Monday, September 26, 2011

ట్వంటి, ట్వంటీ..... కిక్కే కిక్కు............

 ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం............
 ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం............
 ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం............
నెల రోజులు గా నన్ను వేధిస్తున్న ఆలోచన ఇది. అహర్నిశలు బాగా కష్టించి, శ్రమించి, బాగా నిద్రించి, ఆ నిద్ర లోంచి కలలోకి, కలలోంచి కలల్లోకి పోయి అక్కడ మా అశ్విన్ గాడి బుర్ర బద్దలు కొట్టి చూస్తే అక్కడ దొంగిలించడానికి అసలేం లేదు అంతా ఖాళీయే......
సరిగ్గా అదే సమయం లో పులి ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ ఏదో చెప్తున్నాడు. 
"కర్తవ్యమే దేవాలయం, చర్చి, మసీదు అని" కాని అశ్విన్ గాడి బుర్ర లో ఉన్న నాకు మాత్రం "కర్తవ్యమే కాంగ్రెసోడి పంచ, కర్తవ్యమే షకీలా సినిమా, కర్తవ్యమే కాకరకాయ కూర, అందులో కొత్తిమీర కట్ట" అని వినపడుతున్నాయి. అంటే ఆ డైలాగు ని మన వాడు బుర్ర లోకి ఇలా ఎక్కించు కున్నాడన్నా మాట. ఇంకా అక్కడ ఉండి అవన్నీ భరించలేక వెంటనే నిద్ర నుండి తేరుకున్నాను. 

సరిగ్గా కొన్ని గంటల తరువాత.........................
   

రోజు మార్చి పదహేనవ తేది. సమయం మద్యాహ్నం 1.45 నిముషాలు. అది కాకతీయ యునివర్సిటీ క్రికెట్ గ్రౌండ్. సుమారు ఐదు వందల విద్యార్థులు చూస్తున్నారు మ్యాచ్ ని. ఇంత ఇంపార్టెన్స్ ఎందుకంటే అది ఒక అమ్మాయి కిక్కు కి, ఒక అబ్బాయి లక్కు కి మధ్య మ్యాచ్. "బహు తిక్క శాస్త్రం" (భౌతిక శాస్త్రం) వాళ్ళకి, "మేనేజ్ మెంట్" అంటే "ఏంటి ఇది కొత్తరకం పిప్పరమెంట"? అని అడిగే  ఏం.బి.ఏ వాళ్ళకి జరిగే సమరం అది. ఇంకా 8 పరుగులు చేయాలి కేవలం 3 బంతుల్లో. అందరి లోను ఉత్కంట. అంతట నిశబ్దం.

ఆ నిశబ్దాన్ని చేదించుకుంటూ మిస్టర్ కిషోర్ కుమార్ ఏం.బి.ఏ బాట్స్ మాన్ నెంబర్ 11, ట్రైన్డ్ అట్ గోదావరిఖని, లాస్టర్ ఇన్ ది మ్యాచ్ అని పోకిరి స్టైల్ లో ఒక అన్నౌన్సుమేంట్ వచ్చింది. దాంతో అప్పటిదాకా కర్రక్ట్ ప్లేస్ లోనే ఉన్న నా గుండె ఒక రెండు అడుగుల కిందికి జారింది. మా వాళ్ళందరూ ఒకడు నా కాళ్ళు నొక్కుతున్నాడు, ఒకడు నా భుజాలు నొక్కుతున్నాడు. ఒకడు నాకు జూసు తాగిస్తున్నాడు, కానీ అక్కడ మా కెప్టెన్ అశ్విన్ గాడు మాత్రం ఒక చెట్టు కింద కూర్చుని నన్ను తలచుకుంటూ బోరుమని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఎందుకంటే వాడికి నా టాలెంట్ ఏంటో తెలుసు కాబట్టి.

