Wednesday, September 11, 2013

అత్తారింటి నుండి దారేది ...

నదులన్నీ వచ్చి సముద్రం లో కలిసినట్టు ఈ కాలేజ్ కి ఎవడు వచ్చినా సరే వాడిని కలవాల్సిందే.  వాడేదో ప్రిన్సిపాలో కరస్పాండెంట్ అనో అనుకుంటే మీరు పొరబడినట్టే, వాడు అందరి నోట్లో స్పూన్, ఈ కాలేజ్ ప్యున్, వాడి పేరు  అశ్విన్. వాడు నాకున్న ఒక్కగానొక్క ఫ్రెండ్ . వాడి గురించే నేనిక్కడ వెయిట్ చేస్తున్నాను. వాడు ఒచ్చేంత లోపల చిన్న ఇంట్రడక్షన్ వాడి వీక్నెస్  గురించి.

వీడికి వింత వింత పాటల్ని రింగ్ టోన్స్ గా, కాలర్ ట్యూన్స్ గా పెట్టుకునే పిచ్చి. వీడితో ఎవరికైనా అవసరముండి ఫోన్ చేస్తే ఆ రోజుతో వాడికి ఈ భూమ్మీద చిల్లీ చికెన్, చికెన్ బిర్యాని చెల్లి పోయినట్లే . వీడు కావాలనే అవతలి వాడు పాట వినాలని మూడు నాలుగు సార్లకి గాని ఫోన్ లిఫ్ట్ చేయడు, వీడు ఫోన్ లిఫ్ట్ చేసే లోపల అవతలి వాడికి వాంతులు విరేచనాలు అయి 108 అంబులెన్స్ లో ఉంటాడు . వీడి పుణ్యమా అని 108 ఉద్యోగులకి పని ఎక్కువై సమ్మె చేసి మరీ జీతాలు పెంచుకున్నారు.  ఆ మధ్య హైదరాబాదులో సగం మంది వాంతులు విరేచనాలతో బాధ పడుతున్నారని తెలిసి ఓ టీవీ చానల్ వారు " హైదరాబాదు కి వాంతులవుతున్నాయి, దీనికి మొగుడెవరు?" అనే పేరు పెట్టి స్టింగ్ ఆపరేషన్ చేస్తే ఆ మొగుడు వీడే అని తెలిసింది. అంతగా భయపెట్టే ఆ కాలర్ ట్యూన్ పాట ఏంటి? అనుకుంటున్నారా ... అయితే మచ్చుకి ఒకటి ఒదులుతా కాచుకోండి.... వాంతులు విరేచనాలు చేసుకోండి ....

కావో కార వడా....
మురుకు మసాల్ వడా....
పైసలుంటే ఇడ్లి వడా....
లేదంటే పస్తుల దడా ....

కావో కార వడా....
మురుకు మసాల్ వడా....
పైసలుంటే ఇడ్లి వడా....
లేదంటే పస్తుల దడా ....
(పాఠకులు మీరు పై పాట శకుని అనే తమిళ్డబ్బింగ్ సినిమాలోదని గమనించి దానికి దూరంగా ఉండగలరని మనవి)
ఈ రకమైన పాటల్ని పదే  పదే వింటే  వాంతులు విరేచనాలు కాకుండా మరేం అవుతాయండి ...

అదిగో మాటల్లోనే అశ్విన్ వచ్చాడు.
రేయ్ అశ్విన్ సాయంత్రం సినిమా కెళ్దాం. రెడి గా ఉండు అని చెప్పి నేను వెళ్లి పొయాను.
అనుకున్న టైం కంటే ముందే చేరుకున్నాం సినిమా హాలు దగ్గరికి. టికెట్లు తీసుకున్నాం. సినిమా కి చాలా టైం ఉంది ఏం చేద్దాం అనుకునేంత లోపే దూరంగా ....

సోది చెబుతామయ్యా సోది చెబుతాం...
జరిగింది జరిగిందని సెబుతాం....
జరగంది జరగలేదని సెబుతాం....
జరగ బోయేది జరుగుతాదని సేబుతం....
రండి దొరా రండి ....
ఓ పచ్చ నోటిచ్చి నా నోటెంబట  మీ జాతకాలు ఇనుకోండి దొరా...

మా ఇద్దరి భవిష్యత్ గురించి చెప్పు .... అని  వంద నోటు అక్కడ పెట్టాను నేను...
వాడు మళ్ళి  ముందు నుంచి స్టార్ట్ చేసాడు.

సోది చెబుతామయ్యా సోది చెబుతాం...
జరిగింది జరిగిందని సెబుతాం....
జరగంది జరగలేదని సెబుతాం....
జరగ బోయేది జరుగుతాదని సేబుతం....
ఆంధ్ర దేసం అతలా కుతల మవుతాదని సెబుతాను....
అత్తారింటికి దారేది సినిమా వాయిదా పడద్దని సెబుతాను....
డబ్బింగ్ సీరియల్లు డబ్బుల కోసమే అని సెబుతాను....
గవర్నమెంటు ఆఫీసర్లందరికి రిటైర్మెంట్ ఉంటాదని సెబుతాను....
రిటైర్మెంట్ లేని ఫీల్డు రాజకీయమే అని సెబుతాను....
ఇనుకోండి దొరా ఇనుకోండి ...

వాళ్ళందరి గురించి మాకెందుకయ్యా, ముందు మా గురించి చెప్పు....

