కొడుకు : నాన్న నేను ఎంత గట్టిగ అతడు టైటిల్ సాంగ్ వేసుకున్నా అదివేరే అస్తంది నాన్న ...లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాల "నేను జీవితం లో చేసిన ఒకే ఒక పొరబాటు ....వీణ్ణి నమ్మడం...దగా ....దగా " అని వస్తుంది నాన్న ....

చమురయ్య :అవునా బిడ్డ.... అయితే నిజాలే అస్తన్నయ్ అన్న మాట .....మల్ల చిన్నోనికి ఏత్తె ఏమస్తదో .....వద్దులే బిడ్డ ....టైటిల్ సాంగ్ కాన్సిల్... ఇగ  చిన్నోని  ..పేరు మాగర్.......మనిషి  పవన్ కళ్యాణ్ ఫ్యాన్...అంటే చెప్పనే అక్కర్లే ...

పుట్టని కొడుకు : మాగర్....ఇది ఇంకా వెరైటీ ఉంది దీనికేంటి నాన్న ఫ్లాష్ బ్యాక్ ...

చమురయ్య :వాళ్ళ నాన్నకో తల్లుండేది ...ఆమెకో ఇల్లుండేది ...ఆ రెండు వాళ్ళ నాన్నకిష్టమే ...అందుకే రెండు కలిసేలా మాగర్ అని పెట్టాడు ...మా అంటే అమ్మ ....గర్ అంటే ఇల్లు ....

పుట్టని కొడుకు : బతికించావ్... నాన్నోయ్ ....

చమురయ్య :ఎందుకు బిడ్డ  అట్ల అంటన్నవ్...

పుట్టని కొడుకు : వాళ్ళ నాన్నకో కుక్కుండేది....దాని పేరు టైగర్ ...అదంటే వాళ్ళ నాన్నకు చాలా ఇష్టం...అందుకే ఆ పేరు పెట్టారు ....అంటావనుకున్నా...

చమురయ్య : ఛీ మనకు కామెడీ కావాలి కానీ కాంట్రవర్సీ ఎందుకు బిడ్డ ..అందుకే అట్ల చెప్పలె...ఇగ రెండోవోని పేరు అన్నం బాబు ....వాడికా పేరు ఎట్లోచిందంటే ...

పుట్టని కొడుకు : ఆగు ఇక్కడి నుంచి నేను చెప్తా ....వాళ్ళ నాన్నకి అన్నం అంటే చాలా ఇష్టం ..అందుకే ఆ బావకి అన్నం బాబు అని పేరు పెట్టారు ...ఇదే గదా నువ్ చెప్పేది ...

చమురయ్య :అబ్బ ....ఏం చెప్పినవ్ కొడుకా ....నువ్ మన ఆతుగంటి వంశం ల పుట్టకున్నా సరే మనోనివే అనిపించినవ్ .....కానీ వీనికి ఇంకో పేరున్నది బిడ్డ ...పేరు కిషోర్ ....  వీడు ఎంత గలీజ్ గాడంటే వాడు మాట్లాడితే పుకారు ....వాడు తాగితే బెంజ్ కారు ...వాడు తినే పండు ఆల్ బుకార్...మొత్తానికి వాడో బేకార్ ...వాడు నిజాలు చేప్తే అయితది మన జీవితం తారుమారు....వాడికి నచ్చిందే చేత్తడు...అందుకే అర్జెంటు గా నువ్విప్పుడు వాణ్ని కొట్టాలే ....

పుట్టని కొడుకు : వాడు ఫుల్లు తాగుతాడు అన్నవ్ ....ఏంటీ ..నీ కన్నా ఎక్కువనా ....

చమురయ్య : నేనెంత బిడ్డ డైలీ పొద్దునో క్వార్టర్ సాయంత్రమో క్వార్టర్ ....అప్పుడప్పుడు బోనస్ కింద ఇంకో క్వార్టర్ అంతే ...కానీ వాడు సంవత్సరానికి పది సార్లే తాగుతాడు గని ఫుల్లు తాగుతాడు బిడ్డ...

పుట్టని కొడుకు: అది అందరు జెత్తరు గని వేరే మాటర్ ఉంటె చెప్పు ....

చమురయ్య :పెళ్ళాం మొగుళ్ళు ఎదో చిన్న గొడవ పెట్టుకొని మీ అక్క ఇక్కడనే ఉంటంది. ఇంటికొచ్చింది మొదలు రా...రెండు రోజులకోసారి ఫోన్ చేసి నా భార్యను నా దగ్గరికి పంపియ్ అని అడుగుతడు ...మేము పంపియ్యం అంటే ఇనడు...అరే మన చరిత్రలనే గొడవ పెట్టుకొని ఇంటికచ్చిన ఆడపిల్లను ఆరు నెలలు దాటనిది అత్త గారింటికి పంపించిందే లేదు ..

పుట్టని కొడుకు: ఇంతకీ గొడవ ఎందుకైంది నాన్న

చమురయ్య : కొత్త అల్లుడి ముందు అంతకు ముందు ఉన్న అల్లుణ్ణి అవమానించుడు మన ఆచారం బిడ్డ ...వీడు కొత్తగా ఒచ్చినప్పుడు పెద్దల్లుణ్ణి అవమానించినం ....మూడోడు వచ్చిన తర్వాత వీణ్ణి అవమానించినం.దానికే హర్ట్ ఐతరా ...నన్నైతే పెళ్ళాం, కూతుర్లు , అల్లుళ్ళు, సడ్డకులు  అందరు తిడుతరు.. నేనేమన్నా హర్ట్ ఐతనా ....పోతా మందేసి లుంగీ ఎట్లున్నదో కూడా చూసుకోకుండా పంట ....మళ్ల మన ఇంకో కుటుంబ సంప్రదాయం ఏందంటే ఒక బిడ్డ పెళ్ళయిందంటే అంతకు ముందున్న బిడ్డ మొగుడితోని గొడవ పెట్టుకోనచ్చి మినిమిమ్ ఆరు నెలలు ఇట్లుండాలె ...రెండో దాని పెళ్లయినప్పుడు పెద్దది అచ్చి ఉన్నది ....మూడో దాని పెళ్లయినప్పుడు రెండోది అచ్చి ఉంటంది ....అరే ..మన ఆచార సంప్రదాయాలను తప్పంటుండు బిడ్డ ..అందుకనే నువ్ వాణ్ని కొట్టాలే ...

పుట్టని కొడుకు: నేనెట్ల కనబడుతున్న నాన్న నీకు ....అట్టర్ ఫ్లాప్ బాలయ్య బాబు సినిమాకు బ్లాక్ ల టిక్కెట్లు కొనే లెక్క కనబడుతున్నానా ...ఆచార సంప్రదాయాలు.. తొక్క ...తోట కూర పక్కకు పెట్టి అసలు నిజం చెప్పు ....

చమురయ్య : మళ్ల ఎనిమిది సంవత్సరాల నుండి మనమే పోషిస్తన్నం బిడ్డ... ఒక్క రోజు కూడా పనికి పోడు,  నాలుగు లక్షల అప్పున్నది బిడ్డ ...

 పుట్టని కొడుకు :నాకెక్కడో సింక్ కావట్లే నానా...పని చెయ్యడంటన్నావ్...మల్ల అంత అప్పున్నదంటన్నావ్ ...పని చేయనోనికి అన్ని లక్షలెవడిత్తడే.. నువ్వేదో దాస్తాన్నవ్ నాన్న .. 

చమురయ్య : అరే నమ్మవా ....మన ఆతుగంటి వంశమోళ్ళు ఎప్పుడన్నా అబద్దాలాడుతర ...

పుట్టని కొడుకు : పిల్లి గుడ్డిదైతే ఎలుకచ్చి ఏదో చూపించిందంట...నిజం చెప్పు అంటన్నా ...

చమురయ్య : ఇగ నువ్ చెప్పకపోతే విడిచేటట్టు లేవుగాని ...ఒక్క మాటల చెప్తా ...వానికి మన ఫ్యామిలి ముచ్చట్లన్నీ తెలుసు... ముచ్చట్లు అంటే సీక్రెట్స్ అన్న మాట .....వాని భార్యను పంపకపోతే గవీటిని బయట పెడతా అంటుండు ...వీళ్ళందరూ మంచిగున్నపుడు ఏదో ప్రేమ కథా చిత్రం నడిపించారంటా ....ఇప్పుడు వాడు దాన్ని నాకు హార్రర్ కథా చిత్రం లెక్క చూపెడుతండు...

పుట్టని కొడుకు : అంటే మన ఫ్యామిలీ కూడా కూడా ట్రెండ్ ఫాలో అయిందన్న మాట ...

చమురయ్య : వీళ్లు ట్రెండ్ ఫాలో అవుడు ఏందోగని వాడు నా బెండు తీస్తండు...ఇప్పటికే ఇద్దరు కూతుర్లు,  వాళ్ళ మొగుళ్ళ దగ్గరికి, దొంగరేణి జాబున్నోడు కందకర్రి నుంచి బీదావరిఖని కి డైలీ అప్ అండ్ డౌన్ చేసినట్టు చెస్తాండ్రు....ఇక అవ్వి బయటికేస్తే మూడోది కూడా అప్ అండ్ డౌన్ చేస్తది....     

పుట్టని కొడుకు : అదీ ముచ్చట ..బ్లాక్ మెయిలింగ్ అన్న మాట ...

చమురయ్య : బ్లాక్ మెయిలింగో .....ఈ-మెయిలింగో ...వాడు నన్ను సంపుతండు బిడ్డ... నాకు నువ్వే దిక్కు బిడ్డ ...

పుట్టని కొడుకు : నాన్న.... నువ్ చెప్పినయ్ అన్ని విన్న తర్వాత నా రక్తం మరుగుతంది ....నా బొక్కలు ఉడుకుతన్నయి ....నా మాంసం మాడుతంది ....

చమురయ్య :కోపం ల రక్తం మరుగుడు ఇన్నగాని బొక్కలు ఉడుకుడు .... మాంసం మాడుడు ఏందీ బిడ్డ ..

పుట్టని కొడుకు : అంటే చెత్త గా ఉన్నా సరే కొత్తగా ఉందని ట్రై చేశా ....సరే అది పక్కకి పెడితే వరల్డ్ లనే నెంబర్ 2 వేస్ట్ గాడు బావ అని నేను ఒప్పుకుంటన్న ....

చమురయ్య : నెంబర్ 2 నా ???మరి నెంబర్ 1 ఎవరు బిడ్డ ???

పుట్టని కొడుకు : ఏందీ నాన్న తెల్వనట్టు గట్ల మాట్లాడుతున్నవ్ .. ప్రపంచం ల ప్రతీ కొడుక్కి కూడా తన నాన్నే నెంబర్ 1 అన్ని విషయాలల్ల ....నాక్కూడా నువ్వే నెంబర్ 1..నేను నీకు పుట్టనంత మాత్రాన నిన్ను నెంబర్ 1 గా మర్చిపోతా అనుకున్నావా నాన్న ...నిన్ను వేరే స్థానం ల ఊహించుకోలేను నాన్న .....నేను

చమురయ్య : నువ్ వాణ్ని కొడుతావో లేదో గాని నన్నైతే మాటల్తోని ఇయ్యర మయ్యర సంపుతన్నవ్ రా ....పా...  ముందైతే వాణ్ని కొడుదువు ....

