Friday, March 26, 2010

రెండు రెళ్ళు ఆరు (ఒక కా'లేజీ' ప్రేమ కథ)

 "హే బావలు సయ్యా! హే మరదలు సయ్యా"!,
 "హే మరదలు సయ్యా! హే బావలు సయ్యా"!,
 "రింబోలా, రింబోలా, రింబోలా.....................
 "హొయ్..........హొయ్......"

టి.వి లో వచ్చే ఈ పాట ని కళ్ళు, వొళ్ళు రెండు అప్పగించి పిక్చర్ ట్యూబ్ బద్దలు అయ్యేలా చూస్తున్నాడు మా మామయ్యా. నేను వచ్చి పక్కన కూర్చోగానే చానల్ మార్చి "రేయ్ హోం వర్క్ చేసావా"? అని ప్రశ్న...........

నేను చేసాను అని చెబుదాం అనుకునేంత లోపే.........
"ఒక వేళ చేసి వుంటే దాన్ని తల్లకిందులు గా గంట కి వంద కిలోమీటర్ల చొప్పున చదువుకో పో" అంటూ, మళ్ళి మామయ్యే...........

నెక్స్ట్ సీన్ లో "అమ్మా............" అని  కేక. ఆ కేక తో వంట గది లో వంట చేస్తున్న మా అమ్మ అక్కడ మాయమై నా దగ్గర ప్రత్యక్షమైంది. "కొడకా ఏమి నీ కోరిక" అనగానే, 'చూడమ్మా..... మామయ్యా ఎంతకీ నన్ను టి.వి. చూడనివ్వట్లేదు'. అని కంప్లైంటు ఇచ్చా........ అమ్మ నాకు సపోర్టు చేస్తుందని ఆశ. కాని అలా జరగలేదు, " ఇంకా నీ వయసు ఎనిమిదేల్లె కదా రా...బాగా చదువుకుని పెద్దయ్యాక అప్పుడు చూద్దువు లేరా......ఇప్పుడు స్కూల్  కి రెడీ అవ్వు, బస్సు వచ్చే టైం అవుతుంది" అని నన్ను మాయ చేసి తాను కూడా మాయమయింది అమ్మ.

మొన్నటికి మొన్న సినిమా కి వెళ్తా అన్నా, మామయ్య వాళ్ళ టీం తో క్రికెట్ ఆడతా అన్నా ఇదే సమాధానం "అన్ని పెద్దయ్యాక అని". మీ పెద్దాల్లెప్పుడు ఇంతే అని మనసు లో అనుకుంటుండగానే వీధి చివర మా స్కూల్ బస్సు హారన్ వినబడింది.

ఆ బస్సు ని అందుకోవడానికి నేను పరుగందుకున్నాను. నేను బస్సు ని చూస్తూ పరుగెడుతున్నాను,  అంతలోనే నా పక్క నుండి హైదరాబాద్ మున్సిపాలిటి వాళ్ళు వాన్ లో దోమలతో పాటు మనుషులు కూడా "పోయే" స్మోక్ ని  వదులుతూ వెళుతున్నారు. ఆ పొగలో కాసేపు మాయమయ్యాను నేను. సన్నగా బ్యాక్ గ్రౌండ్ లో  ఏదో శబ్దం వస్తుంది. "అది... అదే... అదే, కచ్చితంగా అదే" అది ప్రతి సినీమా లో హీరో పెద్దయ్యేప్పుడు ఇంట్రడక్షన్ లో వచ్చే మణి శర్మ మ్యూజిక్కే. కెమెరా కళ్ళు  స్మోక్ లోంచి  బయట 'పడుతూ',  'లేస్తూ' పరుగెడుతున్న నా కాళ్ళని జూమ్ లో స్లో మోషన్ లో చూపిస్తున్నాయి. చూస్తుండగానే మా స్కూల్ బస్ కాస్తా హైదరాబాద్ సిటీ బస్సు అయింది. అలా పరుగెడుతుండగానే ఒక చేయి కి రిస్ట్ బాండ్, ఇంకో చేతిలో నోట్ బుక్, యూనిఫాం ప్లేస్ లో టి షర్ట్, జీన్స్ పాంట్ నా కాళ్ళకి రీబాక్ షూస్ ని కెమెరా మెన్ పార్ట్స్ పార్ట్స్ గా చూపిస్తున్నాడు.నా ఎడమ చేయి సపోర్టింగ్ రాడ్ ని పట్టుకుని కుడి కాలు ఫుట్ బోర్డ్ మీద పెట్టి బస్సు ని అందుకున్నాను.