సినిమాల్లో సిరంజీవి మోహన్ బాబు
కార్టునుల్లో టాం అండ్ జెర్రీ
బ్లాగుల్లో మీరిద్దరు.
మీ ఇద్దరికీ క్లైవ్ లాయిడ్ కి, సెల్యు లాయిడ్ కి ఉన్నంత తేడా ఉంది .... ఇంకా సెప్పాలంటే తెర సాపకి, సొర సాపకి ఉన్నంత తేడా ఉంది. అయినా కాని మీ టెన్షను అటేన్షను ఒకటి గా ఉంటాది దొరా...
చిరంజీవి కూతురి పెళ్లి, ఉదయకిరణ్ భవిష్యత్ కి వచ్చిన్దన్నట్లు, మీలో ఒకరి పెళ్లి మరొకరి ప్రేమ లొల్లి కి కారణమవుతాది దొరా ...

ఆగి ఇక్కడనుంచి నేను చెబుతా అంటూ అశ్విన్ గాడు తగులుకున్నాడు...

అది జరగకుండా ఉండాలంటే నా దగ్గర ఒక మాంచి తాయత్తు ఉన్నాది దొరా,
కాని ఖర్సే ఎక్కువవుతాది దొరా, ఓ వెయ్యి నూట పదహార్లు ఇచ్చుకోండి దొరా...
కట్టి పెడతాను, ఇది కడితే మూడు షూటింగులు, ఆరు రిబ్బను కటింగులు ఉన్న హీరొయిన్ లాగా ఎలిగి పోతారు దొరా..
ఇదేనా నువ్ చెప్పేది?
అవును దొరా... కాని సిన్న సవరింపు దొరా... మీరు మగవారు కద దొరా , అందుకే చేతిలో  మూడు సినిమాలు, ఆరు యాడ్లు ఉన్న హీరో లాగా కలకలలాడుతారు దొరా...
నేను చెప్పలా?  అటు తిప్పి ఇటు తిప్పి ఇక్కడికే తీసుకొస్తాడని... అన్నాడు అశ్విన్ గాడు.
సరే గాని దొరా సినిమా కి టైం అవుతుంది మేం లోపలికి వెళ్ళాలి. డబ్బులున్నపుడు చూద్దాం లే అని సినిమా హాలు లోపలి వెళ్లి పోయాము.

ఆ కోయ దొర  చెప్పింది మేం నమ్ముతామని ఆ రోజు అనుకోలేదు, కాని ఆ నమ్మే రోజు త్వరగానే వచ్చింది ...   అది ఎలాగో కింద మీరే చదవండి...

అశ్విన్ వాళ్ళ అమ్మ దగ్గరి నుండి నాకు సడెన్ గా ఒక రోజు ఫోన్ వచ్చింది.
'బాబు అశ్విన్ కి మంచి సంబంధం వచ్చింది వీడేమో పెళ్లి చేసుకోను 'ఇలాగే గడ్డం చక్రవర్తి లాగా మీసం సామంత రాజు లాగ' ఉంటాను అంటున్నాడు. పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఇంకా. నువ్వైనా వచ్చి సర్ది చెప్పు కిశోర్'.
వెంటనే బయలుదేరాను నేను ...
వెళ్ళీ వెళ్ళగానే ఆవేశంగా డైలాగ్ స్టార్ట్ చేసాను .

రేయ్ అశ్విన్... జీవితంలో ఒక వయసొచ్చాక మనకు రెండు దారులుంటాయి . ఒక దాంట్లో మనకు చాలా మంది అమ్మాయిలుంటారు, తిరగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అక్కడంతా మన ఇష్టమే ఉంటుంది. చివరికి మనకి కష్టమే మిగులుతుంది. ఎవరూ మిగలరు. ఇక రెండో దాంట్లో మనకోసం ఒక అమ్మాయే ఉంటుంది. ఏది చేసినా తనతోనే చేయాలి. మొదట్లో అంతా కష్టంగానే ఉంటుంది. కాని చివరికి అంతా నీ ఇష్టంగానే తయారవుతుంది. నువ్వంటే ప్రాణమిచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు . ఆ రెండో దారి పేరే రా పెళ్ళి .

నేను ఈ డైలాగు చెప్పటం పూర్తి అయిన వెంటనే అశ్విన్ గాడు పెళ్ళికి ఒప్పుకున్నాడు . అది చూసిన చాలామంది చప్పట్లు కొట్టారు. అశ్విన్ గాడి మామ ఆనందం లో మందు కొట్టాడు, దూరంగా ఒక అమ్మాయి మాత్రం నాకు కన్ను కొట్టింది.
చూడు మిస్టర్ నీ పేరేంటి? అడిగిందా అమ్మాయి.
కిశోర్...  అని నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
ఇక నుంచి నీపేరు శ్రుతీ కిశోర్. నేను రొటీన్ గా ఐ లవ్ యూ... అని చెప్పను. కాని ఒక్కటి మాత్రం చెప్పగలను, నీ లైఫ్ సెటిల్ అయి పోయింది అంటూ అక్కడి నుంచి వెళ్ళ బోయింది.