పుట్టని కొడుకు : ఒక డౌట్ నాన్న.  ఆ బావ గాడు ఈ ఎనిమిది సంవత్సరాలల్ల  ఎన్నిసార్ల అక్కను తన్ని తగలేసిండే నీ ఇంటికి ...

చమురయ్య : నా బిడ్డని గొట్టేంత ఉన్నదారా వానికి ....షంషేర్..మన మీద చెయ్యి పడది..         

పుట్టని కొడుకు : అయితే ఈ ఒక్కసారే అన్నమాట గొడవ ..సరే గా సంగతి పక్కన బెట్టు ...సరే గీ బావంటే బేకార్ గాడు గలీజ్ గాడు కాబట్టి ఈ అక్కచ్చి ఇక్కడున్నది ..మరి పెద్ద బావ బీరు నోట్ల పెడితే తాగాల్న ....సప్పరియాల్నా అంటడు కదా .... మరి ఆ అక్కేందుకే సంవత్సరం ల ఆరు నెలలు అక్కడ, ఆరు నెలలు ఇక్కడ ఉంటది ... 

చమురయ్య: మన ఆచార సంప్రదాయాల గురించి చెప్పిన కదా బిడ్డ .....

పుట్టని కొడుకు : గవన్ని ఉత్త ముచ్చట్లని నాకు తెలుసు గాని ....నిజం చెప్పు ... చెప్పలేదనుకో ...బావను మలేషియా ల మచ్చల పిల్లిని కొట్టినట్టు... దుబాయ్ ల దున్నపోతును కొట్టినట్టు కాదు నిన్నైతే.... అమెరికా ల అడ్డ గాడిదను కొట్టినట్టు ....కువైట్ ల కుక్కను కొట్టినట్టు కొడతా ....

చమురయ్య: హే ...నువ్వంత రివర్స్ మాట్లాడుతన్నావ్ గదంతా కాదు అచ్చి నీ బావను కొడుతావా లేదా..

పుట్టని కొడుకు : నువ్ అయితే ఆన్సర్ చెప్పు వాణ్ణి తన్నక పోతే నన్నడుగు..

చమురయ్య: తంతావ్ కదా ..... మాట మీదుండాలే మళ్ల ....

పుట్టని కొడుకు : హా తంతా ..

చమురయ్య :  గిప్పుడైతే నీ పెద్ద బావ మంచోడు గని అంతకు ముందు "బీరు నోట్ల పెడితే తాగాల్న ....సప్పరియాల్నా" టైపు కాదు బిడ్డ.. ఒక్క బీరు నోట్ల పెడితే ....నా కాటన్ బీర్లు ఎక్కడ ??అని అడిగే టైపు ....   ఆయనే కూడా మంచోడు కాదు బిడ్డా ....

పుట్టని కొడుకు : అదేందే రెండో బావంటే తాగుబోతు...పని చెయ్యడు ...కానీ పెద్ద బావ గురించి నాకు తెలుసు గట్టిగా రెండో బీర్ తాగితే అవుట్ ఐతడు, మూడో బీర్ కి మూడు పూటలు తిన్నదంతా కక్కుతాడు. అయిన జాబ్ కూడా చేస్తడు కదనే ...

చమురయ్య : గట్ల కాదు బిడ్డ చెడ్డోడంటే...అమ్మ అయ్యాను దేవుళ్ళ లెక్క చూసుకుంటడు.వాళ్ళని ఇడిచి పెట్టి వేరే కాపురం పెట్టనంటడు. నాకేమో వేరు కాపురం పెట్టాలంటది  మీ అక్క..ఐనేమో సొంతిల్లు ఇడిచి పెట్టి అద్దింట్ల బతుకు రా మగడ అంటే ఇనడు. అందుకనే ఆ అక్క గొడవ పెట్టుకొనఛ్చి మనింట్లనే ఉంటది ...మల్ల బిడ్డ చెప్పుడు మరిచిన ...మతం మారుమంటడు బిడ్డ..

 చమురయ్య : అదేంటి నానా ...నీకో న్యాయం ..నీ అల్లుడికో న్యాయమా ..భర్త ఏ మతం ల ఉంటె భార్య ఆ మతం లనే ఉండాలే కదా నానా.. నువ్వు హిందూ కాబట్టి అమ్మ హిందువు ల్లోకి వచ్చింది..బావ క్రిస్టియన్ అయితే ఆ మతం కె పోవాలే కదా నానా...

చమురయ్య : ఇగో నీకో సీక్రెట్ చెప్తన్న..మల్ల ఎవరితోనో చెప్పకు ...అయినే కూడా పని చెయ్యకపోతే గా జాబ్ కూడా మనం పెట్టించిందే బిడ్డా ...దానికి ఐదు వేలు నేనే గట్టిన 

 పుట్టని కొడుకు: ఊకో నానా నువ్వు.. నీ అబద్దాలు ..పాపం ఆ బావే డబ్బులు ఆరెంజ్ చేసుకున్నాడు ...ఎందుకట్లా అబద్దాలాడి ఇజ్జత్ దీత్తవ్ బావది... ఎవ్వరికి చెప్పద్దు అనుకుంట ఈ విషయాన్ని బీదావరిఖనిలా సగం మందికి చెప్పినవ్ ..నేనే ఇన్నా ...   

 పుట్టని కొడుకు రివర్స్ మాట్లాడ్డం తో  చమురయ్య కి కోపం వచ్చింది...

చమురయ్య : అయినా నువ్వు పుట్టకున్నా ఐణేకు బామ్మర్దీవే రా.. అంతే లే బావ బామ్మర్థులొకటి ..

పుట్టని కొడుకు: అదేంది నాన్న అట్లాంటావ్ ...నాకు అయ్యా కంటే బావ ఎక్కువైతడా ...కాకపోతే ఎవరిదీ రైట్ అయితే వాళ్ళది రైట్ అంట ...

చమురయ్య (మనసులో) : వీడు మంచిగుంటే నిజాలు అన్ని బయట పెడుతండు ....కొంచంమందెయిస్తే మన దిక్కు మాట్లాడుతడు...మనం పంచాయితీలల్ల చేసేదిదే కదా...

చమురయ్య : బిడ్డా మందేత్తవా...కొంచం ఏయ్ బిడ్డ ..నేను చెప్తాన్న ఏయ్ బిడ్డ ...గొడవకు పోయేటప్పుడు ధైర్యం ఉండాలంటే కొంచం మందెయ్ ...

పుట్టని కొడుకు: అంతేనానే...

చమురయ్య : ఈ క్వార్టర్ తాగు 

పుట్టని కొడుకు: గిట్లనే తాగాల్ననే...డైరెక్ట్ గా ..హే బేరర్ స్టఫ్ పల్లీలన్న అటుకులన్న తీస్కరా ....

చమురయ్య : చీప్ గ పల్లీలెంది బిడ్డ ...మన ఆతుగంటి వంశం ల ఆస్తులమ్ముకొని ఐన మటన్లు...చికెన్లే తినాలే .... బేరర్ చాపన్న చికెనన్న పట్టుకరా ...

బేరర్ : అన్న... డబ్బులు 

చమురయ్య :హే ..పొ..వ్యా నువ్ ముందు పోయి మీ సేటుకి రెగ్యులర్ కస్టమర్ అతుగంటి చమురయ్య అని చెప్పు 

బేరర్ : క్వార్టర్ నిలబడి కచ్చా కొట్టే రకం వీడు ..వీనికి చాపలు చికెన్ అంట ...

పుట్టని కొడుకు: నాన్న వాడేదో తిడుతండు నానా ..

చమురయ్య: అంటే నేను ఇనలేదనుకున్నవా....ఇన్నా సప్పుడేక ఉండాలే..ఏ షాపుకన్నా ఒకడే కస్టమర్ 35 సంవత్సరాలు కంటిన్యూ గ పోతే వానికి మంచి వేల్యూ ఇస్తరు... అదేందో తాగుబోతుల దరిద్రం ...వాడికి డైలీ మనతోనే పైసల్ అస్తయ్ కానీ వాడే మనల్ని చీప్ గ చూస్తాడు. అయినా నేను వాణ్ని ఇడిసి పెడుతా అనుకున్నావా ....వాని సంగతి చూస్తా....దెబ్బకు వాడు ఇంకోసారి మన జోలికి రాడు ....

పుట్టని కొడుకు:అంతఘనం ఏం చేస్తావ్ నాన్న ....

చమురయ్య: ఏమున్నది సీరియస్ గ వాణ్ని సైడ్ కి పిలిచి సింపుల్ గా వాని కాళ్ళ మీద పడుత.... 

పుట్టని కొడుకు: అప్పుడు "అరె.......హో......."అనే జబర్దస్త్ మ్యూజిక్ అస్తది కదా నాన్న ...

చమురయ్య: అవును బిడ్డ నీకెట్లా తెలుసు....

పుట్టని కొడుకు:అది జబర్దస్త్ చూసేటోళ్లకు అందరికి తెలుసు గాని ఏదన్న స్టఫ్ చెప్పు నాన్న ..

చమురయ్య: బేరర్ ఇగ కొడుకు ముందు ఇజ్జత్ తియ్యకు గని ఈ 20రూపాలు తీస్కపొయి నీ ఇష్టం అచ్చింది తీస్కర ..

బేరర్ : ఇప్పటి దాకా ఈ 20 రూపాయలతోనా చికెన్లు, మటన్లు అన్నది ......  

చమురయ్య: హే పో ఇగ ఇజ్జత్ దీయకు అని చెప్పిన కదా .... 

చమురయ్య (పుట్టని కొడుకు తో) : ఇగ బిడ్డ...ఇక్కడ  చికెన్ చాపలు అంత మంచిగుండై నీట్ గ కడగరు ...మనం బాయిల్డ్ పల్లీనే తెచ్చుకుందాం ఉడక బెడితే క్రిములున్నా సచ్చి పోతయ్. సరేనా   

పుట్టని కొడుకు: సరే నానా ఎదో ఒకటి గాని .....నానోయ్ నాకు తాగితే జ్ఞానం అత్తది..నీకు ముందే చెప్తన్న ..

చమురయ్య: హా రావాలె బిడ్డ రావాలె ..మన ఆతుగంటోళ్లకి అది బాగా అవసరం కానీ ఒక్కటి బిడ్డ తాగిన తర్వాత మాత్రం మీ బావ అంతే చూడాలే...

పుట్టని కొడుకు: ముందు బావను చూస్తా .....ఆ తర్వాత అంతే ఏంది ....ఎంతైనా చూస్తా .... నువ్వేం ఫికర్ చేయకు..

(క్వార్టర్ కంప్లీట్ ఐన తర్వాత )  ....