బస్సు లోపలికి  వెళ్ళే సరికి "కేవ్వ్వ్ ..వ్వ్ ..వ్వ్ ..వ్వ్ .....", ఇంతా కష్ట పడి తెలుగు సినీమా హీరో ఇంట్రడక్షన్ లా బిల్డప్ ఇచ్చి నేనేక్కింది లేడీస్ స్పెషల్ బస్సు. ఛీ! ఎధవజీవితం. నా శ్రమంతా "బాలకృష్ణ సినీమా లో పోసిన బడ్జెట్" అయింది. కాని కొద్ది సేపటికే తెలిసింది నేను పోసింది "నరసింహా నాయుడు" సినీమాకేనని.

వీళ్ళందర్నీ ఎక్కడో చూసినట్టుందే............., వీళ్ళందరికీ కలిపి ఒక పేరు కూడా ఉంది. అదేనండి, నిండు గా చీర కట్టుకోమంటే నిరాహారదీక్ష చేసి మేం ఈ తరం ఆడపిల్లలం అంటారు......స్నానం చేసొచ్చి కుప్పిగంతులేస్తూ, మంచం కింద దాక్కున్న హీరో ని చూడగానే "కేవ్వ్వ్....వ్వ్.....వ్వ్" మని అరచి ఉన్న ఒక్క టవలు ఊడదీసేసుకుంటారు. ఆ..... గుర్తొచ్చింది."తెలుగు సినీమా హీరోయిన్స్".

వీళ్ళందరూ బస్సు లోనే  ఉన్నారు. నన్ను చూడగానే వాళ్ళందరూ బాడి స్ప్రే యాడ్ లో హీరో కోసం మోడల్స్ లా ఎగబడుతున్నారు నా మీదకి. వాళ్ళ చేతులన్నీ నా బాడి మీద కబాడీ, ఖోఖో, కోతి కొమ్మచ్చి లాంటి ఇండోర్ గేమ్స్ ఆడుకోవడం లో బిజీ గా ఉన్నాయ్.

కాని ఇదేంటి? వెనక నుంచి ఒక్క చేయి మాత్రం నా జీన్స్ పాంట్ లో ఉన్న పర్సు వైపు వెళ్తుంది. "అసలే పది కాలాల పాటు పదిలంగా కాపాడుకోమని నాన్న ఇచ్చిన  పాకెట్ మని పది రూపాయలు ఉంది దాంట్లోనే. అమ్మో అవి పోతే ఇంకేమైనా ఉందా?"

ఇంకేమి ఆలస్యం చేయకుండా వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఒక్క తన్ను తన్నా.............
          
"చచ్చానురోయ్.............................."   

"అనుమానం లేదు, ఇది  మా అశ్విన్ గాడి గొంతే.............."
"థాయ్ లాండ్ కెళ్ళినా తారక రత్న గొడవ తప్పలేదన్నట్టు వీడు ఇక్కడా తగలడ్డాడు"?

వాడు అరచిన అరుపు తో హీరోయిన్స్ అందరు ఒక్కొక్కరు టాటా, బైబై... అంటూ మాయమయ్యారు. చూస్తుండగానే సిటీ బస్సు కాస్తా మా కాలేజ్ హాస్టల్ లా మారి పోయింది. గది లో ఒక మూలకు అశ్విన్ గాడు పిచ్చి చూపులు చూస్తూ, తలలో పేన్లు నోట్లో వేసుకుంటూ "అన్వేషిత సీరియల్ లో కబిస్ లాగా, ప్రేమిస్తే సినీమా లో హీరో" లాగా కేకేక్కేక్కేకే...... కేకేక్కేక్కేకే..........అంటున్నాడు.
"పాపం దెబ్బ కొంచం గట్టి గా తాకినట్టుంది"...............

తరువాత కెమెరా ఒక దుడ్డు కర్ర ని చూపించింది. గది మొత్తం చీకటయింది, ఆ చీకట్లోంచి "బతికానురోయ్" అంటూ అరుపు. "నా చేతి లో కర్ర విరిగింది, వాడి పిచ్చి కుదిరింది".

నేను చివరి బెంచి లో కూర్చుని నా సమోసాల స్పాన్సర్ సరోజ చెప్పే "ఇస్తరాకులు" అనే సీరియల్ కథ వింటున్నాను."రాజేష్ తో బలవంతపు పెళ్లి చేయించుకున్న కామేశ్వరి, పెళ్లి రోజున తన ప్రియుడు సోమేష్ కి ఇస్తారాకుల్లో పప్పన్నం పెట్టి అవమానించిన తన అత్త గారి పై పగ తీర్చుకుంటుందా? దాన్ని అడ్డుకునేందుకు భువనేశ్వరి వేసిన ఎత్తుగడ ఫలిస్తుందా?" అనే అంతు చిక్కని విషయాలని చాలా స్పష్టంగా పూస గుచ్చినట్లు చెప్తుంది తను.

