Thursday, December 31, 2009

నూతన సంవత్సర శుబాకాంక్షలు

బ్లాగు సోదరులందరికి "జీవితం అంటే ఏంటో 365 రోజుల పాటు తెలియ జెప్పిన గడిచి పోయిన సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ", నూతన సంవత్సర శుబాకాంక్షలు.

                                               

శంకర్ దాదా టు సమరసింహా రెడ్డి

                     రోజుకి 20 గంటలు నిద్రపోతూ, 2 గంటలు ఆఫీసుకి వెళ్తూ(మార్కెటింగ్ జాబు) , ఇంకా 2 గంటలు బార్లలో ఎంజాయ్ చేస్తూ, వారానికి 5 సినిమాలు చూస్తూ, 4 రోజులు ఫ్రెండ్స్ రూం లో 3 రోజులు అక్క వాళ్ళింట్లో ఉంటూ, నెలకొకసారి నెల పూర్తి కాక ముందే జీతం తీసుకుంటూ ట్యాంక్ బ్యాండ్ మీద రేడియో మిర్చి ఫ్లెక్సి లను చూస్తూ ఆనందంగా, హాయ్ గా జీవితాన్ని జుర్రుకుంటున్న రోజులవి.  రాజ్ భవన్ లో అప్సరసల మధ్య గవర్నర్ ఎన్.డి.తివారి లా జీవితాన్ని అనుభవిస్తున్న నాకు వీటన్నిటికి తెర దించుతూ, ఒక ఫోన్ కాల్." కిషోర్ వేర్ ఆర్ యు. కం టు ది ఆఫీస్ ఇమ్మీడియట్లీ." అని.

                     ఎప్పుడైనా ఫోన్ చేసి "సారీ నిద్ర ని డిస్టర్బ్ చేసినందుకు, కలలోకి కలర్స్ స్వాతి వచ్చిందా? లేక పోతే మా టి.వి యాంకర్ వచ్చిందా? కలర్స్ స్వాతి అయితే ఒక సారి నా దగ్గరికి కూడా రమ్మను" అని చెప్పిన తర్వాత అసలు విషయనికోచ్చే మా మేనేజర్ డైరెక్ట్ గా పాయింట్ కొచ్చాడంటే ఏదో ఉంది, అనుకుని నా తాగుబోతు గాళ్ ఫ్రెండ్ (నా బైకు) కి 2 లీటర్ల మందు పట్టించి ఆఫీస్ కి బయలు దేరాను.

                      నా బైక్ ని ఆఫీస్ కి కొంచం దూరం లో ఉన్న "నో పార్కింగ్" బోర్డు దగ్గర పార్క్ చేసి ఆఫీస్ లో అడుగు పెట్టాను. ఆఫీస్ లో ఎవరు కనబడట్లేదు.ఒక్క మా మేనేజర్ మాత్రం చైర్ లో సరిగా కూర్చోకుండా, వెనక్కి తిరిగి కూర్చున్నారు. నేను వెళ్లి "సార్" అనగానే గట్టిగా 'కిషోర్ నీకు ప్రమోషన్' అని గ్రహాంతర వాసులకి వినబడేలా అరిచి, కౌగిలించుకున్నారు. ఇప్పటి దాక యే బూజు పట్టిన ఫైళ్ళ మద్యన దాక్కున్నారో తెలియదు కాని అందరు ఒకే సారిగా వచ్చి నన్నుఎత్తుకున్నారు. అంతలో అక్కడ ఉన్న నా ఫ్యాన్ ఐన ఫ్యూన్ "శంకర్ దాదా జిందాబాద్.హు. హ. హు. హ. అంటూ పాట పెట్టాడు. మా మేనేజర్ ఆవేశం లో ఒక డెంగి దోమ ని చంపి దాని రక్తం తో నాకో వీర తిలకం దిద్ది మెడ లో ప్లాస్టిక్ పూల దండేసి కమాన్ డాన్స్ కిషోర్ అన్నాడు. ఇంకేముంది, ఒక్క సారి పవన్ కళ్యాణ్ ని తల్చుకుని శంకర్ దాదా జిందాబాద్ హు......హ.........హు........హ......అరె శంకర్ దాదా జిందాబాద్ హు...హ..హు...హ..శంకర్ దాదా , శంకర్ దాదా అంటూ గుడ్డోడు కళ్ళు తెరిచి కింద డబ్బులేరుకునే స్టెప్ ఒకటి, తాగి తూలుతూ అడుగులేసే స్టెప్ ఒకటి, గాలి లో దారం లేకుండా పతంగులు ఎగిరేసే స్టెప్ ఒకటి, మొత్తం ముచ్చట గా మూడు స్తేప్పులేసి ముగించాను.ఆ సీన్ లో నేను చిరంజీవి, మిగతా వాళ్ళు రవితేజ,అల్లు అర్జున్, శ్రీకాంత్, పవన్ కళ్యాణ్ అయ్యామన్న మాట.



      
                        నెక్స్ట్ సీన్ లో హెడ్ ఆఫీస్ లో బాస్ కాల్ గురించి వెయిటింగ్, అదేంటో నన్ను చూసి అందరు వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఎందుకు నవ్వుతున్నారో  క్లినిక్ ఆల్ క్లియర్ పెట్టి తల స్నానం చేయించి, పారశూట్ ఆయిల్ రాసుకునే నా బుర్ర కి మాత్రం అర్థం కావట్లేదు.కాని అది క్లియర్ గా అర్థం కావటానికి ఎంతో సమయం పట్టలేదు. నేను బాస్ కాబిన్ లోకి అడుగు పెట్టాను, బాస్ ఏదో ఇంటరెస్టింగ్ వీడియో చూస్తున్నారు సిస్టం లో. నేను కుర్చీ లో కూర్చోగానే టేబుల్ మీద లెటర్స్ ఉన్నాయి  చూడు అన్నట్టు చేతి తో సైగ చేసాడు. నాకు రావలసింది ప్రమోషన్ లెటర్ ఒకటే కదా ఈ రెండోది ఏంటి అని చూసా, నా గుండెల్లో గులక రాళ్ళు పడ్డంత పని ఐంది. అది "ట్రాన్స్ ఫర్" లెటర్, ఐన పర్లేదు కాని అది పోయి  పోయి మా "సమర సింహ రెడ్డి" బ్రాంచ్ ఆటో నగర్ కి.