చూడు బంగారం ... నీ అభిప్రాయం చెప్పావు, నాది కూడా వినాలి కదా విను.
ఈ ప్రపంచం అంతరించి పోయేంత వరకు కూడా అంతరించకుండా ఉండేవి రెండే రెండు....
ఒకటి అడుక్కోవటం ... రెండు ప్రేమించటం ....
ఈ రెండింటికి పైసా ఖర్చుండదు, అంతా ప్రాఫిటే... లాస్ అయ్యేది ఏమి ఉండదు అంతా లాభమే ...
ఇక నా విషయానికి వస్తే నాకు ఆ రెండు ఒకటే. ఖర్చు పెట్టకుండా, కష్టపడకుండా వచ్చేది ఏదీ నాకు వద్దు...
సో...  నువ్ నాకు వద్దు. బై అని చెప్పాను.
కాని తను మాత్రం స్టిల్ ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళి పోయింది.
హిట్టు సినిమా టికెట్టు బ్లాక్ లో కొనిచ్చి చూడమంటే వద్దంటున్నావేంటి రా... అన్నాడు అశ్విన్ గాడు.
రేయ్ అమ్మాయి తో లవింగ్, తర్వాత ఫ్రెండ్స్ తో షేరింగ్, వాళ్ళకు పార్టీ ఇవ్వడానికి అప్పులోళ్ళ దగ్గర బెగ్గింగ్, కాలేజ్ దగ్గర డ్రాపింగ్, గోల్డ్ రింగ్ తాకట్టు పెట్టి షాపింగ్, ఆ విషయం ఇంట్లో తెలియకుండా కవరింగ్, వాళ్ళింట్లో తెలుస్తుందేమోనని ఫియరింగ్, తెలిసిన తర్వాత వాళ్ళ బ్రదర్ తో ఫైటింగ్, అది తెలిసి వాళ్ళ నాన్న మన మీద కేసు పెడితే జైలు లో బెయిల్ కోసం వైటింగ్, ఆ అమ్మాయికి పెళ్ళయితే బార్ లో డ్రింకింగ్, ఇంటికొచ్చి వామ్థింగ్, రోడ్డు మీద పిచ్చి కుక్క లా రోమింగ్.
ప్రేమ అనే ఒక హంగు కోసం ఇన్ని ఇంగులు అవసరమంటావారా ?
ఆ తర్వాత వారం రోజులకి...
ఎప్పుడూ లేంది ఏంట్రా ఎక్కిళ్ళు ఆగకుండా వస్తున్నాయ్...
పక్కకి తిరిగి ఓ లుక్కేసుకో ... నీకే తెలుస్తుంది అన్నాడు అశ్విన్ గాడు.
ఇంకెవరు తలచుకుంటారు నేనే, ఇదిగో కిశోర్... నీళ్ళు .. నా ప్రేమ కలిపి ఇస్తున్నా...  అంటూ దిగబడిపోయింది శృతి.
అమ్మా! ఆశ దోష డామినోస్ పిజ్జా! నీళ్ళిచ్చి నన్ను నీ ప్రేమ లో నిలువునా ముంచుదాం అనుకుంటున్నావా ? అదేమ్  కుదరదు నేను తాగానంటే తాగను.
అమ్మాయి ఆఫర్ చేస్తే ఆసిడ్ అయినా సరే అలవోక గా తాగేయాలి కాని నువెంట్రా? ఎండా కాలంలో అమృతం లాంటి నీళ్ళు ఇచ్చినా వద్దంటున్నావ్, అది కూడా హైదరాబాదు లో. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం?
చెప్తా విను...
ఖల్లు ఖల్లున దగ్గే తల్లి, ఆ పక్కనే పెళ్లి కాని చెల్లి, తమ్ముడికి టిబి అన్నకు కాన్సర్, చేతిలో ఫైల్ పట్టుకుని ఉద్యోగం కోసం రోడ్లు పట్టుకుని తిరిగే హీరో, ఇవి రా అప్పట్లో హీరో కు కష్టాలు. కాని ఇప్పుడు....
కన్న కొడుకు కోసం కట్టుకునే మొగుడి మీదే సెటైర్లు వేసే తల్లి, పెళ్లి అయి ఫారిన్ లో సెటిల్ ఐన చెల్లి, బాబి బ్యాంకు మేనేజర్, అన్న సాఫ్ట్వేర్, హీరో బలాదూర్, ఆ బలాదూర్ కి బైకు వెనకల కూర్చుని క్యాష్ ఎలా ఖర్చు పెట్టాలో చెప్పే నీ లాంటి ఫ్రెండ్.
వీళ్ళతో సాఫీ గా సాగిపోయే నా జీవితం లోకి ఒక అమ్మాయి రావడం, ఆమె ప్రేమ కోసం నేను కష్టాలు పడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్లి పొయాను.