గమనిక : ఇక్కడ నుంచి స్టోరీ ని తాగుబోతు స్లాంగ్ లో చదవండి....అంటే బాగా తాగి మాట్లాడుకున్నట్టు గా ...మీరు తాగి చదివినా కూడా నాకేం అభ్యంతరం లేదు...(డబ్బులున్నోళ్లు కిక్కు కోసం నల్ల కుక్క (బ్లాక్ డాగ్ )ను తాగండి ....డబ్బులు తక్కువున్నోళ్లు రాజఠీవి జింక (రాయల్ స్టాగ్ ) ను తాగండి....ఏమి లేనోళ్లు మాత్రం ఇంట్లో ఉంది కదా అని శానిటైజర్ మాత్రం  తాగకండి.... ఎందుకంటే ....పోతారు....అన్నట్టు మర్చి పోయాను ముందు మనం కథ లోకి పోదాం  ... )    

పుట్టని కొడుకు: హా...పా ..నానా గిప్పుడు గా బావ గూబె పలగాలే ....పోదాం పా వాని దగ్గరికి ....

చమురయ్య: మనం పోవుడేంది బిడ్డ... వాడే ఇక్కడికి రావాలె ..వాడే దెబ్బలు తిని పోవాలే.

పుట్టని కొడుకు:అది కాదు నాన్న వాడి మీద మనకు కోపం ఉన్నది ..కాబట్టి మనం పోవాలే ..మనం కొట్టాలె ..

చమురయ్య: మనం పోవుడే లేదు ...వాడే వాళ్ళ అన్నను వదినను తీసుకొని ఇక్కడకు రావాలే ..మనం కొట్టాలే....

పుట్టని కొడుకు:నాకు ఇప్పుడు అర్థమయితంది నానా ...అక్కలెందుకు ఇక్కడ నెలల తరబడి ఉంటాండ్రో ...గింత కోపమున్న నువ్ కొట్టడానికె పోతలేవ్... ఇక కాపురానికెందుకు అడుగుతావ్ అక్కడకు పోయి ....నాన్న నువ్ ఎం అనుకోవద్దు నానా 

చమురయ్య: హే నేనేం అనుకుంట బిడ్డ ....

వెంటనే "ఫాట్"మనే శబ్దం ....చమురయ్య చంపను పట్టుకుని నిల్చున్నాడు.

పుట్టని కొడుకు: చెప్పిన కదా నానా తాగుతే జ్ఞానోదయం ఐతదని..ఇప్పుడు నీకు జ్ఞానోదయం చేస్తా ..ను ఇగ ..వాళ్ళఛ్చి చెప్తే పంపుతా ...వీళ్ళచ్చి చెప్పుతే పంపుతా అని గిట్లనే పెద్ద అక్కను ఇంట్ల ఉంచి పాడు చేసినవ్. ఇప్పుడు రెండో అక్కను పాడు చేసినవ్... నీది దొంగరేణి జాబ్ కాబట్టి అన్ని తెచ్చి పెడ్తన్నవ్.  ఇక్కడ సుఖానికి అలవాటు పడుతండ్రు. అక్కడికి పోతే వాళ్లది దొంగరెణి జాబ్ కాదు కాబట్టి ఉన్నంతలా సర్దుకుందాం అంటే తేరగా నువ్ ఒకనివి దొరికినవ్ కదా ...మల్ల మొగునితోని గొడవ పెట్టుకొని ఇక్కడికచ్చి ఉంటండ్రు. 

చమురయ్య:అవును బిడ్డ నువ్ పుట్టనే లేదు కదా ...ఇవన్నీ నీకెట్లా తెలుసు ...

పుట్టని కొడుకు: నేను పుట్టకున్నా ఇక్కన్నే తిరుగుతన్నా ...పెద్దక్క గొడవపుడే అద్దామనుకున్న కానీ నేనింకా చిన్న పిలగాన్నే అందుకనే రాలేదు . అవును నానా నేను ఇంకొకటి అడుగుతా ఎం అనుకోవ్ గా ..

చమురయ్య ; (చెంపకు చేతులు అడ్డం పెట్టుకుని )మల్లనా ...

పుట్టని కొడుకు:ఈ సారి కొట్టను గాని... ఏ తండ్రి అయినా కూతురు అల్లుడుతోటి గొడవ పెట్టుకొని వస్తే వారం రోజులు లేదంటే మాక్జిమం పది రోజుల్లో సెటిల్ చేసి పంపుతడు. మరి నువ్వెందే నెలల కమానంగా ఉంచుకుంటవ్...కొంచంకూడా సిగ్గు లేదా నానా నీకు..

చమురయ్య : నాకెందుకు సిగ్గు బిడ్డా .... చెట్టుకు కొమ్మ బరువా ...కొమ్మకు పండు బరువా...పండుకు తొక్క బరువా...నా బిడ్డను నేను సాదుకుంటా ...నా బిడ్డ బిడ్డ ...   

వాక్యం కంప్లీట్ చేయకముందే ఈ సారి ఇంకొంచం గట్టిగా సౌండ్ వచ్చింది... రెండో చంప పట్టుకుని కూర్చున్నాడు చమురయ్య ..

పుట్టని కొడుకు: నువ్ ఇంకోసారి ఆ డైలాగ్ చెబితే పప్పుతో కొడతా..గీ మాటే అని అని ఇద్దరు  కూతుర్లని చెడగొట్టినవ్ ..ఇప్పడు మూడో అక్కను చెడగొడదామని చూస్తన్నావా ....అక్కలు వచ్చినప్పుడల్లా ఆరు నెలలు ఆరు నెలలు ఉంచుకొని... మన వంశాన్ని ఆతుగంటి వంశం అని పిలవకుండా అచ్చినప్పుడల్లా ఆరు నెల్ల వంశం అని పిలుస్తున్నరు జనాలంతా .... ఇజ్జత్ పోతంది బయట ..

చమురయ్య :పోరా నువ్వు కూడా మొగోని లెక్క మాట్లాడుతన్నవ్..

పుట్టని కొడుకు:  ఆ ...మొగుణ్ణి కాబట్టే మొగోని లెక్క మాట్లాడుతన్న ...పెళ్లయిన ఆడపిల్లకు మొగుడొక్కడే ఉంటడు...కానీ పెళ్లయిన మొగోనికి అమ్మ నాన్న, ఆఫీసు, అప్పులు , ఆవకాయ బద్ద అన్నీ ఉంటాయి.వాటన్నిటిని హ్యాండిల్ చేసి పెళ్ళాం దగ్గరికచ్చే సరికి నువ్వేం చేస్తన్నావ్ ...అక్కల్ని నీ దగ్గరికి తెచ్చుకుంటన్నవ్ ...ఇగ  బొంగా....కుక్కను పెంచుకున్నోడన్న ప్రశాంతంగా ఉంటాడు గని నీ కూతుర్లను పెళ్లి చేసుకున్నోళ్లు మాత్రం సంక నాకి పోతండ్రు ....  

పెద్దోడు అమ్మ నాన్నలతోని ఉంటుండని పెద్దక్కను తీసుకచ్చి ఇంట్ల పెట్టుకున్నవ్..రెండో వానికి అప్పులున్నాయ్ అని రెండో అక్కను ఇంట్ల పెట్టుకున్నవ్..ఇగ మూడో అక్కను ఎం చేత్తవో ...చూడాలే ...ఆ.. గుర్తుకచ్చింది ..అదేదో రజనీకాంత్ సినిమాల పెళ్ళికొడుకు వీడే కానీ ఆ షర్ట్ నాది అన్నట్టు.... పని చేసేది అల్లుడే గని ఆ పని నేను పెట్టించిందే....జీతం తెచ్చేది అయిన్నే ....కానీ జీవితం ఇప్పించింది నేను ...కారు కొన్నది అయిన్నే గని కష్టమంతా నాదే ... అంటావ్....  అయినా నువ్ పెద్ద బావ పని గురించి ఐదు వేలు నువ్ పెట్టావో లేదో కూడా తెలియదు ...దానికే నగర్ మొత్తం చెప్పినవ్...రెండో బావయే నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బులే ఇచ్చి  ....నేను పెట్టిన అని ఊర్లో సగం మందికి చెప్పినోనివి ....ఇగ దొంగరేణి జాబ్ గురించి అయితే ఊరు మొత్తం టామ్ టామ్ చేస్తవ్..

చమురయ్య : నన్ను కనని తండ్రి అని కూడా చూడకుండా తిడుతున్నావ్ ....రా నువ్వు 

పుట్టని కొడుకు: హా ....తిట్టక ....స్ట్రెయిట్ గా ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు ....నువ్ ఏరి కోరి ముగ్గురు అల్లుళ్ళని బీదావరిఖని నుంచే ఎందుకు తెచుకున్నావ్ చెప్పు ....

చమురయ్య  సైలెంట్ గా ఉంటాడు...

పుట్టని కొడుకు:  నేను చెప్తా విను ......నీకు.. అమ్మకు నేను లేను కాబట్టి ...ఓన్లీ కూతుర్లే కాబట్టి ....రామ్ గోపాల్ వర్మ వోడ్క తాగేటపుడు అదేదో చెప్తాడు ...ఆయన్ ర్యాండ్ థియరీ నో....అనన్య పాండే థియరీ నో....దాని ప్రకారం ఫ్యూచర్ లో మీ సేఫ్టీ కోసం ...ముసలి వాళ్ళయ్యాక మిమ్మల్ని చూసుకోవడం కోసం అవసరం ఉన్నపుడు లేనపుడు డబ్బులిచ్చి ....భార్య భర్తల మధ్య చిన్న గొడవ అయినా సరే దాన్ని పెద్దది చేసి గొడవ పెట్టిస్తున్నారు ....ఇక్కడ మీ కూతుర్లకు మనసులో ఏముంటుంది ....మా వాళ్ళు మాకు సహాయం చేశారు కదా అని ఉంటుంది....కానీ అల్లుళ్ళకి ఏముంటుంది గొడవ అయితే సర్ది చెప్పాలి కానీ నెలల తరబడి ఉంచుకోవడం ఏంటి అని మీ పైన ద్వేషం పెంచుకుంటారు. ...కానీ పాపం వాళ్లకు తెలియంది ఏంటంటే మీక్కూడా కావాల్సింది అదే ....మీ అల్లుళ్ళు ఎంత ద్వేషిస్తే ...మీ కూతుర్లు అంత ప్రేమిస్తారని మీకు తెలుసు ...  

చమురయ్య: అరేయ్ నువ్ అట్ల తిట్టకు రా....తాగిందంతా దిగిపోయింది....రా మళ్లి ఓ పెగ్గేద్దాం ...

పుట్టని కొడుకు: నాన్న నేను నీకు ఎందుకు పుట్టలేదో తెలుసా ...నిన్ను చూసి చూసి నేను కూడా ఎక్కడ తాగుబోతు గా తయారవుతానని పుట్టలేదు నాన్న ...బాయ్ నాన్న ...అమ్మను అడిగినట్టు చెప్పు.....నిన్ను మాటలతోని కడిగిన అని చెప్పు ...

చమురయ్య:రేయ్ నువ్ ఇప్పుడు పోకు రా...మనం బావను కొట్టాలి రా..రా..వుండు రా ...వుండు రా (అంటుంటే బిందెడు నీళ్లు చమురయ్య మొహం మీద పడతాయి)

చమురయ్య దెబ్బకు నిద్రలోంచి లేచి కూర్చుంటాడు ........