                       మీకు ఆ బ్రాంచ్ గురించి చిన్న ఇంట్రడక్షన్. ఆంధ్ర ప్రదేశ్ కి అనంతపురం  ఎలాగో మా అసోసియేటెడ్ రోడ్ కార్రియర్స్ కి ఆటో నగర్ బ్రాంచ్ అలాగా. అక్కడ ఫాక్షనిజం అయితే ఇక్కడ యాక్షనిజం. అక్కడ పని చేసే వాళ్ళంతా 40 కిలోలకి మించకుండా మాసిన గడ్డాలతో(షేవ్ చేసుకోవడానికి కూడా లీవ్ ఇవ్వడు సమర సింహ రెడ్డి.), ఇవన్ని కాదు ఒక్క మాటలో చెప్పాలంటే, భూతాల దీవి (పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్) లో శాపగ్రస్తుల్లా, ఇంకా చెప్పాలంటే డైరెక్టర్ తేజ సినిమాల్లో హీరోల్లా ఉంటారు. అన్నీటి కంటే బయం ఏమిటంటే ఇంతవరకు అక్కడ మార్కెటింగ్ వాళ్ళు  వరుసగా 2 నెలలు కూడా పని చేయలేదు. ఒక అర్బకుడు (ఇంకేవాడు మా అశ్విన్ గాడే) ఆ రికార్డ్ బద్దలు కొడతానని వెళ్లి అక్కడ టార్చర్ తట్టుకోలేక, మన దురదమూరి వంశ గిన్నిస్ స్టార్ తారక రత్న సినిమాల డి.వి.డి ప్యాక్ కొనుక్కుని తలుపులు మూసుకుని తారక రత్న సినిమాలన్నీ వరుసగా చూస్తూ ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. కాని అదృష్టం కొద్ది షాపు వాడిచ్చిన సమాచారం తో పోలీసులు తలుపులు బద్దలు కొట్టి రక్షించారు.(రికార్డులు బద్దలు కొడతానని చెప్పి బంగారం లాంటి ఇంటి తలుపులు బద్దలు కొట్టేలా చేసుకున్నాడు ఎదవ).

                      ఇప్పుడు మళ్ళి సీన్ లోకొస్తే, నేను మా బాస్ తో ఆవేశంగా డైలాగ్ చెబుతున్నాను."సార్ మీరు నన్ను ఎడారిలో ఏనుగు లతో తొక్కించినా, బాలయ్య బాబు సినిమా లు చూపించినా, తేజ సినిమా లో హీరోగా వేషం ఇప్పించినా నేను మాత్రం ఆ బ్రాంచ్ కి వెళ్ళను సార్" కాని మా బాస్ ఏ మాత్రం ఆవేషపడకుండా సింపుల్ గా సిస్టం ఎల్.సి.డి మానిటర్ నా వైపు తిప్పి ఇప్పుడు చెప్పు అన్నాడు.(సిస్టం లో నా వీడియో నే వస్తుంది. నిన్న నేను ప్రమోషన్ వచ్చిన ఆనందం లో చేసిన డాన్స్, సారి ఇందాక మీకు మూడు స్తేప్పులే అని అబద్దం చెప్పాను, సల్మాన్ ఖాన్ లా షర్ట్ విప్పేసి, అరవ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో వచ్చే సైడ్ డాన్సర్ లాగ నాలుక మడత పెట్టి కొన్ని వెర్రి స్టెప్స్ కూడా వేసాను). మీరు ఇంత బుద్ది గా చెప్పిన తర్వాత కూడా ఎందుకు వెళ్ళను సర్? ఇదిగో ఇప్పుడే.. ఇలాగే... ఉన్నపళంగా.. ఇప్పుడే వెళ్తా సర్, అన్నాను ముఖం మీద లేని నవ్వును అలీ దగ్గర్నుంచి అరువు తెచ్చుకుంటూ.ఇప్పుడు వద్దు రేపే వెళ్ళు అన్నాడు మా బాస్, తారక రత్న సినిమా చూడడానికి ఫస్ట్ డే అయితే ఏంటి? నెక్స్ట్ డే అయితే ఏంటి రిసల్ట్ ఒకటే కదా అని అక్కడి నుంచి బయలు దేరాను.
 

                                                                                                                                        
                           నేను ఉండే ప్లేస్ జీడి మెట్ల నుండి ఆటో నగర్ కి 22 కిలోమీటర్లు, లాంగ్ అవుతుందని దిల్ షుక్ నగర్ లో మా స్నేహితుడి రూం కి షిఫ్ట్ అయ్యాను. ఫస్ట్ డే అప్పటికే లేట్ అయ్యింది అని రూం లో ఎవరి తోను పరిచయ కార్యక్రమాలు పెట్టుకోకుండా ఆఫీస్ కి వెళ్లి పోయాను. నేను మా సమర సింహా రెడ్డి కి గుడ్ మార్నింగ్ చెప్పగానే టైం ఎంత అని అడిగాడు, నాకు అర్థమయ్యింది నా టైం బాలేదని. అయినా సరే ఈ.వి.వి తరహ లో ఒక ఒక జోకు జోకుదామని జోకా," టైమా సర్ ? డెబ్బై రూపాయలు సర్, కోఠి లో మొన్నీ మధ్యే కొన్నా" అని. "జోకులు బాగేస్తావన్న మాట, బిజినెస్ కూడా బాగా చేయాలి", ఈ మంత్ నీ టార్గెట్ కోటి అన్నాడు నాకు రివర్స్ పంచ్ ఇస్తూ.(చచ్చాను రా బాబోయ్ ఆ బ్రాంచ్ కి టైర్లు అరిగేలా మార్కెటింగ్ చేసినా నలబై లక్షలు దాటదు). సర్ జస్ట్ అ మినట్ అని అలా పక్కకెళ్ళి నా బైక్ అద్దం లో నన్ను నేను చూసుకుంటూ," రేయ్ ఎదవ నీకు ఇదేం పోయే కాలం రా? ఇంకా 1980 ల్లో లాగ ఆ తుప్పు పట్టి చిన్న పిల్లలు, కన్నె పిల్లలు అని తేడా లేకుండా అందరికి స్టమకు లో స్ప్రైట్ పోసి దేవినట్టుండే చెత్త ఈ.వి.వి జోకులేంటి రా? రాత్రి పుట పబ్బు ల ముందు చీరలమ్ముకునే సేల్సు మెన్ మొహం నువ్వునూ" అని తిట్టుకుని మార్కెటింగ్ కి బయలు దేరాను.నేను రాత్రి రూం కి వచ్చే సరికి బయట తలుపులకి స్లిప్ అంటించి ఉంది,"మన పరిచయ కార్యక్రమాలు మా పండగ సెలవుల తరువాత ఇట్లు గది గజినీలు" అని. సరే లే ఈ కారెక్టర్లని మన బ్లాగు లో నెక్స్ట్ పోస్ట్ కి వాడుకుందాం లే అనుకుని ఆ రోజుకి అలా నిద్ర పోయాను. నా మార్కెటింగ్ జీవితం లో ఫస్ట్ టైం రోజుకి 6 గంటలు మాత్రమే నిద్ర పోయి 12 గంటలు పని చేసింది అప్పుడే. నా దరిద్రం కొద్ది మా రూంమేట్స్ కూడాలేరు.

                    నేను డైలీ లేట్ గా ఆఫీస్ కి వెళ్ళటం, మా సమర సింహ రెడ్డి టైం ఎంత అని అడగడం, నేను డోకు ఒచ్చేల ఈ.వి.వి జోకులేయడం, నాకు మా బాస్ చీవాట్లు పెట్టి నా టార్గెట్ పెంచడం,నన్ను నేను కిష్యోటికా, ఇతియోకినారా అంటూ వెరైటీ గా  తిట్టుకోవడం ఇదే నా దినచర్య. ఆ మధ్య ఒకసారి మాటల సందర్బం లో "నువ్ జోకులు బాగా వేస్తావయ" అన్నాడు, నేను ఈ సారి కొద్ది గా థింక్ చేసి ఈ.వి.వి జోకులు మనకు అచ్చి రావట్లేదు అని ఫ్రెష్ గా త్రివిక్రం జోక్ వేసా. " బజ్జీలు కూడా బాగా వేస్తాను సర్" అని. దాంతో డైలీ సాయంత్రం నాతో ఆఫీస్ ముందు బజ్జీల బండి పెట్టించి బజ్జీలు వేయిస్తున్నాడు, మైదా పిండి తో పెసర వడలు, కారం లేకుండా మిరప కాయ బజ్జీలు వేయమనే మొహం వీడును.