మరుసటి రోజు డైరెక్ట్ గా ఇంటికి వచ్చింది శ్రుతి. ఆ టైం లో నేను అశ్విన్ మాత్రమే రూం లో ఉన్నామ్.
రేయ్ కిషోర్ నా ప్రేమ ఒప్పుకో, లేదంటే ఈ విషం తాగి నేను చచ్చి పోతాను అంటూ బాటిల్ తీసింది.
కోపం వచ్చి ఒక్కటి పీకాను.
అది కాదు రా కిషోర్ నిన్ను పడేస్తాననే నమ్మకం తో మా నాన్న తో కూడా ప్రేమ విషయం చెప్పాను రా. తను కూడా ఒప్పుకున్నాడు . మా నాన్నసలే ఫాక్షనిస్టు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు.
అయినా అంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉన్నావ్ నన్ను పడేస్తానని?
నాకు మీ ఫ్రెండ్ ఆశ్వినే చెప్పాడు "డస్ట్ బిన్ లో కోక్ టిన్ పడేసినంత ఈజీ గా నిన్ను ప్రేమ లో పడేయోచ్చని" నిన్ను ఆ డస్ట్ బిన్ లో పడేయడానికి, సారి సారి ... ప్రేమ లో పడేయడానికి హెల్ప్ చేస్తానని నా దగ్గర ఐదు వేలు కూడా తీసుకున్నాడు.
లంచమా?... అని అశ్విన్ వైపు తిరిగి చూసే సరికి వాడు పక్కకు లేడు, బయట బైక్ ఎక్కి కిక్ కొడుతున్నాడు, కొడుతున్నాడు, కొడుతూనే ఉన్నాడు.
ఆపమ్మా అశ్విన్! బైక్ కి కీస్ పెట్టకుండా స్టార్ట్ అయ్యే బైకుల్ని మన అమ్మా నాన్నలింకా కొనియ్యలేదు కాని ఇట్రామ్మా కీస్ నా దగ్గర ఉన్నాయి.
వాడు రాగానే ఫాట్ ఫాట్ మని నాలుగు తగిలించి.... ఇప్పుడు చెప్పు నాన్న డబ్బులేం చేసావ్?
రెండు వేలు పెట్టి నీకె రేబాన్ గ్లాస్ కొనిచ్చా....
అమ్మా నా అశ్విన్ గా "వర్షం లో వేసుకొస్తే ఎక్కడ తడిచి పోతుందేమోనని రెయిన్ కోట్ ఇంట్లో దాచి పెట్టె నువ్వు రేబాన్ గ్లాస్ కొనిచ్చినపుడే డౌట్ వచ్చింది రా" ఆ డబ్బులెక్కడివని?
సరే గాని మిగతా మూడు వేలు?
ఐ.బి. ఎల్ లో సానియా మిర్జా గెలుస్తుందని బెట్ కట్టా....
నీయబ్బా బాడ్మింటన్ కి టెన్నిస్ కి తేడా తెలియకుండా ఎలా బెట్ కట్టావు రా? నిన్ను ఇలాగే ఒదిలి పెడితే 'భారత దేశ ప్రధాని గా బారక్ ఒబామా కూడా గెలుస్తాడని బెట్ కడతావు' రా... నీ ఎంకమ్మా...

మీ ఇద్దరి సంగతి పక్కన పెట్టండి, ముందు నా సంగతి ఆలోచించండి... రేపే మా నాన్న ఒస్తున్నాడు.
రేపు ఈ విషయం ఆయనకు  తెలిస్తే నన్నుఆ లొకేషన్ లోనే  చంపుతాడు, మిమ్మల్ని మాత్రం అవుట్ డోర్ తీసుకెళ్ళి మరీ పరిగెత్తించి, పరిగెత్తించి మరీ చంపుతాడు. కాబట్టి అందరి మంచి కి  చెబుతున్నా... రేయ్  కిషోర్ నన్ను ప్రేమించక పోయిన ప్లీజ్ నటించ రా  ప్రేమించినట్టు, తర్వాత నేను ఎలాగో మేనేజ్ చేసి మిమ్మల్ని బయట పడేస్తాను.  అంది శ్రుతి.నేను కూడా ఆలోచించి అసలే "మనం కలర్ తక్కువ, వెయిట్ ఎక్కువ" ఎండ లో పరిగెట్టడం అవసరమా?అని సరే అని ఒప్పుకున్నాను.