దుర్వార్త : ఏందయ్యా ఏందీ ...ఆ కలవరింతలు ...కొడుకేంది ....పోవుడేంది ....ఎదో మధ్య మధ్య ల అల్లుణ్ణి  కొట్టాలి అంటన్నవ్ ..... ఇంకా మన పెద్దదాని వయసే 14....పెళ్లే ఇంకా కాలేదు ....అప్పుడే అల్లున్నీ కొట్టుడు గురించి ఆలోచిస్తున్నవా .....  

చమురయ్య : అది కాదె దుర్వార్త ....పొద్దున్నే లేచి నీ మొహమే చూసినట్టున్న...అందుకే పీడ కలలొచ్చినయ్ ......        

ఈ సారి బిందె టంగ్ .....మన్న శబ్దం వినబడింది. దుర్వార్త చేతిలో ఉన్న బిందె సొట్ట పడింది ...దూరం నుంచి భవిత భలే ..భలే ...అంటూ నవ్వింది ....కానీ చతికిల పడ్డ చమురయ్య కోలుకోవడానికి రెండు రోజులు పట్టింది.

 

Tuesday, September 22, 2020

ఓ అనిత కథ

 ఈ కథ ఎవ్వరినీ ఉద్దేశించి కాదు....కేవలం కల్పితం మాత్రమే....ఊరి పేర్లు వాడుకున్నా ఈ కథ మాదే అని లబో దిబో మొత్తుకుని కేసులేస్తే కూడా ఇవ్వడానికి చిల్లి గారే కూడా లేనందున ఊరి పేర్లు కూడా నిజమైనవి వాడుకోవట్లేదు. మరి రీడర్స్ అందరూ గమనించాలి....


ఇక కథ లోకి వెళ్తే బస్సు లోనా? ప్లెయిన్ లోనా? అని అడక్కండి...బడ్జెట్ లేదు అందుకని నడుచు కుంటూనే వెళ్దాం... అది బీదావరిఖని అనే పట్టణం...అందులో ఉమేష్ నగర్ అనే ఏరియా....సమయం : వైన్ షాపుల్లో సెకండ్ క్వార్టర్ అమ్మే సమయం (ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్ మన క్యారెక్టర్ తాగేశాడు)

అప్పన తన మన అందరికీ దండాల్లన్న... అప్పన్న తన మన... అందరికీ దండాల్లన్న తాగినోడినోట నిజం తన్నుకొని  వత్తాదన్నా...అంటూ సూపర్ స్టార్ కృష్ణ పాటను ఖూని చేసుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. వచ్చి రాగానే కూతుర్ల పేలు కుక్కుతున్న వాళ్ళ ఆవిడ దుర్వార్త అలియాస్ దువర్ణ ను చూసి కుక్కకున్నా సరే కుక్కిన పేను లాగా సైలెంట్ ఐపోయాడు. అది ఆయన కూతుర్లుగమనించారు. అలానే మంచం లో పడుకుండి పోయాడు. నిద్ర లోకి జారుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని జారుడు బల్ల లాంటిది లేక పోవడం తో పాపం నిద్ర పట్టట్లేదు అతనికి...ఇంతకీ ఇతని పేరు చెప్పలేదు కదూ ఇతని పేరు చమురయ్య.

అతను సగం నిద్రలో కలవరిస్తున్నాడు.

"ఏయ్...చెట్టుకి కొమ్మ బరువా...కొమ్మకి పండు బరువా... పండు కి తొక్క బరువా...నా బిడ్డను నేనే సాదుకుంటా నా బిడ్డ బిడ్డలను నేనే సాదుకుంటా ...

సరిగ్గా అప్పుడే భూ లోకం లో ఎవరి కోరిక తీరుద్దామా అంటూ తిరుగుతున్న దేవతలకు అతని "తాగుబోతు మాటల్లో తండ్రి ప్రేమ" కనిపించింది. అంతే "తదాస్తు" అని దీవించారు దేవతలు...(నోట్ దిస్ పాయింట్ యువరానర్...ఈ పాయింట్ మీదే కథంతా తిరుగుతుంది)

సమయం: వైన్ షాపులు బంద్ అవడానికి సరిగ్గా అరగంట ముందు....

మన చమురయ్య రాష్ట్రప్రభుత్వ ఖజానా నింపడానికి వెళ్తున్న టైం లో...

నాన్న....అంటూ అరుపు...

వెనక్కి తిరిగి చూసేసరికి స్వర్ణ( పది సం"లు), అనిత (ఏడు), భవిత (నాలుగు) (చమురయ్య కూతుర్లు) 

స్వర్ణ: నాన్న నీకు సరిగా మాటలు రాకపోయినప్పటికీ మీడియా ముందు బాలకృష్ణ లా బానే మేనేజ్ చేస్తావ్ కదా బయట...మరి అమ్మ ను చూడగానే ఎందుకు సూర్యకాంతాన్ని చూసిన రేలంగి లా వణికి పోతావ్... సైలెంట్ ఐపోతావ్.

చమురయ్య "ష్" అంటూ తన కూతురు నోరు మూసి ...

గట్టిగా మాట్లాడకండే...మీ అమ్మ వింటుంది...నేనైతే ఓన్లీ మీడియా ముందు బాలకృష్ణ నే...కాని మీ అమ్మ లెజెండ్ లో బాలకృష్ణ....చంపేస్తుంది...అసలే దాని పేరు దుర్వార్త. మీ మాటలు విందంటే దాని నోటి నుండి వచ్చే దుర్వార్తలు నేను వినలేను.

రెండో కూతురు అనిత కలుగ జేసుకుంటూ...నాన్న అమ్మ పేరు దువర్ణ కదా ...దుర్వార్త అంటావేంటి...

చమురయ్య : దాని అసలు  పేరు దుర్వార్తే కాని పెళ్లి ఐన తర్వాత దువర్ణ గా మారింది. ఆ పేరు కూడా ఎలా మారిందో తెలుసా ....

అనిత : ఎలా నాన్న ..

చమురయ్య :ఆ రోజు నాకు రన్నింగ్ పోటీ..గెలిస్తే దొంగరేణి జాబు వస్తది. మీ అమ్మ చెప్పింది దొంగరేణి జాబు కొడితే మతం మార్చుకుని పేరు మార్చుకుంటానని..అంతే నాకు వెయ్యి కుక్కల బలం వచ్చింది.

భవిత (బుజ్జి బుజ్జి మాటలతో) : అదేంటి నాన్న అందరూ వెయ్యి ఏనుగుల బలం అంటారు కదా...ఈ వెయ్యి కుక్కలేంటి నాన్న ... 

చమురయ్య :ఏనుగులు అయితే పరిగెత్త లేవు కదా రా బుజ్జి కన్నా..అందుకే కుక్కలతో పోల్చా..కుక్కలైతే బాగా పరిగెడతాయి కదా.. మరి డాడి కి కుక్కల శక్తి వస్తేనే కదా పరిగేట్టేది... 

భవిత (బుజ్జి బుజ్జి మాటలతో) ఓకే... కంటిన్యూ ..కంటిన్యూ

చమురయ్య: ఇప్పుడంటే ఏజ్ కొంచం ఎక్కువై డైలీ హాఫ్ తాగుతున్నాను కాని అప్పుడైతే డైలీ రిక్షా లాగి లాగి ఒక ఫుల్ తాగేవాన్ని...అలాంటి నేను గెలవాలనే తపన తో మందు ఒక్క చుక్క కూడా ముట్టుకోకుండా గెలిచేందుకు దాటే లైన్ దగ్గర "ఇక్కడ ఫ్రీ గా మందు పోయబడును" అనే బోర్డును ఊహించుకుని పరిగెత్తాను చూడండ్రా .....దెబ్బకు జాబు వచ్చింది...మీ అమ్మ పేరు మారింది...

భవిత (బుజ్జి బుజ్జి మాటలతో): ఓహో..అయితే మీ అన్న అక్కడ "ఇక్కడ ఫ్రీ గా మందు పోయబడును" అనే బోర్డును ఊహించుకోలేదా డాడి...

 చమురయ్య:ఎందుకు కన్నలు అట్ల అడిగినవ్...

భవిత (బుజ్జి బుజ్జి మాటలతో): పెదడాడికి దొంగరేణి పని రాలే కదా డాడి అందుకు...

చమురయ్య: హేయ్...జబర్దస్త్ పంచు....

భవిత: హి,,హి,,హి .. 

స్వర్ణ: నాన్న నాకు ఇంకో డౌట్...నువ్ తాగినపుడల్లా "చెట్టుకి కొమ్మ బరువా...కొమ్మకి పండు బరువా... పండు కి తొక్క బరువా...నా బిడ్డను నేనే సాదుకుంటా నా బిడ్డ బిడ్డలను నేనే సాదుతా "  అని ఎందుకంటావ్ నాన్న ....

చమురయ్య: అదేమోరా... చిన్నప్పటి నుండి నాకు తాగితే  నా నోటి నుండి ఆ డైలాగే అస్తది.. ఎందుకత్తదో ఆ దేవుడే చెప్పాలే... అంటూ రాష్ట్రప్రభుత్వ ఖజానా నింపడానికి వెళ్ళాడు..

తరువాత రోజు ....ఆడాళ్ళు జడలు అల్లుకునే సమయం....

(ముగ్గురు పిల్లలు కలిసి జడ అల్లుకుంటున్న వాళ్ళ అమ్మ దుర్వార్త దగ్గరకు వెళ్లి...) అమ్మా ...నాన్న నీకు భయపడతాడు కదా ఎందుకమ్మా ... 

దుర్వార్త: నాన్న నాకెందుకు భయపడుతాడు రా ..

భవిత (బుజ్జి బుజ్జి మాటలతో): అవును భయపడడు....సుసూ పోసుకుంటాడు..హి,,హి ,,హి ..

స్వర్ణ: నువ్ ఆగవే ....నువ్ చెప్పమ్మా....

దుర్వార్త: జ్వరం వచ్చినప్పుడు పొద్దున్న ఒక టాబ్లెట్ మధ్యాహ్నం ఒక సిరప్..రాత్రొక సూది ఎసుకుంటాం కదా ...అలానే చాన్సు వచ్చినప్పుడల్లా పొద్దునోసారి అలగాలి.. మధ్యాహ్నం ఓ సారి ఏడవాలి..రాత్రోసారి గొడవ పెట్టుకోవాలి..అప్పుడప్పుడు సూసైడ్ చేస్కోవాలే...బెదిరించాలే ..అదిరించాలే...అర్థమయిందా...

స్వర్ణ : అయినా మాట వినక పోతే ..

దుర్వార్త: మీరు కొంచం గొడవ స్టార్ట్ చేయండి..దాన్ని అటు లాగి ఇటు పీకి..పెద్దది చేసి దాంట్లో వాళ్ళ అమ్మను నాన్నను లాగి నానా రభస చేసి వాళ్ళ పరువు బజారుకీడ్చే భాద్యత నాది...

అనిత: అయినా వినక పోతే ....