                    వీటన్నిటికి తోడు మా సమర సింహా రెడ్డి కి కవితల పిచ్చి, వాడు కవితలు విన్నా ఫర్లేదు, రాసిన కూడా ఫర్లేదు, కాని రాసి వినిపిస్తాడు ఎదవ. ఒక సారి నేను కాలీగా కనిపిస్తే నన్ను పిలిచి నా మీదే కవిత అల్లాడు తారక రత్న సినిమా కి బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే వెధవాయ్. సమర సింహా రెడ్డి కవిత చెప్పడం ప్రారంబించాడు.

                            ఒక వింత....
                            ఒక వింత ప్రపంచం లోని సుపరిచిత వ్యక్తి కిషోర్
                            ఇతన్ని పరిచయం చేయడమంటే….( మళ్ళి సాగ దీసి)
                            ఇతన్ని పరిచయం చేయడమంటే….................
                            నేలలో ఇంకి పోయిన మట్టి ని.......( మళ్ళి సాగ దీసి)
                            నేలలో ఇంకి పోయిన మట్టి ని చెట్టు చేతుల్తో తవ్వ్వి ఆకాశం లో నిలబెట్టడమన్నంత సాహసమే..

   నేను: వాహ్వా వాహ్వా (లోలోపల. మట్టి నేల లో ఇంకి పోవడం ఎంటిరా నెల తక్కువ వెధవ)                                     

  అనటం తో రెట్టించిన ఉత్సాహం తో కిషోర్ ఇంకా కవిత అన్నాడు.(చచ్చాను రా బాబు)

                                     
                            నా అనే ప్రపంచం లో వుండడం అంటే
                            ఆకు పచ్చ మబ్బుల మధ్య గుంపును కోల్పోయిన
                            తెల్ల కాకి పిల్ల తుమ్మ చెట్టుకు గాయమై
                            బ్యాండేజ్ వేసుకుని వేలాడడమే !  
           
నేను : అబ్బబ్బబ్బా ,అయ్యయయ్యయ్య్యో సార్ మీరు ఇంత గొప్ప గా కవితలు చెబుతారని తెలిస్తే సిని ఇండస్ట్రి లో పోసాని, మోహన్ బాబు , బాలయ్య బాబు వీళ్ళంతా మీ దగ్గరే పాటలు రాయించుకుంటారు సార్.(లోలోపల  ఆకు పచ్చ మబ్బులు,  తెల్ల కాకి పిల్ల, బ్యాండేజ్ సంబంధం లేకుండా చెప్పావ్ కద రా, రేయ్ నువ్ ఆడపిల్ల్లలతో అక్రమ సంబందానికి కాదు కద, సక్రమ సంబందానికి కూడా పనికి రాకుండా పోతావ్ రరేయ్)
                
సమర సింహా రెడ్డి : అలా అంటావా? మరీ విసరమంటావా ఇంకో......................         
నేను: సార్ ఇప్పుడే మీకు మేడం గారు కాల్ చేసి ఇంటికి రమ్మన్నారు.
                  అని అబద్దం చెప్పి ఆ రోజుకి ఎలాగో బయట పడ్డాను. ఇంతింతై ఉదయ కిరణ్ అంతై అన్నట్టు  వీడి  టార్చర్ రోజు రోజు కి పెరిగి పోతుంది.ఒక సారి కస్టమర్ తో నువ్ మనిషి వా, బాల కృష్ణ వా? అని  సీరియస్ గా తిట్లు తింటుండగా మా హెడ్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, అర్జెంటు గా ఒక ఫైల్ మీద మా సమర సింహా రెడ్డి సైన్ కావాలని, కాని మా బాస్ లీవ్ లో ఉన్నాడు, అదే విషయం వాళ్ళకి చెబితే సమర సింహా రెడ్డి ఇంటి అడ్రస్ చెప్పి అక్కడికెళ్ళి సైన్ తీస్కో అన్నారు. అంతలోనే రేయ్ కిషోర్ ఇక రోజులన్నీ నీవే అన్నట్టు ఆకాశవాణి ఆనందం తో అరిచినట్టు గా వినబడింది. కాని ఎందుకు అరిచిందో నాకు అర్థం కాలేదు. నేను సంతకం గురించి సమరసింహా రెడ్డి ఇంటికి వెళ్ళే సరికి తలుపులకి తాళం వేసి ఉంది. సరేలే తరువాత సంతకం తీసుకుందాం అని వెళ్లి పోతుండగా లోపలి నుంచి ఎవరో ఆనందం తో కేరింతలు కొడుతున్న శబ్దం వినబడింది. నేను అనుమానం తో కిటికీ తలుపులు తెరిచి చూసాను. ముందు షాక్ తిన్నా, తరువాత స్వీట్లు తినే సమయం వచ్చిందని సంబర పడ్డాను.ఆకాశవాణి ఎందుకలా అరిచిందో అప్పుడర్థమైంది నాకు.

                 సమర సింహా రెడ్డి బార్యని, పిల్లల్ని సినిమాకి పంపించి గది లోపల ఒక్కడే వాళ్ళ చిన్న కొడుకు మూడు చక్రాల చిన్న సైకిల్ ని తొక్కుకుంటూ కేరింతలు కొడుతున్నాడు. అదొక్కటేనా చిన్న నిక్కరు వేసుకుని పాల పీక నోట్లో పెట్టుకుని కింద అమ్బాడుతున్నాడు. అన్ని చిన్న పిల్లల చేష్టలు చేస్తున్నాడు. చూస్తుంటే నాకే నవ్వొస్తుంది." అమ్మ మొత్తానికి ఎలా అయితే ఏంటి దొరికి పోయాడు అనుకుని సార్ అని కిటికీ లోంచే పిలిచాను కనబడేట్టు గా". నెక్స్ట్ సీన్ లో "నాని సమర" అక్కడ ఫ్రిజ్ లో ఉన్న బీర్ పట్రా అని ఆర్డర్ వేసా చైర్ లో కూర్చుని. దాందేముంది ఇప్పుడే తెస్తా కిషోర్ అని మా బాస్.ఇక అక్కడి నుండి మళ్ళి నా దశ తిరిగింది.

                    అప్పటినుండి మళ్ళి రోజుకి 20 గంటలు నిద్రపోతూ, అప్పుడప్పుడు ఆఫీసుకి వెళ్తూ, ఇంకా 4 గంటలు బార్లలో ఎంజాయ్ చేస్తూ, వారానికి 7 సినిమాలు చూస్తూ, 4 రోజులు ఫ్రెండ్స్ రూం లో 3 రోజులు మా సమర సింహా రెడ్డ్డి ఇంట్లో ఉంటూ, నెలకొకసారి నెల పూర్తి కాక ముందే జీతం+అడ్వాన్సు తీసుకుంటూ నెక్లెస్ రోడ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి కంట్రి క్లబ్ వాళ్ళు పెట్టిన హాట్  ఫ్లెక్సి లను చూస్తూ ఆనందంగా, హాయ్ గా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను.అలా ఉన్న నాకు మళ్ళి ఒక రోజు ఫోన్ కాల్." కిషోర్ వేర్ ఆర్ యు. కం టు ది ఆఫీస్ ఇమ్మీడియట్లీ." అని. కాని ఈసారి బాస్ కాదు, ఆఫీస్ లో మొన్నీ మధ్య నే జాయిన్ ఐన నా కొత్త గాళ్ ఫ్రెండ్ అను.