అందరు నాకు తలో మాట చెప్పి నన్ను ఆ గ్రౌండ్ లోకి తోసేసారు. నేను బౌలర్ మార్తాండ దగ్గరికెళ్ళి మనకు మనకు ఏమైనా ఉంటె నైట్ బారుకెళ్ళి బీరు తాగుతూ మాట్లాడుకుందాం, ఇప్పుడు మాత్రం బంతి మెల్లగా వెయ్  అని చెప్పి వెనక్కి తిరుగుతుంటే అతడు నన్ను పిలిచి " చలం గారి శిష్యులమని చెప్పుకోవాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి. ఆయన శిష్యుడు గారు రాసిన "ఆడదే ఆడది" అనే కథ లో శాండిల్య క్రికెట్ బొల్లివీధి నాగరికత లో ఉందని చదివాడు, అది అంతరించిన తర్వాత అక్కడ స్థిరపడింది రెల్లులేనని చాలా మంది అభిప్రాయం. చైనాలో చెంచులు క్రికెట్ కూడా ఆడేవారు. ఇక్కడ మట్టి అంత సారవంతమైనది కాదులే, అందుకే చెట్లు అంత ఏపుగా పెరగలేదు. చీనాలోని చెంచొచెంచుహు రాష్ట్రంలో కొంత మంది పూర్తి నలుపు రంగులో కనిపిస్తారు. వాళ్ళు మొలకెత్తిన టెంకాయలు తింటారు, టెంకాయలో టెంకోజన్ ఉంటుంది. ఇవి తింటే వంకోటెంకో పాలిసిస్టిక్ లుంబార్ థాలసేమియా రాదు ఇదే విషయం రంగనాయకమ్మ గారు విద్యలోని లోపాల్లో కూడా చెప్పారు....."

ఆ డైలాగులన్ని విన్న నాకు జీవితం మీద విరక్తి పుట్టి ఎక్కడా లేని ధైర్యం వచ్చి బ్యాటింగ్ కి వెళ్లి బాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. బౌలర్ మార్తాండ రెండు తుఫాను ల వేగం తో పరుగెత్తుకొచ్చి మూడు సునామిల వేగం తో బాల్ వేసాడు.నేను ఆ బంతిని నేను ఐదవ తరగతి చదువుతున్న టైం లో ఐ లవ్ యు చెబితే కాదన్న రజిత ముఖాన్ని గుర్తుకు తెచ్చుకుని  తెలుగు సినిమా ఫ్లాపుల వేగంతో కొట్టాను. ఆ బాల్ అలా.. అలా.. చంద్రయాన్ ని వెదుక్కుంటూ పైకి వెళ్ళింది. ఆ బంతి కిందకి వచ్చేంత లోపుగా మనం కూడా చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి వేల్లోద్దాం.  



 


సీన్ కట్ చేస్తే మా డిపార్టుమెంటు కాంటీన్ లో నేను, మా ఫ్రెండ్స్ బ్యాచ్ మా రఫీ గాడు చెప్పే కుళ్ళు జోకులు చేతుల్లో జండుబాం సీసాలు పట్టుకుని వింటున్నాం. అంత కష్టంగా ఎందుకు వింటున్నామంటే మా బిల్ పే చేసేది వాడె కాబట్టి.
అంతలోనే అటు పక్కగా నరేందర్ గాడు జుట్టు చించేసుకుని, చొక్కా చెరిపేసుకుని బ్రేకింగ్ న్యూస్ దొరికిన TV 9 విలేకరి లా   ఆనందం తో గంతులేసుకుంటూ పరుగెత్తుకొచ్చాడు.

"రేయ్ రేయ్ క్రికెట్ టోర్నమెంట్ మీద నోటీస్ బోర్డు వేసారు రా"......

వాడి కంఫ్యూషన్ మాకు అర్థమైంది. వాడు చెప్పాలనుకున్నది "నోటీస్ బోర్డు మీద క్రికెట్ టోర్నమెంట్ అనౌన్స్ మెంట్ చేసారు" అని. మేమందరం ఒకరి ముఖాలు ఒకరం చూసుకుని "యాహూ" అంటూ బుక్స్ ఆకాశానికి ఎగిరేసాం.