దుర్వార్త:పెట్టె, బేడా సర్దుకుని ఓ ఆర్నెల్లు ఇంటికొచ్చేయండి....నాకేమైనా కొడుకులా పాడా ...కోడలు మిమ్మల్ని ఏమైనా అనడానికి..మీకు మీ మొగుడి మీద కసి తీరుతుంది..నాకు ఇంట్లో పని చేయడానికి ఆసరాగా ఉంటారు....పని మనుషుల గొడవా తప్పుతుంది.

స్వర్ణ : (వీరత్వం తో) అమ్మా ....ఇదే నా ఆన...నీకు మాటిస్తున్నా అమ్మా ...నీ పరువు నిలబెడతా..

నా మొగుడు నా మాట వినక పోతే ప్రాణ త్యాగానికైనా సిద్దమమ్మా...

అనిత: ( సేం అదే వీరత్వం తో) అమ్మా ... దానియ్ ఒక ఆన అయితే నాయి మూడు ఆనలమ్మ ...

దుర్వార్త: మూడు ఆనలేంటే ....

అనిత: అంటే ఆన... ఆన... ఆన..జయం మనదేరా లో వెంకటేష్ టైపమ్మా....

దుర్వార్త: సరే చెప్పి సావ్..

అనిత: నేనెందుకు సత్తమ్మా ...అదంటే బిత్తిరిది..సూసైడ్ అయినా చేసుకుంటది...నేను నా జీవితాంతం ఇక్కడే తినుకుంటుంటా గాని అవసరమైతే విడాకులైనా తీసుకుంటగని నీ మాట మాత్రం జవదాటను....

దుర్వార్త: నువ్వేం చేప్తలేవెందే  భవిత...ఒట్టెయ్...

భవిత (బుజ్జి బుజ్జి మాటలతో): పెద్దదంటే ముందు పుట్టింది దానికి నువ్ తొందరగా పెళ్లి జేత్తవ్...దానికి  బోచ్చడుటైం ఉంటది లోల్లికి.. దాని పెళ్లి అప్పు తీర్చేసరికి రెండో దానికి 24  అత్తయ్. అప్పుడు దానికి పెళ్లి జేత్తవ్... దానిక్కూడాఎంతో కొంత టైముంటది లోల్లికి ... దాని అప్పు తీర్చేసరికి నాకు 30 అత్తయ్. గా వయసు ల పెళ్లి జేస్కొని నా మొగునితోని గొడవపెట్టుకోవాల్నా....నేనిన నీ మాట ....నా మొగునితోని తన్నులన్న తింటగని నేనైతే అక్కల లెక్క చెయ్య.....నీ మాటిన... 

దుర్వార్త: (ఆశ్చర్యం తో ) ఆహ్...


(ఇంకా ఉంది)

so friends it is my first episode...  

నచ్చితే ఊ కొట్టండి...నచ్చకపోతే మాత్రం ఛీ కొట్టకండి...జస్ట్ కామెంట్ చేయండి..        

 

Wednesday, September 11, 2013

అత్తారింటి నుండి దారేది ...

నదులన్నీ వచ్చి సముద్రం లో కలిసినట్టు ఈ కాలేజ్ కి ఎవడు వచ్చినా సరే వాడిని కలవాల్సిందే.  వాడేదో ప్రిన్సిపాలో కరస్పాండెంట్ అనో అనుకుంటే మీరు పొరబడినట్టే, వాడు అందరి నోట్లో స్పూన్, ఈ కాలేజ్ ప్యున్, వాడి పేరు  అశ్విన్. వాడు నాకున్న ఒక్కగానొక్క ఫ్రెండ్ . వాడి గురించే నేనిక్కడ వెయిట్ చేస్తున్నాను. వాడు ఒచ్చేంత లోపల చిన్న ఇంట్రడక్షన్ వాడి వీక్నెస్  గురించి.

వీడికి వింత వింత పాటల్ని రింగ్ టోన్స్ గా, కాలర్ ట్యూన్స్ గా పెట్టుకునే పిచ్చి. వీడితో ఎవరికైనా అవసరముండి ఫోన్ చేస్తే ఆ రోజుతో వాడికి ఈ భూమ్మీద చిల్లీ చికెన్, చికెన్ బిర్యాని చెల్లి పోయినట్లే . వీడు కావాలనే అవతలి వాడు పాట వినాలని మూడు నాలుగు సార్లకి గాని ఫోన్ లిఫ్ట్ చేయడు, వీడు ఫోన్ లిఫ్ట్ చేసే లోపల అవతలి వాడికి వాంతులు విరేచనాలు అయి 108 అంబులెన్స్ లో ఉంటాడు . వీడి పుణ్యమా అని 108 ఉద్యోగులకి పని ఎక్కువై సమ్మె చేసి మరీ జీతాలు పెంచుకున్నారు.  ఆ మధ్య హైదరాబాదులో సగం మంది వాంతులు విరేచనాలతో బాధ పడుతున్నారని తెలిసి ఓ టీవీ చానల్ వారు " హైదరాబాదు కి వాంతులవుతున్నాయి, దీనికి మొగుడెవరు?" అనే పేరు పెట్టి స్టింగ్ ఆపరేషన్ చేస్తే ఆ మొగుడు వీడే అని తెలిసింది. అంతగా భయపెట్టే ఆ కాలర్ ట్యూన్ పాట ఏంటి? అనుకుంటున్నారా ... అయితే మచ్చుకి ఒకటి ఒదులుతా కాచుకోండి.... వాంతులు విరేచనాలు చేసుకోండి ....

కావో కార వడా....
మురుకు మసాల్ వడా....
పైసలుంటే ఇడ్లి వడా....
లేదంటే పస్తుల దడా ....

కావో కార వడా....
మురుకు మసాల్ వడా....
పైసలుంటే ఇడ్లి వడా....
లేదంటే పస్తుల దడా ....
(పాఠకులు మీరు పై పాట శకుని అనే తమిళ్డబ్బింగ్ సినిమాలోదని గమనించి దానికి దూరంగా ఉండగలరని మనవి)
ఈ రకమైన పాటల్ని పదే  పదే వింటే  వాంతులు విరేచనాలు కాకుండా మరేం అవుతాయండి ...

అదిగో మాటల్లోనే అశ్విన్ వచ్చాడు.
రేయ్ అశ్విన్ సాయంత్రం సినిమా కెళ్దాం. రెడి గా ఉండు అని చెప్పి నేను వెళ్లి పొయాను.
అనుకున్న టైం కంటే ముందే చేరుకున్నాం సినిమా హాలు దగ్గరికి. టికెట్లు తీసుకున్నాం. సినిమా కి చాలా టైం ఉంది ఏం చేద్దాం అనుకునేంత లోపే దూరంగా ....

సోది చెబుతామయ్యా సోది చెబుతాం...
జరిగింది జరిగిందని సెబుతాం....
జరగంది జరగలేదని సెబుతాం....
జరగ బోయేది జరుగుతాదని సేబుతం....
రండి దొరా రండి ....
ఓ పచ్చ నోటిచ్చి నా నోటెంబట  మీ జాతకాలు ఇనుకోండి దొరా...

మా ఇద్దరి భవిష్యత్ గురించి చెప్పు .... అని  వంద నోటు అక్కడ పెట్టాను నేను...
వాడు మళ్ళి  ముందు నుంచి స్టార్ట్ చేసాడు.

సోది చెబుతామయ్యా సోది చెబుతాం...
జరిగింది జరిగిందని సెబుతాం....
జరగంది జరగలేదని సెబుతాం....
జరగ బోయేది జరుగుతాదని సేబుతం....
ఆంధ్ర దేసం అతలా కుతల మవుతాదని సెబుతాను....
అత్తారింటికి దారేది సినిమా వాయిదా పడద్దని సెబుతాను....
డబ్బింగ్ సీరియల్లు డబ్బుల కోసమే అని సెబుతాను....
గవర్నమెంటు ఆఫీసర్లందరికి రిటైర్మెంట్ ఉంటాదని సెబుతాను....
రిటైర్మెంట్ లేని ఫీల్డు రాజకీయమే అని సెబుతాను....
ఇనుకోండి దొరా ఇనుకోండి ...

వాళ్ళందరి గురించి మాకెందుకయ్యా, ముందు మా గురించి చెప్పు....

సినిమాల్లో సిరంజీవి మోహన్ బాబు
కార్టునుల్లో టాం అండ్ జెర్రీ
బ్లాగుల్లో మీరిద్దరు.
మీ ఇద్దరికీ క్లైవ్ లాయిడ్ కి, సెల్యు లాయిడ్ కి ఉన్నంత తేడా ఉంది .... ఇంకా సెప్పాలంటే తెర సాపకి, సొర సాపకి ఉన్నంత తేడా ఉంది. అయినా కాని మీ టెన్షను అటేన్షను ఒకటి గా ఉంటాది దొరా...
చిరంజీవి కూతురి పెళ్లి, ఉదయకిరణ్ భవిష్యత్ కి వచ్చిన్దన్నట్లు, మీలో ఒకరి పెళ్లి మరొకరి ప్రేమ లొల్లి కి కారణమవుతాది దొరా ...

ఆగి ఇక్కడనుంచి నేను చెబుతా అంటూ అశ్విన్ గాడు తగులుకున్నాడు...

అది జరగకుండా ఉండాలంటే నా దగ్గర ఒక మాంచి తాయత్తు ఉన్నాది దొరా,
కాని ఖర్సే ఎక్కువవుతాది దొరా, ఓ వెయ్యి నూట పదహార్లు ఇచ్చుకోండి దొరా...
కట్టి పెడతాను, ఇది కడితే మూడు షూటింగులు, ఆరు రిబ్బను కటింగులు ఉన్న హీరొయిన్ లాగా ఎలిగి పోతారు దొరా..
ఇదేనా నువ్ చెప్పేది?
అవును దొరా... కాని సిన్న సవరింపు దొరా... మీరు మగవారు కద దొరా , అందుకే చేతిలో  మూడు సినిమాలు, ఆరు యాడ్లు ఉన్న హీరో లాగా కలకలలాడుతారు దొరా...
నేను చెప్పలా?  అటు తిప్పి ఇటు తిప్పి ఇక్కడికే తీసుకొస్తాడని... అన్నాడు అశ్విన్ గాడు.
సరే గాని దొరా సినిమా కి టైం అవుతుంది మేం లోపలికి వెళ్ళాలి. డబ్బులున్నపుడు చూద్దాం లే అని సినిమా హాలు లోపలి వెళ్లి పోయాము.

ఆ కోయ దొర  చెప్పింది మేం నమ్ముతామని ఆ రోజు అనుకోలేదు, కాని ఆ నమ్మే రోజు త్వరగానే వచ్చింది ...   అది ఎలాగో కింద మీరే చదవండి...

అశ్విన్ వాళ్ళ అమ్మ దగ్గరి నుండి నాకు సడెన్ గా ఒక రోజు ఫోన్ వచ్చింది.
'బాబు అశ్విన్ కి మంచి సంబంధం వచ్చింది వీడేమో పెళ్లి చేసుకోను 'ఇలాగే గడ్డం చక్రవర్తి లాగా మీసం సామంత రాజు లాగ' ఉంటాను అంటున్నాడు. పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఇంకా. నువ్వైనా వచ్చి సర్ది చెప్పు కిశోర్'.
వెంటనే బయలుదేరాను నేను ...
వెళ్ళీ వెళ్ళగానే ఆవేశంగా డైలాగ్ స్టార్ట్ చేసాను .