Wednesday, December 30, 2009

"కామీడియా"

 నా టపా చదివే ముందు విశాల ప్రపంచం బ్లాగు లో ప్రచురితమైన అడిగే వాళ్ళే లేరా? చదవ వలసినది గా నా మనవి.
http://venugaanam.blogspot.com/2009/12/blog-post_30.html                    మీడియా కి ప్రముఖుల రాసలీలలు కావాలి వారి టి.ఆర్.పి రేటింగ్ లు పెంచుకోవడానికి, కాని వారి చేతిలో బుగ్గి పాలైన వారి జీవితాల బవిష్యత్ అక్కర్లేదు. మీడియా కి హీరో ల సెలెబ్రిటి, లెజెండ్ ల గొడవలు కావాలి, హీరోయిన్ లు స్నానం చేస్తుంటే దొంగ తనంగా తీసిన వీడియో లు కావాలి.అవి అయితే నిమిషానికి 5 సార్లు ప్రసారంచేస్తారు. కాని సామాన్యులైన వారి అభిమానుల మానసిక సంగర్షణ అక్కర్లేదు.ఎవరైనా దొంగ ఉద్యమాలు నడిపితే వారి ఇంటర్వ్యూ లు కావాలి. మీడియా కి ఎవరైనా బస్సులు తగలబెడుతుంటే ఆ ఫోటోలు కావాలి, కాని అదే బస్సు లో ఎవరైనా తగలబడుతుంటే అక్కర్లేదు. మీడియా కి దొంగ స్వాముల విలాసాలు కావాలి వీడియో తీయడానికి. మీడియా కి హింస, బంద్, గొడవలు, రాసలీలలు, టేర్రరిసం ఇవే కావాలి కానీ, వాటి వల్ల సామాన్యులు పడుతున్న కష్టాలు, బాదలు, అగచాట్లు అక్కర లేదు.అసలు వాటిని  ప్రబుత్వం ముందుకు ఎందుకు తీసుకు రావాలి అని మనల్నే ప్రశ్నించిన కూడా ఆశ్చర్య పోనక్కర్లేదు.  మీడియా అనేది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ అయి పోయింది. ప్రజలు కూడా అలాగే అలవాటు పడ్డారు. ఇప్పుడున్న "మీడియా" కి "కామీడియా" అని పేరు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.    
                   ఈ టపా మంచి వార్తల్ని ప్రజలకు అందించే మీడియా గురించి రాసింది కాదు, కేవలం నేను పైన ప్రస్తావించిన వాటిని చేసే మీడియా గురించి మాత్రమే అని అర్థం చేసుకోవలసింది గా మనవి.

Monday, December 28, 2009

రాజకీయాల్లో రామ్ గోపాల్ వర్మ,తెలుగు ప్రజల ఖర్మ

             తెలుగు గడ్డ మీద పుట్టి ఒకానొక సమయం లో అందరి చేత బారత దేశం లోనే గొప్ప క్రియేటివ్  డైరెక్టర్ గా పేరు పొందిన రాంగోపాల్ వర్మ తాను పుట్టిన ఈ తెలుగు గడ్డ కి ఏం చేసాడు అని ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించి కామెంట్ చేస్తున్నాడు.తాను తీసిన "ప్రేమకథ" అనే సినిమా బాగా ఆడలేదనే ఆక్రోశం తో తెలుగు ప్రజలకి అసలు టేస్టే లేదు అసలు సినిమాను ఎలా చూడాలో కూడా తెలియదు దూషించాడు. మళ్ళి ఇక్కడ  జన్మ లో సినిమాలు తీయన్ని చెప్పి ముంబై కి వెళ్ళిపోయిన అతను ఏ ముఖం పెట్టుకుని తన సినిమాలు తెలుగు లో మళ్ళి తీస్తున్నాడు.


                                                             

                        రామ్ గురించి చెప్పాల్సి వస్తే  రామ్ గోపాల్ వర్మ కి కొంచం అహంకారం ఎక్కువ. తన కన్నా పెద్ద స్టార్లతో సినిమాలు చేయాలంటే ఇతడు ఒప్పుకోడు. ఇది ఇప్పటికే రుజువయింది చిరంజీవి సినిమాను ఆపేయడం ద్వారా. ఆ విషయాన్ని రామే స్వయంగా ఒప్పుకున్నాడు tv9 ఇంటర్వ్యూ లో. (హిందీ లో అమీర్ ఖాన్, అమితాబ్ లతో తీసిన అవి వాళ్ళ కెరీర్ అంతంత మాత్రంగా ఉన్నపుడే, అమీర్ కి ఇమేజ్ వచ్చాక మళ్ళి అమీర్ తో తీయను అని చెప్పాడు). రామ్ ముందు నుంచి కొంచం డిఫరెంటే. తాను తీసిన సినిమా తనే బాగా లేదంటాడు కొన్ని రోజుల తర్వాత. పెళ్లి చేసుకోవట్లేదు ఏంటి ఫ్యామిలీ లైఫ్ ఇష్టం లేదా? అని అడిగితే హీరోయిన్స్ ఉన్నారు కదా అంటాడు. మరీ రామ్ కంటికి హీరోయిన్స్ అంతా చీప్ గా కనబడుతున్నరేమో. సినిమాలు తీస్తాడు, రిలీజ్ అవక ముందే పార్ట్-2 అనౌన్స్ చేస్తాడు. పోనీ అవి తీస్తాడా? అంటే అదీ లేదు. అవి ఎందుకు బాగా ఆడలేదు అని అడిగితే, సినిమాలు నా కోసం నేను తీసుకుంటాను, ప్రజల కోసం తీయను అంటాడు. మరీ అలాంటపుడు రిలీజ్ చేయకుండా తనే ఇంట్లో చూసుకోవచ్చు కదా. పైగా తీసిన సినిమాల్లో నటించిన వాళ్లకి రెమ్యునరేషన్ ఇస్తాడా అంటే అదీ లేదు. పాపం ఒకసారి తన గోడు ని జే.డి చక్రవర్తి మీడియా ముందు వెల్లగక్కుకున్నాడు ఏమి చేయలేక.  
                      ప్రస్తుత విషయానికొస్తే రాము కి వివాదాలన్న క్రైం అన్నా చాల మక్కువ ఎక్కువ. అందుకే కాబోలు ముంబై దాడుల తర్వాత అందరు హోటల్ తాజ్ దగ్గరికి అక్కడి వారిని పరామర్శిండానికి వెళితే మన వాడు మాత్రం కథ ఏమైనా దొరుకుతుందేమో అని వెళ్ళాడట. దాని ఫలితం మహారాష్ట్ర సి.ఎం. రాజీనామా మన వర్మ ని వెంటబెట్టుకేల్లినందుకు. తాను తీయబోయే రక్త చరిత్ర అనే సినిమాకి ఏమైనా ఉపయోగ పడుతుంది అనే ఉద్దేశం తోనే గొడవలు పెంచడానికి తన అభిప్రాయం సూటి గా చెప్పకుండా లగడపాటి కి సపోర్ట్ చేసినట్టు కనబడుతోంది రాష్ట్ర రాజకీయాల విషయంలో.