మేము ఆయన్ని కలవడానికి వాళ్ళ గెస్ట్ హౌస్ కి వెళ్ళాం, చూడడానికి శ్రుతి వాళ్ళ నాన్న సీమ సినిమాల్లో జయ ప్రకాష్ రెడ్డి లా ఉన్నాడు. ఆయన నన్ను చూడగానే ...
"బాబు సమర సింహా రెడ్డి ఎలా ఉన్నావ్? ఎన్ని రోజులకి చూసాను నాయనా? నువ్వు లేక సీమ సిన్నబోయింది, తెలంగాణా తెల్లారి పోయింది, ఆంద్ర అడ్రస్సు లేకుండా పోయింది, ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నావ్ నాయనా? చెన్నై లో ఉన్న మన శత్రువుల్ని చెయ్యి కాలు తీసెయ్య దానికి పోయినావ? కాశికి పోయినోల్లని ఖాతం చేయడానికి పోయినావా? బెంగళూర్ లో తల దాచుకున్నోలని బెంబేలెత్తియడానికి పోయినావ?" అంటూ భీకరంగా ఓ నవ్వు నవ్వాడు.
సార్ నేను సమర సింహా రెడ్డి ని కాదు.
నాకంతా తెలుసు అల్లుడు, నువెం మాట్లాడకు, ఏదో బిల్డప్పు కోసం ఆ డైలాగులు చెప్పా..  ఇక పై నువ్వే నా సమర సింహా రెడ్డి వి, ఇంద్ర సేన రెడ్డివి, ఆది కేశవా రెడ్డివి అంటూ నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు.
కాసేపటికి మా మామయ్యా అశ్విన్ గాడికేసి చూసి "అవున్రా అబ్బి అప్పట్నించి చూస్తా ఉన్నా బక్క చిక్కిన బెమ్మానందం లెక్కుండావ్. ఇంతకి నువ్వేం చేస్తుండావ్?" అని అడగ్గానే చటుక్కున అశ్విన్ గాడు
"ప్రత్యేక తెలంగాణా ఉద్యమం చేస్తుంటాను సార్" అని నాలిక్కరుచుకున్నాడు.
మా మామయ్య అనుచరులందరూ వీడికేసి గుర్రు గా చూస్తున్నారు...
గబ్బు నాయాల గబ్బు నాయాల అది కాదు రా  డబ్బులు సంపాదించడానికి ఎం చేస్తా ఉంటావ్ రా...
డబ్బుల కోసమా సార్ ... "అప్పుడప్పుడు సమైక్యాంద్ర ఉద్యమం లో పాల్గొంటాను సార్ " అన్నాడు.
ఆ డైలాగు తో నాకు వాడి ఫుచర్ అర్థమయింది.
దాంతో కారు వెనకాల సీట్లో నన్ను, కారు కి వేనకాల డిక్కి లో అశ్విన్ గాడిని కూర్చోబెట్టి మమ్మల్ని రాయల సీమ లో వాళ్ళ  ఊరికి తీసుకెళ్ళాడు.
మేం ఊల్లో కారు దిగగానే బొట్టు లేని వాళ్ళోచ్చి బొట్టు పెడుతున్నారు, చేతులు తెగిన వాళ్ళోచ్చి హత్తుకుంతున్నారు, అన్ని అయిపోయిన వాళ్ళోచ్చి హారతులిస్తున్నారు. అంతలో ఎవరో కాలు గోకుతున్నట్టు అన్పించి కిందికి చూసాను. వాడు మల్లి గోకుతున్నాడు. వాడికి కాళ్ళు  లేవు. వాణ్ని చూసి ముష్టి వాడు అనుకుని
'హే  ఈ టైం లో ముష్టి ఏంటి రా? పో' అన్నాను ..      
'అయ్యా!  అన్న నన్ను ముష్టి వాడు అనుకున్నాడన్నా నేను భరించలేను' అని ఓ పెద్ద కత్తి తీసి పొడుచు కొబోయాడు.
ఎదవ ఎక్కడ చస్తాడో అని టెన్షన్ లో నా చేయి తెగినా సరే అని వాణ్ని ఆపాను. అంతే....
వెనక నుంచి మా మామ వాయిస్ ...
"సెప్పినాను కదా రా ఈ సీమ కు సింహాన్ని తీసుకోస్తాండనని" రేయ్ ఇక నించి నీ సావే కాదు ఈ సీమ లో ఎవరి సావులుండవ్. ముందు అల్లుడి తల తెగి పడ్డాకే మన తలలు, అంతవరకు మీరు నిశ్చింతగా ఉండండి.
ఏంటి నా తల తెగి పడ్డాకా? అని శృతి వైపు చూసాను.
తను ఇక్కడిదంతా కామన్ అంటూ లోపలి వెళ్లి పోయింది.
బాగ్రౌండ్ లో  నాకు మర్యాద రామన్న టైటిల్ సాంగ్ వినబడుతుంది
"ఇన్నాళ్ళకి పెద పండగ వచ్చే వాకిన్డ్లకి మా కాలువలు గుచ్చే అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే హొ.... "
కొట్లిస్తది కోడిని కోసిస్తే మెల్లిస్థది మేకను బలి ఇస్తే, పోలమ్మకి వీడిని బలి  ఇస్తే హొ .... "
రేయ్  అశ్విన్ నీకు  బాగ్రౌండ్ లో ఎమైనా సాంగ్ వినబడుతుందా?
నా తరుపు నుంచి వినపడట్లేదు కాని ఇక్కడ వాళ్ళ తరుపు నుంచి అయితే వినపడ్తుంది రా .....
ఏం పాట రా అది?
"పండగలా దిగి వచ్చావు ప్రాణాలను అర్పిస్తావు               
మా ఊరికి అండయినావు, మా అయ్యకి బలి అవుతావు ....
అయ్యంటే ఫాక్షనిస్టు అయ్యంటే రేపిస్టు "