ఈ వార్త తెలిసిన వెంటనే అశ్విన్ గాడు శరద్ పవార్ యాదవ్, సౌరవ్ గంగూలి, కృష్ణమాచారి శ్రీకాంత్ వీల్లెవరిని సంప్రదించకుండానే అత్యవసర సమావేశం పెట్టి "తనకి  అండర్- 14 లో వాళ్ళ ఊరికి ప్రాతినిద్యం వహించిన అనుభవం ఉందని" కాబట్టి కెప్టెన్సీ తనకే దక్కాలని మా అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుని, మేం కాదంటే బీర్లు, బిర్యానీలు గట్రా కొనిచ్చి ఎలాగైతేనేం కెప్టెన్సీ పదవికి తానే అర్హుడినని ప్రకటించేసుకున్నాడు.

ఇది తెలిసిన కృష్ణమాచారి శ్రీకాంత్ కనీసం టీం సెలెక్షన్స్ లో అయినా తాను లేకపోతే బాగుండదని "నా వరై , నా సెలెక్ట్ పన్ని తరై" "నా తరై , నా వరై" అంటూ అరవం లో గుండెలు బాదుకుంటూ హుటా హుటిన క్యాంపస్ వచ్చి మా క్లాస్ వాళ్ళతో పాటు అవసరం లేక పోయినా  ఓ ముగ్గురు అరవ వాళ్ళని కూడా సెలెక్ట్ చేసి వెళ్లి పోయారు.

ఇక man of the k.u నే లక్ష్యం గా నేను భేకర ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకుని మా H.O.D దగ్గర పర్మిషన్ తీసుకుని స్పోర్ట్స్ డిపార్టుమెంటు లో అరిగి పోయిన బంతులు, విరిగిపోయిన బ్యాట్లు, చిరిగిపోయిన ప్యాడ్లు కట్టుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాను. రెండు రోజుల్లోనే మీటర్ల కొద్ది పరుగులు, లీటర్ల కొద్ది వికెట్లు తీసిన నాకు "టెన్నిస్ ఎల్బో" గాయం తిరగ బెట్టింది.         

'హతవిధీ' అనుకుంటుండగానే మా దిక్కు మాలిన కెప్టెన్ అశ్విన్ గాడు TV 5 నుండి TV9 వరకు, A TV నుండి Z TV వరకు, నా TV నుండి మనందరి TV వరకు అందరిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టాడు. కెప్టెన్ గా తనకు జట్టు ప్రయోజనాల కంటే తమ ఆట గాడి ఆరోగ్యమే ముఖ్యమని, ఒక విలువైన ఆట గాడి సేవలు కోల్పోతున్నామని, ఐన వెనుకంజ వేసేది లేదని, అలాగని ప్రత్యర్థి జట్టు ని తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేసి నన్ను రిజర్వ్ బెంచ్ కి పరిమితం చేసాడు.

మ్యాచ్ కి రెండు రోజుల ముందు అశ్విన్ గాడు నా రూం కి వచ్చాడు.

అశ్విన్ : రేయ్ నేను నీతో ఒక  విషయం సీరియస్ గా మాట్లాడాలి.
నేను: చెప్పు... ఏంటిరా?