కాకి గోల

                     లేదు,ఉంది,లేదు,ఉంది,ఉంది,లేదు. "డాడీ" అని పెద్ద అరుపు, "ధమాల్" మని పెద్ద సౌండ్. లోపలికి పరుగెత్తుకెళ్ళి చూసే సరికి కన్ను నల్లగా కమిలి పోయి కింద పడి ఉన్న మా అశ్విన్ గాడు, మహా దేవి సినిమా లో అమ్మ వారి గెటప్ వేసుకున్న రమ్యకృష్ణ లా చేతిలో పగిలిన ఫ్లవర్ వాజు తో మా అను.సీన్ నాకు అర్థం అయింది. కానీ ఫ్లాష్ బ్యాకే అర్థం కాలేదు. సీన్ కట్ చేస్తే అందమైన నర్సుల మధ్య హాస్పిటల్ లో వాడు, ఆ హాస్పిటల్ బిల్లు కి కట్టాల్సిన డబ్బు కోసం నేను,అను రోడ్డు మీద.సారి మీకు చెప్ప లేదు కాదు అశ్విన్, అను నాతోనే కలసి చదువుకున్న నా ఫ్రెండ్స్.

                   అంతా సర్దుకున్నాక (అశ్విన్ గాడి ఆరోగ్యం కాదు, అందుకు బిల్లు కట్టిన మా ఆరోగ్యం) ఒక మంచి ముహూర్తం చూసుకుని అను కి ఒక లాలీపాప్ కొనిచ్చి అడిగాను అసలు విషయం ఏంటి అని." రేయ్ అదేం లేదు రా అదంతా నీ గురించే. ఆ రోజు నీకు క్రియేటివిటి వుంది అని నేను, లేదు అని వాడు ఒకటే వాదన.చివరికి వాడు ఏమన్నాడో తెలుసా? పిచ్చి వాడికి బిచ్చమేస్తే క్రియేటివిటి అనుకుంటావెంటే వెర్రి మొహం విజయ శాంతి.అన్నాడు. నన్ను వెర్రి మొహం అన్నా ఫరవా లేదు కానీ విజయ శాంతి తో పోల్చాడు వెధవ. అందుకే ఫ్లవర్ వాజు పుచ్చుకుని ఒక్కటిచ్చా వెర్రి కుదిరింది వెదవ కి" అని అమాయకంగా ఫేసు పెట్టి అసలు విషయం చెప్పింది.

                  "ఐనా ఇదంతా నీ వల్లే రా, ఏదో బ్లాగులు, కథలు రాస్తే క్రియేటివ్ అంటారంట కదా, అదేదో రాసి ఆ ముక్కేదో అశ్విన్ గాడితో అనిపించుకోవచ్చు గా. నీ అవసరం చాలా ఉంది రా మన తెలుగు వాళ్లకి. ఆ మధ్య అమెరికా లో ఆర్ధిక మాంద్యం, హిల్లరి ఓటమి, ఇండోనేసియా లో సునామి, 20-20 ల్లో ఇండియా వెనుకంజ, రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ లో కే.సి.ఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఇవన్ని నువ్ బ్లాగులు రాయకపోవటం వల్లనే" అని నన్ను ప్రపంచ స్థాయి లో ఒక్క మగాడ్ని చేసి సిచువేషన్ తగ్గట్టు గా ఒక కథ చెప్పటం ప్రారంబించింది అను.అదేంటో మీరు కూడా బ్లాగండి సరదాగా.             
   
                    " పూర్వం ఒక ఊరి లో ఒక కాకుల గుంపు ఒకటి ఉండేది.వాటికీ చాలా ఆకలి ఎక్కువ. కానీ తిండి సరిగా లేక అవి ఎప్పుడు కావ్,కావ్ మని అరుస్తూనే ఉండేవి. వాటి కూతలకి ఆ ఊళ్ళో ప్రజలకి నిద్ర లేక మనశ్శాంతి కరువై   ఆ కాకులు ఎక్కడా వాలకుండా తమ చెట్లు తామే నరికేసుకుని, తమ కరెంట్ తీగలు తామే తెంపేసుకుని అంధకారం లో ఉండే వారు. చెట్లు లేక వర్షాలు పడడం ఆగి పోయింది. తద్వారా పంటలు పండలేదు. పంటలు లేక ప్రజలందరూ అలమటించి పోతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ ఊరి లోకి ఒక పులి ప్రవేశించింది.డైలీ తాను వండుకున్న బిర్యాని కొద్ది కొద్ది గా  ఒక్కో కాకి కి పెట్టటం ప్రారంబించింది.అలా ఆ కాకుల ఆకలి తగ్గింది. అవి కావ్ కావ్ మని అరవడం ఆపేసి పులి పులి అని బిర్యాని కోసం సైగలు చేయటం మొదలు పెట్టాయి. కొన్ని రోజులకి మళ్ళి చెట్లు చిగురించడం మొదలు పెట్టాయి.ఊళ్లోకి కరెంట్ వచ్చింది. వర్షాలు పడ్డాయి.పంటలు పండాయి. ప్రజలందరూ ఆనందం తో పండగ చేసుకున్నారు."
                   సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది,  సరైన తిండి లేక కాకులన్ని అలమటిస్తున్నాయి. ఇక్కడ తిండి సరిగా లేదని ఒక కాకి రాజకీయాల్లోకి వెళ్ళింది.ఆ కాకి తమ్ముడి కాకి కత్తి పట్టుకునే కరాటే, కుం ఫూ ఉంటేనే తింటా అంటుంది. ఒక కాకి ట్రైన్ల మీద బైక్ నడుపుతుంది, ఆ మధ్య ముంబై దాడుల పై మీ అభిప్రాయం అని అడిగితే ""లగాన్" సినిమా దక్షిణ బారత దేశం లో ఎందుకు ఆడిందో, "గదర్" సినిమా కి కలెక్షన్లు ఎందుకు వచ్చాయో కారణాలు చెప్పి ఆ రిపోర్టర్ కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది".(పాపం ఇప్పటికి ఆ రిపోర్టర్ కోలుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం). ఇక  కొన్ని కాకులు స్లిమ్, సిక్స్ పాక్ అంటూ బక్క పడ్డాయి.ఇంకో కాకి తిండి సరిగా లేకున్నా సరే కొత్త హీరోయినే కావాలంటుంది. మరో కాకి, కాకి చేష్టలు మని కోతి చేష్టలు చేస్తే ఒకసారి ఎవరో చిల్లరేసారట, అప్పటి నుండి అది కోతి చేష్టలే చేస్తా అంటుంది. మరో ఇంకో గిన్నిస్ బుక్ కాకి అయితే ఏకంగా ఇనుప మాస్కులేసుకుని జనాల్ని బయపెడుతోంది.         
                  ఈ కాకి గోల చూడలేక జనాలందరూ తమ డి.టి.హెచ్ లు తామే పేల్చుకుని తమ సి.డి.లు తామే విరగ్గొట్టుకుని తమ టి.వి.లు తామే కట్టేసుకుని, తమ చొక్కాలు తామే చింపేసుకుని మెంటల్ హాస్పిటల్ కి మీటర్ దూరం లో ఆనందానికి ఆఫ్గనిస్తాన్ అంత దూరం లో అందకరానికి మాత్రం అతి దగ్గరలో బ్రతుకుతున్నారు.