అలా నేను ఎంట్రా ఈ ఖర్మ అని బయపడుతుండగా ...
'అల్లుడు అమ్మాయి తో కలసి అలా సరదాగా షాపింగ్ చేసి రా' ... అని ఆర్డర్ వేసాడు మా మామయ్య.
ఆడాళ్ళతో అది పెళ్లి కాని అమ్మాయి తో షాపింగ్ అంటే మీకు తెలుసుకదండీ.అసలు నన్నడిగితే బాల కార్మికుల కష్టాలు, స్టాక్ ఎక్స్చేంజి నష్టాలు, ఆడపిల్లల షాపింగులు వీటికి ఆరంభమే కాని అంతం ఉండదు. గంట, రెండు, మూడు, నాలుగు గంటలు,మధ్యాహ్నం ఆ తర్వాత సాయంత్రం కూడా అయింది. అశ్విన్ గాడు నాకు కంపెనీ ఇస్తాడని తీసుకొస్తే వాడు సేల్స్ గర్ల్ కి కంపెనీ ఇస్తున్నాడు. నాకు చిరెత్తుకొచ్చి .... 
శ్రుతి ఇంకెంత సేపు అన్నాను నేను బిల్ కౌంటర్ దగ్గర నిలబడి...
నువ్ బిల్ కట్టు వస్తాను ... అంది శృతి దూరం నుంచి
అక్కడున్న రౌడి గాంగ్ నుంచి ఒకడు ....
"రేయ్ పాప బిల్లు కడితే వస్తాదట  రా... మనము కడదామా బిల్లు ?ఎయ్ పాప మేము బిల్లు కడతాం మాతో ఓ గంట వస్తావా? అని అడిగాడు ...
దాంతో నాకు ఎక్కడో కాలింది... ఆ కాలిన వాసన అశ్విన్ గాడు ముక్కు తో పసిగట్టి, వాడి నోటి తో నా చెవిలో " రేయ్ కిషోర్ మనకిప్పుడు ఈ ఫైటింగ్ సీన్ అవసరమంటావా? ఈ ఫైట్ చేస్తే నీ మీద అమ్మాయికి లవ్వు వాళ్ళ నాన్న కి కొవ్వు పెరిగి పోయి "అల్లుడు మా ఈ సీమ కి నువ్వే కరక్టు మొగుడు అని నిన్ను పర్మినెంటు గా ఇక్కడే ఉంచేసుకుంటాడు" జాగ్రత్త అన్నాడు.
రేయ్ ఏంట్రా ఆ గుసగుసలు? వి నీడ్ హేయర్ ఫైటింగ్.... స్క్రిప్ట్ డిమాండ్ చేస్తున్దిక్కడ... అన్నాడు ఒక రౌడి...
"రేయ్ రేయ్ రేయ్ నీది ఒక్క రేయ్  అయితే నాది మూడు రేయ్ లు. నేను తలుచుకుంటే హిందీ లో అభిషేక్ బచ్చన్, తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు డాన్స్ చేసినంత ఈజీ గా మీతో ఫైట్ చేసి మిమ్మల్ని  కోట్టి, పడగొట్టి, పార్సల్ కట్టేయగలను" కాని యాక్షన్ హీరో లే కలకాలం గుర్తుంది పోయే కామెడి వైపు వస్తుంటే నేను యాక్షన్ వైపు వెళ్ళడం ఎందుకని ఆలోచిస్తున్నా... "
ఆవేశంగా ఈ డైలాగు కంప్లీట్ చేసి మరోసారి ఇది రిపీట్ అవద్దు రిపీట్ అయిందో రిసల్ట్ వేరేలా ఉంటుందని ఒక చిటిక వేసా అంతే .
దూరంగా ఉన్న వాళ్ళ బొలెరో బ్లాస్ట్ అయింది, అందరు నా వంక ఆశ్చర్యం తో కూడిన భయం తో చూస్తున్నారు, రౌడి లందరూ పరిగెడుతున్నారు, అశ్విన్ గాడు  ఆల్రెడీ కింద పడిపోయాడు. శృతి అయితే 'యూ  ఆర్ ఆసం' అని అరిచి గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టింది. దాంతో నేను కూడా కింద పడిపోయాను.
కళ్ళు తెరిచి చూసే సరికి నేను అశ్విన్ గాడు హాస్పిటల్ లో పక్క పక్క బెడ్స్ లో ఉన్నామ్.
పక్కనే మా మామయ్య "ఎందల్లుడు అట్ట పడి  పొయినారు... నీ బిల్డప్పు కి, మన హోదా కి తగ్గట్టు గా ఉంటాదని నేనే ఓ నాటు బాంబు ఏయిన్చుండా, మీరేం కంగారు పడబాకండి" అని చెప్పి ఎవరినో నరికే ప్రోగ్రాం ఉందని వెళ్లి పోయాడు.
మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాము, అలాగే సీమ నుండి ఎలాగైనా తప్పించు కోవాలని కూడా డిసైడ్ కూడా అయ్యాము.
రేయ్ కిశోర్....
 నా మెదడు ఇప్పుడే పాదరసం లా పని చేసి ఒక పవర్ ఫుల్ ఐడియా వచ్చింది చెప్పమంటావ?
వద్దు రా అశ్విన్...
నీ మెదడు మెదడు లా పని  చేస్తేనే మనం ఫ్యాక్షనిస్ట్ ఇంట్లో ఉన్నాం, అదింకా మెదడు లా కాకుండా పాద రసం లా పని చేస్తుందంటే మనం ఏ పాకిస్తాన్ టెర్రరిసం క్యాంపు లోనో ఉంటాం. వద్దు నాని..
అది కాదు రా కిషోర్, తాగకుండా మనం పక్క వాడి బిల్లు కట్టే బదులు మనమే తాగి మన బిల్లు మనమే కట్టుకోవచ్చు కదా ...
అంటే? అడిగాను నేను ...
లాజిక్ అర్థం చెస్కొ... ''ప్రయత్నించకుండా పక్క వాడికి గెలుపు అప్ప చెప్పే బదులు, ప్రయత్నించి ఓడిపోవడం మంచిది కదా''
ఏమో రా అశ్విన్ నీ నోటి వెంబడి ప్రయత్నించడం, గెలవడం లాంటి మాటలు వింటుంటే నాక్కూడా ఆశ చిగురిస్తుంది రా..
చిగురించడం కాదు రా మన ప్లాన్ సక్సెస్ అయితే చిగురు తో పాటు పూలని,పళ్ళని కూడా ఇస్తుంది.
ఇంతకి ప్లానేంటి రా?...
సాయంత్రం మందు పార్టి అరేంజ్ చేసి మీ మామ ని పిలుద్దాం. ఎంత ఫాక్షనిస్టు అయినా సరే తన అల్లుడు తాగుబోతు అని తెలిస్తే భరించడు. సో పెళ్లి కాన్సిల్ చేస్తాడు.
ఒకవేళ అలా జక్కపోతే ... అడిగాను నేను.
ప్లాన్ "క"  కాకపోతే ప్లాన్ "గ"
మనం ఎలాగూ తాగి ఉంటాం కాబట్టి తాగినపుడు ఏ పిచ్చి కుక్క ని కూడా మనం లెక్క చేయం కాబట్టి మీ మామ అరచి గోల పెట్టినా సరే అరవకుండా బాంబు పెట్టినా సరే మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదని నువ్ చెప్పేయ్. అంతే.... ఎలా జరిగేది అలా జరుగుతుంది.
అనుకున్నట్టు గానే సాయంత్రం ప్రోగ్రాం పెట్టి మా మామ ని పిలిచాం. మా మామ వచ్చి రాగానే "శేహాబాష్ అల్లుడు మన పరువు నిలబెట్టినావు, ఫాక్షనిస్టులన్నాక ఆ మాత్రం అలవాటుండాలా.... నచ్చినావు అల్లుడు.... అయినా నాకు చెప్పలేదేం? చెబితే నేనే దగ్గరుండి ఫారిన్ సరుకు తెప్పించే వాణ్ని కదా...అయినా పర్లేదు లే కానియ్ ఆల్లుడు  " అంటూ మా మామ మందు ఫుల్లు గా లాగించాడు. నేను అశ్విన్ గాడు ఏమి లేక గుడుంబా లాగించాం.
ప్లాన్ "క" ఒ.కె కాలేదు ఇక ప్లాన్ "గ"
మామయ్య నేను నీకో విషయం చెపుతాను అని ఇండైరేక్ట్ గా కవిత రూపం లో స్టార్ట్ చేసాను నేను...