రేయ్ అశ్విన్... జీవితంలో ఒక వయసొచ్చాక మనకు రెండు దారులుంటాయి . ఒక దాంట్లో మనకు చాలా మంది అమ్మాయిలుంటారు, తిరగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అక్కడంతా మన ఇష్టమే ఉంటుంది. చివరికి మనకి కష్టమే మిగులుతుంది. ఎవరూ మిగలరు. ఇక రెండో దాంట్లో మనకోసం ఒక అమ్మాయే ఉంటుంది. ఏది చేసినా తనతోనే చేయాలి. మొదట్లో అంతా కష్టంగానే ఉంటుంది. కాని చివరికి అంతా నీ ఇష్టంగానే తయారవుతుంది. నువ్వంటే ప్రాణమిచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు . ఆ రెండో దారి పేరే రా పెళ్ళి .

నేను ఈ డైలాగు చెప్పటం పూర్తి అయిన వెంటనే అశ్విన్ గాడు పెళ్ళికి ఒప్పుకున్నాడు . అది చూసిన చాలామంది చప్పట్లు కొట్టారు. అశ్విన్ గాడి మామ ఆనందం లో మందు కొట్టాడు, దూరంగా ఒక అమ్మాయి మాత్రం నాకు కన్ను కొట్టింది.
చూడు మిస్టర్ నీ పేరేంటి? అడిగిందా అమ్మాయి.
కిశోర్...  అని నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
ఇక నుంచి నీపేరు శ్రుతీ కిశోర్. నేను రొటీన్ గా ఐ లవ్ యూ... అని చెప్పను. కాని ఒక్కటి మాత్రం చెప్పగలను, నీ లైఫ్ సెటిల్ అయి పోయింది అంటూ అక్కడి నుంచి వెళ్ళ బోయింది.

చూడు బంగారం ... నీ అభిప్రాయం చెప్పావు, నాది కూడా వినాలి కదా విను.
ఈ ప్రపంచం అంతరించి పోయేంత వరకు కూడా అంతరించకుండా ఉండేవి రెండే రెండు....
ఒకటి అడుక్కోవటం ... రెండు ప్రేమించటం ....
ఈ రెండింటికి పైసా ఖర్చుండదు, అంతా ప్రాఫిటే... లాస్ అయ్యేది ఏమి ఉండదు అంతా లాభమే ...
ఇక నా విషయానికి వస్తే నాకు ఆ రెండు ఒకటే. ఖర్చు పెట్టకుండా, కష్టపడకుండా వచ్చేది ఏదీ నాకు వద్దు...
సో...  నువ్ నాకు వద్దు. బై అని చెప్పాను.
కాని తను మాత్రం స్టిల్ ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళి పోయింది.
హిట్టు సినిమా టికెట్టు బ్లాక్ లో కొనిచ్చి చూడమంటే వద్దంటున్నావేంటి రా... అన్నాడు అశ్విన్ గాడు.
రేయ్ అమ్మాయి తో లవింగ్, తర్వాత ఫ్రెండ్స్ తో షేరింగ్, వాళ్ళకు పార్టీ ఇవ్వడానికి అప్పులోళ్ళ దగ్గర బెగ్గింగ్, కాలేజ్ దగ్గర డ్రాపింగ్, గోల్డ్ రింగ్ తాకట్టు పెట్టి షాపింగ్, ఆ విషయం ఇంట్లో తెలియకుండా కవరింగ్, వాళ్ళింట్లో తెలుస్తుందేమోనని ఫియరింగ్, తెలిసిన తర్వాత వాళ్ళ బ్రదర్ తో ఫైటింగ్, అది తెలిసి వాళ్ళ నాన్న మన మీద కేసు పెడితే జైలు లో బెయిల్ కోసం వైటింగ్, ఆ అమ్మాయికి పెళ్ళయితే బార్ లో డ్రింకింగ్, ఇంటికొచ్చి వామ్థింగ్, రోడ్డు మీద పిచ్చి కుక్క లా రోమింగ్.
ప్రేమ అనే ఒక హంగు కోసం ఇన్ని ఇంగులు అవసరమంటావారా ?
ఆ తర్వాత వారం రోజులకి...
ఎప్పుడూ లేంది ఏంట్రా ఎక్కిళ్ళు ఆగకుండా వస్తున్నాయ్...
పక్కకి తిరిగి ఓ లుక్కేసుకో ... నీకే తెలుస్తుంది అన్నాడు అశ్విన్ గాడు.
ఇంకెవరు తలచుకుంటారు నేనే, ఇదిగో కిశోర్... నీళ్ళు .. నా ప్రేమ కలిపి ఇస్తున్నా...  అంటూ దిగబడిపోయింది శృతి.
అమ్మా! ఆశ దోష డామినోస్ పిజ్జా! నీళ్ళిచ్చి నన్ను నీ ప్రేమ లో నిలువునా ముంచుదాం అనుకుంటున్నావా ? అదేమ్  కుదరదు నేను తాగానంటే తాగను.
అమ్మాయి ఆఫర్ చేస్తే ఆసిడ్ అయినా సరే అలవోక గా తాగేయాలి కాని నువెంట్రా? ఎండా కాలంలో అమృతం లాంటి నీళ్ళు ఇచ్చినా వద్దంటున్నావ్, అది కూడా హైదరాబాదు లో. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం?
చెప్తా విను...
ఖల్లు ఖల్లున దగ్గే తల్లి, ఆ పక్కనే పెళ్లి కాని చెల్లి, తమ్ముడికి టిబి అన్నకు కాన్సర్, చేతిలో ఫైల్ పట్టుకుని ఉద్యోగం కోసం రోడ్లు పట్టుకుని తిరిగే హీరో, ఇవి రా అప్పట్లో హీరో కు కష్టాలు. కాని ఇప్పుడు....
కన్న కొడుకు కోసం కట్టుకునే మొగుడి మీదే సెటైర్లు వేసే తల్లి, పెళ్లి అయి ఫారిన్ లో సెటిల్ ఐన చెల్లి, బాబి బ్యాంకు మేనేజర్, అన్న సాఫ్ట్వేర్, హీరో బలాదూర్, ఆ బలాదూర్ కి బైకు వెనకల కూర్చుని క్యాష్ ఎలా ఖర్చు పెట్టాలో చెప్పే నీ లాంటి ఫ్రెండ్.
వీళ్ళతో సాఫీ గా సాగిపోయే నా జీవితం లోకి ఒక అమ్మాయి రావడం, ఆమె ప్రేమ కోసం నేను కష్టాలు పడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్లి పొయాను.

మరుసటి రోజు డైరెక్ట్ గా ఇంటికి వచ్చింది శ్రుతి. ఆ టైం లో నేను అశ్విన్ మాత్రమే రూం లో ఉన్నామ్.
రేయ్ కిషోర్ నా ప్రేమ ఒప్పుకో, లేదంటే ఈ విషం తాగి నేను చచ్చి పోతాను అంటూ బాటిల్ తీసింది.
కోపం వచ్చి ఒక్కటి పీకాను.
అది కాదు రా కిషోర్ నిన్ను పడేస్తాననే నమ్మకం తో మా నాన్న తో కూడా ప్రేమ విషయం చెప్పాను రా. తను కూడా ఒప్పుకున్నాడు . మా నాన్నసలే ఫాక్షనిస్టు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు.
అయినా అంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉన్నావ్ నన్ను పడేస్తానని?
నాకు మీ ఫ్రెండ్ ఆశ్వినే చెప్పాడు "డస్ట్ బిన్ లో కోక్ టిన్ పడేసినంత ఈజీ గా నిన్ను ప్రేమ లో పడేయోచ్చని" నిన్ను ఆ డస్ట్ బిన్ లో పడేయడానికి, సారి సారి ... ప్రేమ లో పడేయడానికి హెల్ప్ చేస్తానని నా దగ్గర ఐదు వేలు కూడా తీసుకున్నాడు.
లంచమా?... అని అశ్విన్ వైపు తిరిగి చూసే సరికి వాడు పక్కకు లేడు, బయట బైక్ ఎక్కి కిక్ కొడుతున్నాడు, కొడుతున్నాడు, కొడుతూనే ఉన్నాడు.
ఆపమ్మా అశ్విన్! బైక్ కి కీస్ పెట్టకుండా స్టార్ట్ అయ్యే బైకుల్ని మన అమ్మా నాన్నలింకా కొనియ్యలేదు కాని ఇట్రామ్మా కీస్ నా దగ్గర ఉన్నాయి.
వాడు రాగానే ఫాట్ ఫాట్ మని నాలుగు తగిలించి.... ఇప్పుడు చెప్పు నాన్న డబ్బులేం చేసావ్?
రెండు వేలు పెట్టి నీకె రేబాన్ గ్లాస్ కొనిచ్చా....
అమ్మా నా అశ్విన్ గా "వర్షం లో వేసుకొస్తే ఎక్కడ తడిచి పోతుందేమోనని రెయిన్ కోట్ ఇంట్లో దాచి పెట్టె నువ్వు రేబాన్ గ్లాస్ కొనిచ్చినపుడే డౌట్ వచ్చింది రా" ఆ డబ్బులెక్కడివని?
సరే గాని మిగతా మూడు వేలు?
ఐ.బి. ఎల్ లో సానియా మిర్జా గెలుస్తుందని బెట్ కట్టా....
నీయబ్బా బాడ్మింటన్ కి టెన్నిస్ కి తేడా తెలియకుండా ఎలా బెట్ కట్టావు రా? నిన్ను ఇలాగే ఒదిలి పెడితే 'భారత దేశ ప్రధాని గా బారక్ ఒబామా కూడా గెలుస్తాడని బెట్ కడతావు' రా... నీ ఎంకమ్మా...

మీ ఇద్దరి సంగతి పక్కన పెట్టండి, ముందు నా సంగతి ఆలోచించండి... రేపే మా నాన్న ఒస్తున్నాడు.
రేపు ఈ విషయం ఆయనకు  తెలిస్తే నన్నుఆ లొకేషన్ లోనే  చంపుతాడు, మిమ్మల్ని మాత్రం అవుట్ డోర్ తీసుకెళ్ళి మరీ పరిగెత్తించి, పరిగెత్తించి మరీ చంపుతాడు. కాబట్టి అందరి మంచి కి  చెబుతున్నా... రేయ్  కిషోర్ నన్ను ప్రేమించక పోయిన ప్లీజ్ నటించ రా  ప్రేమించినట్టు, తర్వాత నేను ఎలాగో మేనేజ్ చేసి మిమ్మల్ని బయట పడేస్తాను.  అంది శ్రుతి.నేను కూడా ఆలోచించి అసలే "మనం కలర్ తక్కువ, వెయిట్ ఎక్కువ" ఎండ లో పరిగెట్టడం అవసరమా?అని సరే అని ఒప్పుకున్నాను.