                                                   
               కాబట్టి ఇప్పుడు పులి వచ్చే సమయం ఆసన్నమైంది. ఆ పులి మరెవరో కాదు నువ్వే కావాలి." కనీసం నువ్ వండే బిర్యాని ఐనా వాసన వచ్చి గూగుల్ సెర్చ్ లో తిండి అని టైపు చేసి ఆ  కాకులు తింటాయేమో.అని అను బోరున విలపించింది.

                 ఇప్పటి కైనా నీకు ఆ కాకుల మీద కనికరం కలగలేదా? నువ్ బ్లాగ్ రాయను అనే ఒట్టు ని తీసి గట్టు మీద పెట్టి "తోడగొట్టు చిన్నా" అంది అను. దాంతో నేను ఒట్టును తీసి గట్ట్టు మీద పెట్టకుండా ఎప్పటికైనా పనికొస్తుందని నా రీ సైకిల్ బిన్ లో పెట్టి మెడ సైడ్ కి వంచి తోడ కొట్టాను. ఆ శబ్దానికి ఆకాశం లో ఒకటే ఉరుములు మెరుపులు, భూమ్మీద  భూ కంపాలు, సముద్రం లో సునామీలు వచ్చి, కలియుగాంతం మొదలైందని సూచిస్తున్నాయి. ఇక నుండి నేను 21.12.2012 ని నమ్ముతాను. ఎందుకంటే నా మొదటి బ్లాగ్ ప్రచురితం అయ్యేది ఈ రోజే (21.12.09). ఇంకా సరిగ్గా 3 సంవత్సరాల టైం ఉంది.అంటే దానర్థం ఈ ప్రపంచానికి మూడింది(మూడు ఉంది ) అని.   
           
               నేను ఈ బ్లాగ్ రాయటం మొదలు పెట్టాను, ఇక మీదట రాస్తూనే ఉంటాను 21/12/2012 వరకు. "నేను రాయటం అంటూ మొదలు పెడితే యే అక్షరం ఎక్కడి నుంచి ఎవరి దగ్గరి నుండి కాపీ కొట్టానో తెలుసుకోవడానికి సంవత్సరం పట్టుద్ది". కాబట్టి తెలుసుకోవడానికి ట్రై చేయకండి. ఇంతకి నా పేరు మీకు చెప్పలేదు కదు.నా పేరు కస్క్రిమాపాదనిహీ.

క - కథ 
స్క్రీ - స్క్రీన్ ప్లే 
మా - మాటలు 
పా - పాటలు 
ద - దర్శకత్వం
ని - నిర్మాత 
హీ - హీరో. 
          

Thursday, December 24, 2009

నేను, అను,ఒక బి.బి.టీ

                         ఈ రోజు పొద్దునే ఒక పీడ కల వచ్చింది. నా ప్రియాతి ప్రియమైన దరిద్రగొట్టు అశ్విన్ గాడు," రేయ్ కిషోర్ నిన్ను చూడక చాలా రోజులు అవుతుంది రా.నువ్ బెంగుళూరు కి  రా రా మనం మన ఫ్రెండ్స్ ఎవరు లేకుండా పార్టీ చేసుకుందాం, ఈ సారి బిల్ నువ్ కట్టక్కరలేదు నేనే కడతాను." అని ఉరిస్తున్నాడు. లాస్ట్ టైం కూడా ఇలాగే అన్నాడు వెదవ. బాధ పడుతున్నాడు కదా అని వెళ్తే ముఖం లో వాస్తు సరిగా లేని నలుగురు కన్నడ హీరోల్ని వెంట బెట్టుకోచ్చాడు. వాళ్ళేమో నువ్ బేకు, నీ ఫ్రెండ్షిప్ బేకు నా బొంద బేకు అని బార్ మొత్తం ఖాలీ చేసారు.వాళ్ళు నన్ను తిడుతున్నారో, పోగుడుతున్నారో తెలియట్లేదు.అశ్విన్ గాన్ని అడుగుదామంటే వాడు అప్పటికే ఫుల్ గా తాగి పడిపోయీ గుర్రు కొడుతున్నాడు. మొత్తానికి వాళ్ళు చేసిన బిల్లు కి నా మీద ఆస్ట్రానాయిడ్ (గ్రహశకలం) నా జేబు కి పెద్ద గొయ్యి పడింది.
            ఏది ఏమైనా  వీడు కల్లోకి వచ్చాడంటే నాకు ఈ రోజు ఏదో మూడింది అనుకుంటుండగానే మా పేపర్ వాడు కోపంగా విసిరిన పేపర్ నా మొహం మీద పడింది. అదేంటో రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటా అన్నా, కరుణానిది గవర్నమెంట్ అవిశ్వాస తీర్మానం నెగ్గినా, ఇండియా క్రికెట్ జట్టు ఫైనల్ లో నెగ్గినా, చిరంజీవి మళ్ళి సినిమాల్లో నటిస్తా అన్నా ఆ కోపమంతా వాడు నా మీద చూపిస్తాడు. ఎంతైనా వాడు సగటు మనిషే కదా. ఇంతలోనే  నా  ఫోన్ మోగింది. ఫోన్ లో అను.

అను: రేయ్ పాచి పళ్ళతో పలావ్ తినే వెదవ ఎలా ఉన్నావ్ రా?

నేను: నేను బాగానే ఉన్న కానీ వెరైటీ గా ఆ తిట్లేంటే?

అను: క్రిఏటివ్ గా ఉంటుందని అలా అన్నాను రా బడుద్దాయి.

నేను: నీ క్రిఏటివ్ పిచ్చి కి పెప్సి తాగించ! నీకేం పోయే కాలమే? ఇలా తిట్లతో చంపుతున్నావ్. సరే గాని నీ పేల పిచ్చి తగ్గిందా?(ఓహ్ సారి మీకు చెప్పలేదు కదూ. అను కి వేరే వాళ్ళ తలల్లో పేలు చూడడమంటే డ్రాకులా కి రక్తం తాగినంత ప్రాణం. మా బట్ట తల హెచ్. ఓ. డి వెంకట రత్నం కి కూడా పేలు చూసిన ఘనత తనది. తన చేత ఎవరైనా పేలు చూపించుకోలేదంటే వెంటనే "అమ్మా భద్రకాళి అపర భద్రకాళి" అనే అరవ డబ్బింగ్ పాట బ్యాక్ గ్రౌండ్ లో వచ్చి తాను ఆ పాటకి డాన్స్ చేసి పేలు చూపించుకోను  అన్న వాడి తలను చిందర వందర చేసి వాడి చేతనే "అమ్మా తల్లి ఈ జీవితం లో నీ దగ్గర తప్ప వేరే ఎవరి దగ్గర పేలు చుపించుకోను" అనేలా చేస్తుంది.)    

అను: రేయ్ నన్ను ఏమైనా అను అంతే కానీ నా పేల పిచ్చిని  ఏమైనా అన్నావంటే ఫోన్ లోనే కొరుకుత. తెలుసుగా లాస్ట్ టైం ఏం జరిగిందో. అశ్విన్ గాడిని కొరికితే వాడు పిచ్చి పట్టీ బాలయ్య బాబు సినిమా కి గ్రాఫిక్స్ చేయడానికి ఒప్పుకున్నాడు.