మామ నువ్వో  పేద్ద ఫాక్షన్ కొండ
ఈ ఊరికి నువ్వే అండ దండ
కాని నీ కూతురు ఉండు చూసావ్
అదో పెద్ద దొంగముండ
నన్నిక్కడ ఇరికించిన అశ్విన్ గాడు నా ఫ్రెండా?
కాదు కాదు వీడి మొహం మండా ....
నాకు తెలుసు ఈ గుడుంబా ఫ్రం తండా
నాకసలు ఈ సంబందమే వేండా(తమిళ్ లో వద్దు)

అల్లుడు ఇప్పుడు నేనో కవిత శేబుతా ఇను.... అని స్టార్ట్ చేసాడు మా మామయ్య ...

ఫాక్షనిజానికి ఈ ఊరే ఓ పేద్ద  బడి
ఇక్కడికి ఒన్లి రాబడి నో పోబడి
ఇక్కడ మేకు హెల్ప్ చేయరు ఎనీబడి
నువ్వు ఒప్పుకుంటే మన సంబంధం బలపడి
నేను నీకిస్తాను వ్యాపారానికి పెట్టుబడి
లేదంటే చేయిస్తాను చేతబడి
ఆ తర్వాత నీ శవం వుంటుంది స్మశానం లో కాల్చబడి...

అల్లుడు నీ ఫ్రెండ్ అశ్విన్ కోసం ఇంకొకటి ...

లేదు రా అశ్విన్ నువ్ వండిన చికెన్ లో ఉప్పు
నాకు తెలుసు నీకుంది ఆరు లక్షల అప్పు
నీ చేతి లో ఉంది వేయించిన వేరు శెనగ పప్పు
కాని నీ బ్రెయిన్ లో ఉన్నదంతా తుప్పు
నా కాలికుంది బాటా చెప్పు
దాంతో కొడితే నీ పళ్ళకుంటుంది ఓ క్లిప్పు
లేదు నా కూతురి దగ్గర తప్పు పెళ్ళికి ఒప్పుకోమని నీ ఫ్రెండు కి చెప్పు
పొందు నా మెప్పు ....

ఆయన చెప్పిన ఆ రెండు కవితలతో ఆయనకు మొత్తం అర్థమయిందని మాకు అర్థమయింది. అంతలోపే ఆయన ఫోన్ రింగ్ అయింది. "అన్నా మనోళ్ళని కొట్టి మన శత్రువు వీర బలుపు రెడ్డి అమ్మాయి గారిని తీసుకుపోతున్నాడయ్య" .... అంటూ అవతలి నుంచి వాయిస్.
"అల్లుడు నూవు పోయి అమ్మాయిని తీసుకు రావాల, లేదంటే ఇక్కడ నీ ఫ్రెండు అశ్విన్ పేనాలు గాలి లో కలిసి పోతాయి" అని ట్విస్ట్ పెట్టాడు మామయ్య. రేయ్ కిషోర్ నీ హీరోయిజమ్ చూపించాల్సిన టైం వచ్చింది ఈయన చంపడం కాదు నేనే చచ్చి పోతా, నువ్ శ్రుతిని తీసుకు రాక పోతే అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు అశ్విన్ గాడు.

నా  హీరోయిజమ్ చూపించాల్సిన టైం వచ్చింది, వెంటనే నా ఫ్రెండు కి ఫోన్ చేసాను.