మేము ఆయన్ని కలవడానికి వాళ్ళ గెస్ట్ హౌస్ కి వెళ్ళాం, చూడడానికి శ్రుతి వాళ్ళ నాన్న సీమ సినిమాల్లో జయ ప్రకాష్ రెడ్డి లా ఉన్నాడు. ఆయన నన్ను చూడగానే ...
"బాబు సమర సింహా రెడ్డి ఎలా ఉన్నావ్? ఎన్ని రోజులకి చూసాను నాయనా? నువ్వు లేక సీమ సిన్నబోయింది, తెలంగాణా తెల్లారి పోయింది, ఆంద్ర అడ్రస్సు లేకుండా పోయింది, ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నావ్ నాయనా? చెన్నై లో ఉన్న మన శత్రువుల్ని చెయ్యి కాలు తీసెయ్య దానికి పోయినావ? కాశికి పోయినోల్లని ఖాతం చేయడానికి పోయినావా? బెంగళూర్ లో తల దాచుకున్నోలని బెంబేలెత్తియడానికి పోయినావ?" అంటూ భీకరంగా ఓ నవ్వు నవ్వాడు.
సార్ నేను సమర సింహా రెడ్డి ని కాదు.
నాకంతా తెలుసు అల్లుడు, నువెం మాట్లాడకు, ఏదో బిల్డప్పు కోసం ఆ డైలాగులు చెప్పా..  ఇక పై నువ్వే నా సమర సింహా రెడ్డి వి, ఇంద్ర సేన రెడ్డివి, ఆది కేశవా రెడ్డివి అంటూ నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు.
కాసేపటికి మా మామయ్యా అశ్విన్ గాడికేసి చూసి "అవున్రా అబ్బి అప్పట్నించి చూస్తా ఉన్నా బక్క చిక్కిన బెమ్మానందం లెక్కుండావ్. ఇంతకి నువ్వేం చేస్తుండావ్?" అని అడగ్గానే చటుక్కున అశ్విన్ గాడు
"ప్రత్యేక తెలంగాణా ఉద్యమం చేస్తుంటాను సార్" అని నాలిక్కరుచుకున్నాడు.
మా మామయ్య అనుచరులందరూ వీడికేసి గుర్రు గా చూస్తున్నారు...
గబ్బు నాయాల గబ్బు నాయాల అది కాదు రా  డబ్బులు సంపాదించడానికి ఎం చేస్తా ఉంటావ్ రా...
డబ్బుల కోసమా సార్ ... "అప్పుడప్పుడు సమైక్యాంద్ర ఉద్యమం లో పాల్గొంటాను సార్ " అన్నాడు.
ఆ డైలాగు తో నాకు వాడి ఫుచర్ అర్థమయింది.
దాంతో కారు వెనకాల సీట్లో నన్ను, కారు కి వేనకాల డిక్కి లో అశ్విన్ గాడిని కూర్చోబెట్టి మమ్మల్ని రాయల సీమ లో వాళ్ళ  ఊరికి తీసుకెళ్ళాడు.
మేం ఊల్లో కారు దిగగానే బొట్టు లేని వాళ్ళోచ్చి బొట్టు పెడుతున్నారు, చేతులు తెగిన వాళ్ళోచ్చి హత్తుకుంతున్నారు, అన్ని అయిపోయిన వాళ్ళోచ్చి హారతులిస్తున్నారు. అంతలో ఎవరో కాలు గోకుతున్నట్టు అన్పించి కిందికి చూసాను. వాడు మల్లి గోకుతున్నాడు. వాడికి కాళ్ళు  లేవు. వాణ్ని చూసి ముష్టి వాడు అనుకుని
'హే  ఈ టైం లో ముష్టి ఏంటి రా? పో' అన్నాను ..      
'అయ్యా!  అన్న నన్ను ముష్టి వాడు అనుకున్నాడన్నా నేను భరించలేను' అని ఓ పెద్ద కత్తి తీసి పొడుచు కొబోయాడు.
ఎదవ ఎక్కడ చస్తాడో అని టెన్షన్ లో నా చేయి తెగినా సరే అని వాణ్ని ఆపాను. అంతే....
వెనక నుంచి మా మామ వాయిస్ ...
"సెప్పినాను కదా రా ఈ సీమ కు సింహాన్ని తీసుకోస్తాండనని" రేయ్ ఇక నించి నీ సావే కాదు ఈ సీమ లో ఎవరి సావులుండవ్. ముందు అల్లుడి తల తెగి పడ్డాకే మన తలలు, అంతవరకు మీరు నిశ్చింతగా ఉండండి.
ఏంటి నా తల తెగి పడ్డాకా? అని శృతి వైపు చూసాను.
తను ఇక్కడిదంతా కామన్ అంటూ లోపలి వెళ్లి పోయింది.
బాగ్రౌండ్ లో  నాకు మర్యాద రామన్న టైటిల్ సాంగ్ వినబడుతుంది
"ఇన్నాళ్ళకి పెద పండగ వచ్చే వాకిన్డ్లకి మా కాలువలు గుచ్చే అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే హొ.... "
కొట్లిస్తది కోడిని కోసిస్తే మెల్లిస్థది మేకను బలి ఇస్తే, పోలమ్మకి వీడిని బలి  ఇస్తే హొ .... "
రేయ్  అశ్విన్ నీకు  బాగ్రౌండ్ లో ఎమైనా సాంగ్ వినబడుతుందా?
నా తరుపు నుంచి వినపడట్లేదు కాని ఇక్కడ వాళ్ళ తరుపు నుంచి అయితే వినపడ్తుంది రా .....
ఏం పాట రా అది?
"పండగలా దిగి వచ్చావు ప్రాణాలను అర్పిస్తావు               
మా ఊరికి అండయినావు, మా అయ్యకి బలి అవుతావు ....
అయ్యంటే ఫాక్షనిస్టు అయ్యంటే రేపిస్టు "

అలా నేను ఎంట్రా ఈ ఖర్మ అని బయపడుతుండగా ...
'అల్లుడు అమ్మాయి తో కలసి అలా సరదాగా షాపింగ్ చేసి రా' ... అని ఆర్డర్ వేసాడు మా మామయ్య.
ఆడాళ్ళతో అది పెళ్లి కాని అమ్మాయి తో షాపింగ్ అంటే మీకు తెలుసుకదండీ.అసలు నన్నడిగితే బాల కార్మికుల కష్టాలు, స్టాక్ ఎక్స్చేంజి నష్టాలు, ఆడపిల్లల షాపింగులు వీటికి ఆరంభమే కాని అంతం ఉండదు. గంట, రెండు, మూడు, నాలుగు గంటలు,మధ్యాహ్నం ఆ తర్వాత సాయంత్రం కూడా అయింది. అశ్విన్ గాడు నాకు కంపెనీ ఇస్తాడని తీసుకొస్తే వాడు సేల్స్ గర్ల్ కి కంపెనీ ఇస్తున్నాడు. నాకు చిరెత్తుకొచ్చి .... 
శ్రుతి ఇంకెంత సేపు అన్నాను నేను బిల్ కౌంటర్ దగ్గర నిలబడి...
నువ్ బిల్ కట్టు వస్తాను ... అంది శృతి దూరం నుంచి
అక్కడున్న రౌడి గాంగ్ నుంచి ఒకడు ....
"రేయ్ పాప బిల్లు కడితే వస్తాదట  రా... మనము కడదామా బిల్లు ?ఎయ్ పాప మేము బిల్లు కడతాం మాతో ఓ గంట వస్తావా? అని అడిగాడు ...
దాంతో నాకు ఎక్కడో కాలింది... ఆ కాలిన వాసన అశ్విన్ గాడు ముక్కు తో పసిగట్టి, వాడి నోటి తో నా చెవిలో " రేయ్ కిషోర్ మనకిప్పుడు ఈ ఫైటింగ్ సీన్ అవసరమంటావా? ఈ ఫైట్ చేస్తే నీ మీద అమ్మాయికి లవ్వు వాళ్ళ నాన్న కి కొవ్వు పెరిగి పోయి "అల్లుడు మా ఈ సీమ కి నువ్వే కరక్టు మొగుడు అని నిన్ను పర్మినెంటు గా ఇక్కడే ఉంచేసుకుంటాడు" జాగ్రత్త అన్నాడు.
రేయ్ ఏంట్రా ఆ గుసగుసలు? వి నీడ్ హేయర్ ఫైటింగ్.... స్క్రిప్ట్ డిమాండ్ చేస్తున్దిక్కడ... అన్నాడు ఒక రౌడి...
"రేయ్ రేయ్ రేయ్ నీది ఒక్క రేయ్  అయితే నాది మూడు రేయ్ లు. నేను తలుచుకుంటే హిందీ లో అభిషేక్ బచ్చన్, తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు డాన్స్ చేసినంత ఈజీ గా మీతో ఫైట్ చేసి మిమ్మల్ని  కోట్టి, పడగొట్టి, పార్సల్ కట్టేయగలను" కాని యాక్షన్ హీరో లే కలకాలం గుర్తుంది పోయే కామెడి వైపు వస్తుంటే నేను యాక్షన్ వైపు వెళ్ళడం ఎందుకని ఆలోచిస్తున్నా... "
ఆవేశంగా ఈ డైలాగు కంప్లీట్ చేసి మరోసారి ఇది రిపీట్ అవద్దు రిపీట్ అయిందో రిసల్ట్ వేరేలా ఉంటుందని ఒక చిటిక వేసా అంతే .
దూరంగా ఉన్న వాళ్ళ బొలెరో బ్లాస్ట్ అయింది, అందరు నా వంక ఆశ్చర్యం తో కూడిన భయం తో చూస్తున్నారు, రౌడి లందరూ పరిగెడుతున్నారు, అశ్విన్ గాడు  ఆల్రెడీ కింద పడిపోయాడు. శృతి అయితే 'యూ  ఆర్ ఆసం' అని అరిచి గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టింది. దాంతో నేను కూడా కింద పడిపోయాను.
కళ్ళు తెరిచి చూసే సరికి నేను అశ్విన్ గాడు హాస్పిటల్ లో పక్క పక్క బెడ్స్ లో ఉన్నామ్.
పక్కనే మా మామయ్య "ఎందల్లుడు అట్ట పడి  పొయినారు... నీ బిల్డప్పు కి, మన హోదా కి తగ్గట్టు గా ఉంటాదని నేనే ఓ నాటు బాంబు ఏయిన్చుండా, మీరేం కంగారు పడబాకండి" అని చెప్పి ఎవరినో నరికే ప్రోగ్రాం ఉందని వెళ్లి పోయాడు.
మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాము, అలాగే సీమ నుండి ఎలాగైనా తప్పించు కోవాలని కూడా డిసైడ్ కూడా అయ్యాము.
రేయ్ కిశోర్....
 నా మెదడు ఇప్పుడే పాదరసం లా పని చేసి ఒక పవర్ ఫుల్ ఐడియా వచ్చింది చెప్పమంటావ?
వద్దు రా అశ్విన్...
నీ మెదడు మెదడు లా పని  చేస్తేనే మనం ఫ్యాక్షనిస్ట్ ఇంట్లో ఉన్నాం, అదింకా మెదడు లా కాకుండా పాద రసం లా పని చేస్తుందంటే మనం ఏ పాకిస్తాన్ టెర్రరిసం క్యాంపు లోనో ఉంటాం. వద్దు నాని..
అది కాదు రా కిషోర్, తాగకుండా మనం పక్క వాడి బిల్లు కట్టే బదులు మనమే తాగి మన బిల్లు మనమే కట్టుకోవచ్చు కదా ...
అంటే? అడిగాను నేను ...
లాజిక్ అర్థం చెస్కొ... ''ప్రయత్నించకుండా పక్క వాడికి గెలుపు అప్ప చెప్పే బదులు, ప్రయత్నించి ఓడిపోవడం మంచిది కదా''
ఏమో రా అశ్విన్ నీ నోటి వెంబడి ప్రయత్నించడం, గెలవడం లాంటి మాటలు వింటుంటే నాక్కూడా ఆశ చిగురిస్తుంది రా..
చిగురించడం కాదు రా మన ప్లాన్ సక్సెస్ అయితే చిగురు తో పాటు పూలని,పళ్ళని కూడా ఇస్తుంది.
ఇంతకి ప్లానేంటి రా?...
సాయంత్రం మందు పార్టి అరేంజ్ చేసి మీ మామ ని పిలుద్దాం. ఎంత ఫాక్షనిస్టు అయినా సరే తన అల్లుడు తాగుబోతు అని తెలిస్తే భరించడు. సో పెళ్లి కాన్సిల్ చేస్తాడు.
ఒకవేళ అలా జక్కపోతే ... అడిగాను నేను.
ప్లాన్ "క"  కాకపోతే ప్లాన్ "గ"
మనం ఎలాగూ తాగి ఉంటాం కాబట్టి తాగినపుడు ఏ పిచ్చి కుక్క ని కూడా మనం లెక్క చేయం కాబట్టి మీ మామ అరచి గోల పెట్టినా సరే అరవకుండా బాంబు పెట్టినా సరే మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదని నువ్ చెప్పేయ్. అంతే.... ఎలా జరిగేది అలా జరుగుతుంది.
అనుకున్నట్టు గానే సాయంత్రం ప్రోగ్రాం పెట్టి మా మామ ని పిలిచాం. మా మామ వచ్చి రాగానే "శేహాబాష్ అల్లుడు మన పరువు నిలబెట్టినావు, ఫాక్షనిస్టులన్నాక ఆ మాత్రం అలవాటుండాలా.... నచ్చినావు అల్లుడు.... అయినా నాకు చెప్పలేదేం? చెబితే నేనే దగ్గరుండి ఫారిన్ సరుకు తెప్పించే వాణ్ని కదా...అయినా పర్లేదు లే కానియ్ ఆల్లుడు  " అంటూ మా మామ మందు ఫుల్లు గా లాగించాడు. నేను అశ్విన్ గాడు ఏమి లేక గుడుంబా లాగించాం.
ప్లాన్ "క" ఒ.కె కాలేదు ఇక ప్లాన్ "గ"
మామయ్య నేను నీకో విషయం చెపుతాను అని ఇండైరేక్ట్ గా కవిత రూపం లో స్టార్ట్ చేసాను నేను...