నేను: పిచ్చి అను, వాడు పిచ్చి పట్టీ బాలయ్య బాబు సినిమా కి గ్రాఫిక్స్ చేయలేదు. బాలయ్య బాబు సినిమా చేసిన తర్వాత పిచ్చి పట్టింది. అవును ఇంకా ఏంటి విశేషాలు.

అను: ఇక్కడ హైదరాబాద్ లో బి.బి.టీ షో జరుగుతుంది. నువ్ కూడా పాల్గొనాలి రా రా.

నేను: పాల్గొంట గాని ఈ బి.బి.టీ ఏంటే. కొంప దీసి "బతికుంటే  బలుసాకు తినొచ్చు" షో కాదు కదా.

అను: కాదులేరా. బి.బి.టీ అంటే బెస్ట్ బ్లాగర్స్ ఇన్ తెలుగు. 

నేను: మన గాంధి సినిమా ని ఎవరో బ్రిటిష్ వాళ్ళు తీసినట్టు, తెలుగు బ్లాగరుల షో కి ఇంగ్లీష్ పేరేంటి చెండాలంగా.

అను: ఈ పోటి కి స్పాన్సర్ రస్సేల్స్ అనే స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్, అందుకే పేరు ఇలా పెట్టారు.

నేను: రస్సేల్స్ అంటే ఇంగ్లీష్ నేర్పుతామని చెప్పి, ఫీజు కట్టి జాయిన్ ఐన తర్వాత ఇంగ్లీష్ లో స్టూడెంట్స్ ని ప్రశ్నలతో అదరగొట్టి బెదరగొట్టి మళ్ళి నెక్స్ట్ డే రాకుండా చేసి 2 వారాల్లోనే కొత్త బాచ్ స్టార్ట్ చేసే వాళ్ళే కదా.

అను: అవును వాళ్ళే, ఐన ఎవరైతే నీకేంటి రా? నువ్ వెంటనే పళ్ళు  తోముకుని ఫ్లైట్ ఎక్కెయ్.అప్పటి నుండి కంపు బరించలేక పోతున్నా. నేను ముందే చెబుతున్నా, నేను ఎయిర్ పోర్ట్ కి రాను, నా కొత్త స్నిహితుడి తో షాపింగ్ కి వెళ్తున్నా.
         
                       అని ఫోన్ పెట్టేసింది. వాడెవడో ఐ పోయాడు అనుకుని నేను నా ఆఫీసు లో మా బాస్ ని వారం రోజులకి సరిపడా తమిళ్ లో పొగిడి ఆయనిచ్చిన రెండు రోజుల  లీవ్ తీస్కుని హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ లోపలికి వెళ్ళగానే ఎడంపక్క సీట్లలో ఉన్న ఒక ఇద్దరు మూర్చ పోయి ఉన్నారు. ఇంకో ముగ్గురు ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నారు. దూరంగా ఇద్దరునారు. దాంట్లో ఒకడు ఇంకొకనితో ఏదో చెప్తున్నాడు. కొంచం దగ్గ్గరగా  వెళ్లి చూసాను. ఆ ఇద్దర్లో  ఒకరు మన "రెండు రెళ్ళు ఆరు" ఫ్రెండ్ "మధుకర్". ఆ ఇంకొకరి చెవిలో నుంచి కన్నీళ్లు, కళ్ళల్లోంచి రక్తాలు ఎకదాటిగా కారుతున్నాయి. నాకు సిచువేషన్ అర్థం ఐంది మన వాడి జోకవితల (జోకులు + కవితలు) దెబ్బకి అందరు అలా పడి పోయారు.

              నేను వెంటనే ఎలర్ట్ అయిపోయి నా బ్యాగ్ లోంచి బుర్ర మీసాలు తీసి అతికించుకుని నల్ల కళ్ళజోడు పెట్టుకుని నా సీట్ లో కూర్చున్నాను. ఎలా చూసాడో కానీ మొత్తానికి నన్ను కనిపెట్టాడు. నా పక్క సీట్ లో వచ్చి కూర్చుని డొక్కలో ఒక్కటి గుద్ది "చిలిపి కిషోర్ నేను గుర్తు పడతానో లేదో అని టెస్ట్ చేసావ్ కదూ. ఇక్కడే ఉండు మనమిద్దరం మంచి మధుకర్ లాంటి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని ఒక తుప్పు పట్టిన  జోక్ ఒకటి వేసి కాఫీ కోసం ఎయిర్ హోస్టెస్ దగ్గరికి వెళ్లి పోయాడు
.
                   నేను ఇపుడు మీకో మంచి కవిత చెబుతాను మీరు వినాలన్నమాట అని మధుకర్ అడగ్గానే కొత్తగా జాయిన్ అయిన ఆ ఎయిర్ హోస్టెస్ మన వాడి గురించి తెలియక " వై నాట్ సర్ శూర్" అంది.అప్పుడు మధుకర్ "కాకా కి కు కై, కాకా కి కు కై, ఈ డాలర్ లోపల తోయ్. కాఫీ తేపో పోయ్, తెచ్చి మాకి ఇయ్, కాకా కికు కై ".కవిత ఎలా ఉంది అని అడిగే లోపే పాపం ఆ  ఎయిర్ హోస్టెస్ ప్రోజేరియా వచ్చిన పేషెంట్ హర్రర్ సినిమా చూసినట్టు చెవులు మూసుకుని కేవ్వ్వు మని అరిచి కింద పడి పోయింది. దాంతో అక్కడ స్టాఫ్ అంత కలసి మన వాడిని బరించలేక విమానం అద్దాల్లోంచి విసిరి పారేసారు. నేను ఎలా అయితే ఏం తప్పించుకున్నాం అని ఊపిరి పీల్చుకున్నాను.  
                      
                      మరుసటి రోజు ఉదయం షో జరిగే ప్లేస్ కి నేను అను వెళ్లి హాల్లో వెయిట్ చేస్తున్నాం. అంతలోనే "యాహూ" అని  పిల్లల భవిష్యత్ తో ఆటలాడుతున్న ప్రభాకర్, "అదృష్టం" అంటూ జనాల సహనాన్ని, దురదృష్టాన్ని పరీక్షిస్తున్న ఓంకార్ అక్కడకు చేరుకున్నారు. అప్పుడే అణుబాంబు లాంటి వార్త మా మీద పడింది, మా బి.బి.టీ షో ని హోస్ట్ చేస్తుంది వాళ్ళేనని.
               