అశ్విన్ : "బాటా" రా!  మొన్ననే గురువారం గుడి కెళ్ళినపుడు కొత్తగా కనబడితే కొట్టుకొచ్చా....హీ..హీ..హీ!
నేను: అది కాదు రా మాటర్ చెప్పు.
అశ్విన్ : అదేం లేదు రా..... మన మ్యాచ్ కోసం నువ్వొకటి చేసి పెట్టాలి..
నేను: చూసి పెట్టమంటే చూసి పెడతా, మ్యాచ్ బ్రేక్ టైం లో తిని పెట్టమంటే తిని పెడతా గాని చేసి పెట్టడం నా వల్ల కాదు రా....  ఐ యాం సీరియస్, ఇట్స్ ఫైనల్..........
అశ్విన్ : (ఆశ్చర్య పోతూ....) ఇది ఫైనల్ ఏంట్రా? మొదటి మ్యాచే కదా!
నేను: ఆ..బే....అది కాదు రా నా డెసిషన్ ఫైనల్ అంటున్నాను.
అశ్విన్ : అంతేనా?
నేను: అంతే...కుదిరితే కప్పు కాఫీ, ఇంకా డబ్బులుంటే సమోసాలు పార్సల్ గట్రా ఏమీ లేవు.....అసలే నాన్న ఒకటో తారీఖు  పంపించిన డబ్బులు రెండవ తారీఖే అయి పోయాయ్.
అశ్విన్ : రేయ్ ప్లీజ్ రా! కావాలంటే డబ్బులు నేను ఇస్తా.....
నేను: ఇప్పటి దాకా ఎవడో అశ్విన్ గాడి మాటలు వినను అన్నాడు. ఎవడ్రా వాడు? తోలు తీస్తా.....హీ..హీ..హీ.... నువ్ చెప్పు రా అశ్విన్.

అశ్విన్ గాడు ముఖానికి గాటు, బుగ్గ మీద పులిపిరి మాదిరి బొట్టు బిళ్ళ పెట్టుకుని సీరియస్ గా నా వైపు కేసి చూస్తూ........ఇంతా చూసినా లాభం లేదని తెలుసుకుని......

అశ్విన్ : మనం మ్యాచ్ ఫిక్సింగ్ చేయబోతున్నాం..అది కూడా నువ్వే చేయాలి. 
నేను: (గట్టిగా......) మ్యాచ్ ఫిక్సింగా?
అశ్విన్ : అదేంట్రా బాబు?  బాలయ్య బాబు సినీమా లో కామెడి సీన్ చూసినట్టు అలా అరిచావ్. ఇదిగో వెయ్యి రూపాయలు. నీ తెలివి అంతా ఉపయోగించి ఎలా ఐన మనం గెలిచెట్టు చూడు..........
నేను: హీ..హీ..హీ.. మ్యాచ్ ఫిక్స్ చేయడానికి నాకు డబ్బులిచ్చావ్ సరే మరి ఓడి పోవడానికి అవతలి వాళ్లకి.............

నేను అన్న ఆ డైలాగు తో అశ్విన్ గాడు హర్ట్ అయి " ఛీ ఎదవా జీవితం" తీసుకోరా....నా పర్సు మొత్తం నువ్వే తీసుకో రా...అంటూ ఏడ్చుకుంటూ వెళ్లి పోయాడు. కాని నేను వాడు అనుకున్నంత కసాయి వాణ్ని కాదు అందుకే పర్సు లోని డబ్బులు మాత్రం తీసుకుని పర్సు మళ్ళి వాడికే ఇచ్చేసా. హా...హా..హా.....
ఇక మొదలు....
జీవితం లో మొట్ట మొదటి సారి మ్యాచ్ ఫిక్సింగ్ అంటే స్పెల్లింగ్ కూడా తెలియని నేను, "30 రొజుల్లొ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం ఎలా?" అనే పుస్తకాన్ని మూడు గంటల్లో చదివి బుర్ర బద్దలు కొట్టుకున్నాను. తీరా ఆ పుస్తకం మొత్తం చదివిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే అందులో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మనం ఎలా ఓడి పోవాలో ఉంది కాని, అవతలి జట్టు ని ఎలా ఓడించాలో లేదు...
మా జట్టు కే అంత దృశ్యం ఉంటే ఇదంతా దేనికి?అంతా మన ఖర్మ..................
ఇలా అయితే ఎక్కడ వేసిన టవల్ అక్కడే ఉంటుందని, టవల్ ని తీసి దండెం మీద ఆరేసి అవతలి జట్టు కెప్టెన్ మార్తాండ కి ఫోన్ చేసాను.
ఇప్పటివరకు మీరు చదివింది స్పోర్ట్స్ స్టోరి, దీనికి సమాంతరంగా మరో పక్క సాగే లవ్ స్టొరీ చూద్దాం, సారీ చదువుదాం.


to be continued......