మామ నువ్వో  పేద్ద ఫాక్షన్ కొండ
ఈ ఊరికి నువ్వే అండ దండ
కాని నీ కూతురు ఉండు చూసావ్
అదో పెద్ద దొంగముండ
నన్నిక్కడ ఇరికించిన అశ్విన్ గాడు నా ఫ్రెండా?
కాదు కాదు వీడి మొహం మండా ....
నాకు తెలుసు ఈ గుడుంబా ఫ్రం తండా
నాకసలు ఈ సంబందమే వేండా(తమిళ్ లో వద్దు)

అల్లుడు ఇప్పుడు నేనో కవిత శేబుతా ఇను.... అని స్టార్ట్ చేసాడు మా మామయ్య ...

ఫాక్షనిజానికి ఈ ఊరే ఓ పేద్ద  బడి
ఇక్కడికి ఒన్లి రాబడి నో పోబడి
ఇక్కడ మేకు హెల్ప్ చేయరు ఎనీబడి
నువ్వు ఒప్పుకుంటే మన సంబంధం బలపడి
నేను నీకిస్తాను వ్యాపారానికి పెట్టుబడి
లేదంటే చేయిస్తాను చేతబడి
ఆ తర్వాత నీ శవం వుంటుంది స్మశానం లో కాల్చబడి...

అల్లుడు నీ ఫ్రెండ్ అశ్విన్ కోసం ఇంకొకటి ...

లేదు రా అశ్విన్ నువ్ వండిన చికెన్ లో ఉప్పు
నాకు తెలుసు నీకుంది ఆరు లక్షల అప్పు
నీ చేతి లో ఉంది వేయించిన వేరు శెనగ పప్పు
కాని నీ బ్రెయిన్ లో ఉన్నదంతా తుప్పు
నా కాలికుంది బాటా చెప్పు
దాంతో కొడితే నీ పళ్ళకుంటుంది ఓ క్లిప్పు
లేదు నా కూతురి దగ్గర తప్పు పెళ్ళికి ఒప్పుకోమని నీ ఫ్రెండు కి చెప్పు
పొందు నా మెప్పు ....

ఆయన చెప్పిన ఆ రెండు కవితలతో ఆయనకు మొత్తం అర్థమయిందని మాకు అర్థమయింది. అంతలోపే ఆయన ఫోన్ రింగ్ అయింది. "అన్నా మనోళ్ళని కొట్టి మన శత్రువు వీర బలుపు రెడ్డి అమ్మాయి గారిని తీసుకుపోతున్నాడయ్య" .... అంటూ అవతలి నుంచి వాయిస్.
"అల్లుడు నూవు పోయి అమ్మాయిని తీసుకు రావాల, లేదంటే ఇక్కడ నీ ఫ్రెండు అశ్విన్ పేనాలు గాలి లో కలిసి పోతాయి" అని ట్విస్ట్ పెట్టాడు మామయ్య. రేయ్ కిషోర్ నీ హీరోయిజమ్ చూపించాల్సిన టైం వచ్చింది ఈయన చంపడం కాదు నేనే చచ్చి పోతా, నువ్ శ్రుతిని తీసుకు రాక పోతే అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు అశ్విన్ గాడు.

నా  హీరోయిజమ్ చూపించాల్సిన టైం వచ్చింది, వెంటనే నా ఫ్రెండు కి ఫోన్ చేసాను.


అది నిర్మానుష్య మైన హైవే. ఆ రోడ్డు మీద పది స్కార్పియోలు వేగంగా వెళ్తున్నాయి, కెమెరా బ్లూ జీన్స్ వైట్ షూస్ వేసుకున్న రెండు కాళ్ళ వైపు చూపించింది, ఆ రెండు కాళ్ళు నడుచుకుంటూ రోడ్డు కి అడ్డంగా నిలబడ్డాయి.  స్కార్పియోలు వేగంగా వచ్చి అతన్ని చూసి సడెన్ గా బ్రేక్ వేసాయి అంతే వెనకాల ఉన్న రెండు స్కార్పియోలు బ్లాస్ట్ అయ్యాయి. ముందు వాట్లోంచి ఒక రౌడి దిగి "ఎవడ్రా నువ్" అన్నాడు. అతను డైలాగ్ చెప్పటం స్టార్ట్ చేసాడు.
"మర్యాదగా మీరందరూ ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపొండి"
లేదంటే అన్నాడు ఒక రౌడి.
"లేదంటే ముందు వాడిని తర్వాత వాడి పంచ్ పవర్ ని చూడాల్సి వస్తుంది".
వాడు వాడంటున్నావ్...ఇంతకి ఎవడ్రా వాడు?
"వాడు నా ఫ్రెండ్, వాడేం చేసినా అదో ట్రెండ్."
వాడు "ఆవేశంగా డైలాగ్ చెబితే సాయికుమార్, అదిరిపోయేలా ఫైట్ చేస్తే పీటర్ హెయిన్స్, ఆశ్చర్యపోయేలా డాన్స్ చేస్తే ప్రేమ్ రక్షిత్, ఆపకుండా పరిగెత్తితే మహేష్ బాబు" అందరూ ఆగి మరీ చూస్తారు.
"వాడు భరిలోకి దిగని భూకంపం, సైలెంట్ గా ఉన్న సునామి".
'అన్న వీడింత చెబుతుండంటే వాడు ఖచ్చితంగా తెలుగు లో స్టార్ డం ఉన్న హీరో నే అన్న' అన్నాడొక రౌడి వాళ్ళ గాంగ్ లీడర్ తో.
రేయ్ ఎదవ ఇది సినిమా కాదు రా బ్లాగు. వాడు "తెలుగులో స్టార్ డం ఉన్న హీరో కాదు రా, బ్లాగుల్లో స్టార్ డం లేని హీరో" వాడి పేరు "కిషోర్", వాడితో తలపడితే ఎవరైనా రిటైర్ అని పక్కకి జరిగి వాడి వెనకాల సిగరెట్ తాగుతున్న నా వైపు చూపించాడు.
ఇప్పటి వరకు వీడి గురించి చెప్పి మా టైం అంతా వేస్ట్ చేసావ్... అసలు అప్పటినుంచి అడుగుతున్నాం నువేవడ్రా?
అది నేను చెబుతాను.
వాడు  నా ఫాన్, వాడి పేరు చంద్ర మోహన్....
నేను స్టార్ అయితే వాడు నాకు బూస్టర్, వాడి చేసేది సాఫ్ట్వేర్... 
క్లైమాక్స్ లో ఒన్లి డైలాగులేనా? ఫైటింగ్ లేదా? అడిగాడొకడు...
బ్లాగుల్లో ఫైటింగ్లుండవ్ ఒన్లి బ్లాస్టింగులే... అని మిగతా వాటిని కూడా బ్లాస్ట్ చేసి, మేము రౌడి లతో డైలాగులు చెబుతుండగా తప్పించుకుని మా వైపు వచ్చిన శ్రుతిని తీసుకుని బయలుదేరి వాళ్ళ నాన్నకు అప్పగించాం. అశ్విన్ గాడిని విడిపించాం.
ఇంత చేసాం కాని పెళ్లి నుండి మాత్రం తప్పించుకో లేకపోయాను. అదేంటి అంటారా?
వేమన శతకం  ప్రకారం తినగా తినగా వేప కూడా తీయగా ఉంటుంది, హిట్లర్ సిద్ధాంతం ప్రకారం చెప్పగా చెప్పగా అబద్దం కూడా నిజం అవుతుంది, ప్రేమ పిచ్చి ప్రకారం ఒక ఇష్టం లేని అమ్మాయిని చూడగా చూడగా , ఆమెతో గడపగా గడపగా ఆమె నచ్చుతుంది. దాంతో శ్రుతిని పెళ్లి చేసుకున్నాను.
ప్రస్తుతానికి నేను మా మామ వెంబడి బాంబులు పట్టుకుని తిరుగుతూ, అప్పుడప్పుడు సెటిల్మెంట్లు చేసుకుంటూ, ఖాళీ సమయాల్లో కాపురం చేసుకుంటూ నా జీవితాన్ని గడిపేస్తున్నాను.ఇంతకు మీకు మా మామ పేరు చెప్పనే లేదు కదూ ఆయన పేరు కిరాయి కిరాణా కుమార్ రెడ్డి.