                         ముందుగా ఈ షో కి క్వాలి ఫై కావాలంటే ఒక చిన్నా టెస్ట్ నెగ్గాలి. దీని పేరు క్వాలి ఫై రౌండ్ కింద కాప్షన్ "నేను, సెలబ్రిటీ, ఒక చీటీ". అందమైన అమ్మాయిలు కొందరు వరుసగా చేతులు వెనక్కి పెట్టి నిల్చుంటారు. వాళ్ళ రెండు చేతుల్లో  ఏదో ఒక చేయి లో చీటీ ఉంటుంది. చీటీ ఉన్న చేయిని సెలెక్ట్ చేసుకుని ఆ చీటీ లో ఎవరి పేరు(సెలబ్రిటీ) ఉంటే వాళ్ళకి మన కథను చెప్పి ఒప్పించగలిగితే అప్పుడు మనం సెలెక్ట్ అయినట్టు. ఆ కథ కూడా ఆ సెలెబ్రిటి ఇంట్లో చెప్పాలట.ఈ తతంగం అంతా షూట్ చేసి టెలికాస్ట్ చేయడానికి ఆల్రెడీ నిరంతర వార్త బ్రాంతి tv9 వాళ్ళు రైట్స్ తీసుకున్నారట. దీంట్లో ఒక ఫెసిలిటీ కూడా ఇచ్చారు,  ఈ క్వాలి ఫై రౌండ్ కి మనం ఒక స్నేహేతుడిని వెంటబెట్టుకుని సహాయం తీసుకోవచ్చట.
                     నేను ఫ్రెండ్ అనగానే అశ్విన్ గాడు గుర్తొచ్చి వాడికి ఫోన్ చేశాను.అను అడిగింది ఎవరికీ ఫోన్ చేస్తున్నావని. అశ్విన్ అని నా నోటి నుండి మాట రాక ముందే "కేవ్వ్వవ్వు"మన్ని అరిచి నా చేయి కోరికేసింది. అదే చేయి కొరికి అదే ఏడుస్తుంది,"ఇప్పుడు వాడిని రాప్పించాల ఇక్కడ నేను లేనా? అని. సరే లే నువ్వే ఉండు అని ఏడ్పు మాన్పించే సరికి నా హెడ్డు ప్రాణం టేలుకొచ్చింది.
                     ఇదంతా నిరంతర వార్త బ్రాంతి టీవీ 9 వాళ్ళు షూట్ చేసి నా ముందు ఒక పెద్ద మైక్ పెట్టి గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు." అను ఏడ్పు పై మీ స్పందన? అశ్విన్ కు మీకు ఏంటి అక్రమ సంబంధం?. దీని వెనకాల విదేశీ హస్తం ఏమైనా ఉందా? బాలయ్య బాబు లేటెస్ట్ గా తీసిన బవతార్ సినిమా ని ఇక్కడ బాగా అడిన్చెందుకే మీరు ఈ డ్రామా ఆడుతున్నారా? నేనేమి సమాధానం చెప్పక ముందే ఆ రిపోర్టర్ కెమెరా వైపు తిరిగి "ఆ దీప్తి ఇక్కడ వాతావరణం చాలా వేడి గా ఉంది. ఇందాకే 2  కోడిగుడ్లు కింద పడి పగిలి ఆమ్లెట్ కూడా అయ్యాయి........దీప్తి..
 
స్టూడియో నుండి దీప్తి: మరీ సరళ ఇప్పుడు అను గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది. డాక్టర్లు ఏమంటున్నారు.అను బ్రతికే అవకాశాలేమైన ఉన్నాయా?

షో దగ్గర సరళ: ఆ ......ఆ  దీప్తి ఏంటి ఇక్కడంతా గందరగోళంగా ఉంది. సరిగా వినబదట్లేదు.(చెవి దగ్గర బ్లూ టూత్ సరి చేసుకుంటూ

స్టూడియో నుండి దీప్తి: సాంకేతిక కారణాల వాళ్ళ మనం అక్కడ జరిగింది పూర్తిగా తెలుసుకోలేక పోతున్నాం. ఇప్పుడు మన స్టూడియో లో అడ వాళ్ళ కష్టాల కోసమే పుట్టిన ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు సుమిత్ర దేవి గారి తో ఈ విషయం గురించి చర్చిద్దాం.

                                                                                                                                         (ఇంకా ఉంది)



                          
                                        

                      
                           
                                       

                        

                           

ఔను. తెలంగాణా ప్రజలు తెలబన్సే

                ఈ మద్య కొందరు తెలుగు వాళ్ళు(మన ఖర్మ కొద్ది) తెలుగు వారందరం కలిసి ఉండాలి అంటూనే,మళ్ళి అదే తెలుగు ప్రజలైన తెలంగాణ వారిని తాలిబాన్ల తో పోల్చుతూ తెలబాన్స్ అని పిలుస్తున్నారు. ఇదెక్కడి విడ్డురం. పొమ్మన లేక పొగ బెట్టడం అంటే ఇదేనేమో. అలా అన్న వారికి నేను చెప్పేది ఒక్కటే గాందీ మార్గంలో, "ధన్య వాదాలు". తెలంగాణ వారిని తాలిబన్లతో పోల్చి తెలబన్స్ అని పిలిచి ప్రపంచ స్థాయి కి చేర్చినందుకు.
               1989 లో  తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తాము నమ్మిన సిద్దాంతాల్ని అమలు పరుచుకోవడానికి తమ వారిని బానిసలు గా చేసి కనీసం తమకు ఇష్టమైన చదువుని కూడా దూరం చేస్తున్న రష్యా వారిని ఎదిరించటానికి కన్నా వాళ్లకి దూరమై, ఇష్టమైన చదువుని, వృత్తుల్ని త్యాగం చేసి రష్యా వాళ్ళ పై  పోరాటం జరిపి తమ దేశం నుండి రష్యా సేనల్ని తరిమి గొట్టిన తాలిబన్లతో తెలంగాణా వాళ్ళని పోలిస్తే, అవును తెలంగాణా వాళ్ళు తెలబన్సే. ప్రపంచంలో తామే ధనిక దేశంగా వుండాలని కలలు కంటూ, మిగతా దేశాలను పట్టి పీడిస్తూ, వాళ్ళ మతాలను హేళన చేస్తూ, సంస్కృతులను కాలరాస్తూ, ఎదుటి దేశాల పై యుద్దాలు ప్రకటిస్తూ యుద్ద దాహాన్ని తీర్చుకుంటున్న అమెరికా ని, తమ మతాన్ని, సంస్కృతి ని కాపాడుకోవడానికి ఎదిరించిన తాలిబాన్ల తో పోలిస్తే అవును తెలంగాణా ప్రజలు తేలబన్సే.
                    తెలంగాణా ప్రజలు తెలబన్స్ అయితే మరీ మిగతా తెలుగు ప్రజలు (ఇక్కడ నా సోదర సమానులైన మిగతా తెలుగు ప్రజలు నన్ను క్షమించ గలరు) అందబన్సా? అంటే నిజ నిజాలు తెలుసుకోకుండా కుట్ర కుతంత్రాలతో కళ్ళు మూసుకు పోయిన అజ్ఞానం  లో  ఉన్న ఆంధులా? బ్లాగుల్లో  తెలబన్స్ అంటూ రాయటం తప్ప ఇంకేమి తెలియని  చావా కిరణ్ లాంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళతో గోడవోస్తే "ఆంధ్ర వాళ్ళని అడుక్కు తినే అందబాన్స్" అని రాయల సీమ వాళ్ళతో గోడవోస్తే "రాళ్ళు కొట్టు కోవడానికి తప్ప ఎందుకు పనికి రాని రాలబన్స్" అని అంటారు. ఇలా రెచ్చగొట్టి ప్రజా మనో భావాలని దెబ్బ తీసే వాల్లున్నంత కాలం రాష్ట్రం లో ప్రజలు కాదు కదా ఇంట్లో అన్నదమ్ములు కూడా కలిసుండ లేరు.
                    కాబట్టి తెలుగు ప్రజలు ఎలాంటి అవకాశవాదుల మాటలు నమ్మకుండా అన్నదమ్ముల మాదిరిగా కలిసి కట్టుగా రాష్ట్ర బాగు కోసం ఒక నిర్ణయానికి వచ్చి దాని ప్రకారం నడుచుకోవాలి, అదీ  ప్రత్యేక తెలంగాణా ఐనా సరే. సమైక్యంద్ర ఐనా సరే.