అది నిర్మానుష్య మైన హైవే. ఆ రోడ్డు మీద పది స్కార్పియోలు వేగంగా వెళ్తున్నాయి, కెమెరా బ్లూ జీన్స్ వైట్ షూస్ వేసుకున్న రెండు కాళ్ళ వైపు చూపించింది, ఆ రెండు కాళ్ళు నడుచుకుంటూ రోడ్డు కి అడ్డంగా నిలబడ్డాయి.  స్కార్పియోలు వేగంగా వచ్చి అతన్ని చూసి సడెన్ గా బ్రేక్ వేసాయి అంతే వెనకాల ఉన్న రెండు స్కార్పియోలు బ్లాస్ట్ అయ్యాయి. ముందు వాట్లోంచి ఒక రౌడి దిగి "ఎవడ్రా నువ్" అన్నాడు. అతను డైలాగ్ చెప్పటం స్టార్ట్ చేసాడు.
"మర్యాదగా మీరందరూ ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపొండి"
లేదంటే అన్నాడు ఒక రౌడి.
"లేదంటే ముందు వాడిని తర్వాత వాడి పంచ్ పవర్ ని చూడాల్సి వస్తుంది".
వాడు వాడంటున్నావ్...ఇంతకి ఎవడ్రా వాడు?
"వాడు నా ఫ్రెండ్, వాడేం చేసినా అదో ట్రెండ్."
వాడు "ఆవేశంగా డైలాగ్ చెబితే సాయికుమార్, అదిరిపోయేలా ఫైట్ చేస్తే పీటర్ హెయిన్స్, ఆశ్చర్యపోయేలా డాన్స్ చేస్తే ప్రేమ్ రక్షిత్, ఆపకుండా పరిగెత్తితే మహేష్ బాబు" అందరూ ఆగి మరీ చూస్తారు.
"వాడు భరిలోకి దిగని భూకంపం, సైలెంట్ గా ఉన్న సునామి".
'అన్న వీడింత చెబుతుండంటే వాడు ఖచ్చితంగా తెలుగు లో స్టార్ డం ఉన్న హీరో నే అన్న' అన్నాడొక రౌడి వాళ్ళ గాంగ్ లీడర్ తో.
రేయ్ ఎదవ ఇది సినిమా కాదు రా బ్లాగు. వాడు "తెలుగులో స్టార్ డం ఉన్న హీరో కాదు రా, బ్లాగుల్లో స్టార్ డం లేని హీరో" వాడి పేరు "కిషోర్", వాడితో తలపడితే ఎవరైనా రిటైర్ అని పక్కకి జరిగి వాడి వెనకాల సిగరెట్ తాగుతున్న నా వైపు చూపించాడు.
ఇప్పటి వరకు వీడి గురించి చెప్పి మా టైం అంతా వేస్ట్ చేసావ్... అసలు అప్పటినుంచి అడుగుతున్నాం నువేవడ్రా?
అది నేను చెబుతాను.
వాడు  నా ఫాన్, వాడి పేరు చంద్ర మోహన్....
నేను స్టార్ అయితే వాడు నాకు బూస్టర్, వాడి చేసేది సాఫ్ట్వేర్... 
క్లైమాక్స్ లో ఒన్లి డైలాగులేనా? ఫైటింగ్ లేదా? అడిగాడొకడు...
బ్లాగుల్లో ఫైటింగ్లుండవ్ ఒన్లి బ్లాస్టింగులే... అని మిగతా వాటిని కూడా బ్లాస్ట్ చేసి, మేము రౌడి లతో డైలాగులు చెబుతుండగా తప్పించుకుని మా వైపు వచ్చిన శ్రుతిని తీసుకుని బయలుదేరి వాళ్ళ నాన్నకు అప్పగించాం. అశ్విన్ గాడిని విడిపించాం.
ఇంత చేసాం కాని పెళ్లి నుండి మాత్రం తప్పించుకో లేకపోయాను. అదేంటి అంటారా?
వేమన శతకం  ప్రకారం తినగా తినగా వేప కూడా తీయగా ఉంటుంది, హిట్లర్ సిద్ధాంతం ప్రకారం చెప్పగా చెప్పగా అబద్దం కూడా నిజం అవుతుంది, ప్రేమ పిచ్చి ప్రకారం ఒక ఇష్టం లేని అమ్మాయిని చూడగా చూడగా , ఆమెతో గడపగా గడపగా ఆమె నచ్చుతుంది. దాంతో శ్రుతిని పెళ్లి చేసుకున్నాను.
ప్రస్తుతానికి నేను మా మామ వెంబడి బాంబులు పట్టుకుని తిరుగుతూ, అప్పుడప్పుడు సెటిల్మెంట్లు చేసుకుంటూ, ఖాళీ సమయాల్లో కాపురం చేసుకుంటూ నా జీవితాన్ని గడిపేస్తున్నాను.ఇంతకు మీకు మా మామ పేరు చెప్పనే లేదు కదూ ఆయన పేరు కిరాయి కిరాణా కుమార్ రెడ్డి.   

4 comments:

 1. సూపర్ గా రాశారండి. ఇంత గ్యాప్ తీసుకున్నారే???

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు...
   జాబ్ లైఫ్ లో బిజీ గా ఉండి రాయలేక పోయానండి. ఇక మీదట తప్పకుండా రాస్తాను.

   Delete