"కిషోర్ నిన్ను మన ప్రిన్సిపాల్ రమ్మంటున్నారు" అన్న మాటతో నా కోపం నశాలనికెక్కింది. సీరియల్ స్టోరి డిస్టర్బ్ చేసినందుకు కాదు, దానికి వేరే కారణముంది.

ఆవేశంగా ప్రిన్సిపాల్ రూం కెళ్ళి అక్కడ బల్ల లేక పోతే చైర్ గుద్ది మరీ చెప్పాను.
"సార్ మీ చిన్న కూతురి కి స్కేలు తో  లైన్, మార్కర్ తో స్కెచ్ వేసేది నేను కాదు సార్",
"ఆ కుత్తే, సాలే, లఫంగి, అచ్చోసిన ఆంబోతు, అడ్డ గాడిద, ఇంకా 'ఆ' మీద ఏమోస్తే అది ఆ "అశ్విన్ గాడు సార్".

ఆవేశంగా డైలాగ్ కంప్లీట్ చేసి అశ్విన్ గాన్ని ఇరికించేసి మా ఫ్యూన్, మా ప్రిన్సిపాల్ తీసుకొచ్చిన కాఫీ ని తాగేశాను.

అప్పటికే, నిజం చెప్పక పోతే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అని బెదిరించడం తో  బెదిరి పోయి ఏడుస్తున్న అశ్విన్ గాడు నా మాటల తో కంగారెత్తి పోయి.......
"అదేంట్రా కిషోర్, ఇద్దరం కలసి లైన్ వేద్దాం అంటే అప్పుడు నాకు (అశ్విన్) చెల్లి అన్నావ్ గా" ఇప్పుడేంటి రా ఇలా? ప్లేట్ ఫిరాయిస్తున్నావ్ అనుకుంటే ఏకంగా కిచేనే ఫిరయించేస్తున్నావ్.

ఆవేశంగా............... "నేను ఇప్పుడు కూడా చెప్పేది అదే రా నాకు(కిషోర్) చెల్లి","నాకు చెల్లి నీకు లవర్", "నాకు లవర్ నీకు చెల్లి", "చెల్లి లవర్, లవర్ చెల్లి" "నీకు నాకు, లవర్  చెల్లి" అని అశ్విన్ గాని కంఫ్యూస్ చేస్తూ, అవుతూంటే.............

"షటప్ యూ రాస్కల్స్, యూ బోథ్ పీపుల్ ఆర్ సస్పెండేడ్ ఫర్ ఎ మంత్".
                  
మా ప్రిన్సిపాల్ పెట్టినఆ ఆ కేక తో "కాలేజ్ ఇవ్వాలుంటుంది, రేపు పోతుంది కాని స్నేహమే శాశ్వతం" అనుకుని నేను, అశ్విన్ గాడు ఆనందం తో గట్టి గా కౌగలించుకుని ఒకరి భుజాల పై ఒకరం చేతులు వేసుకుని "స్నేహమేరా జీవితం, స్నేహమే రా శాశ్వతం" అంటూ పాట పాడుకుంటూ 'హైదరాబాద్ లో రోడ్లు కొలవడానికి' బయలుదేరాం.

అయినా  మాకు ఈ సస్పెండ్లు కొత్తేం కాదు. ఆ మాటకొస్తే "సర్వం ధారబోసి  సాఫ్ట్వేర్ ఉద్యోగం  సంపాదించిన వాడైనా సరే, సస్పెండ్ అనే మాట లేకుండా  స్టడీ సర్టిఫికేట్ సంపాదించలేడు" అనేది నా గట్టి నమ్మకం.

ఈ నెల రోజుల్లో.....................

"కోఠి నుండి బయలు దేరిన సిటీ బస్సు ట్రాఫిక్ లో దిల్ షుక్ నగర్ చేరింది. దేవత సీరియల్ లో హీరోయిన్ మెట్లు దిగడం అయిపోయింది. పవన్ కళ్యాణ్ సినీమా షూటింగ్ విజయవంతంగా ఒక్క సీన్ కంప్లీట్ చేసుకుంది. సెన్సెక్స్ ముప్పయి మూడు సార్లు పతనమయింది". 

అలా ఈ నెల రోజులు చూస్తుండ గానే గడిచి పోయాయి.

"మే ఐ కమిన్ మేడం" అన్న ఒక స్వీట్ వాయిస్ తో క్లాస్ మొత్తం గది గుమ్మం వైపు చూసాం. తేనె లోని తీయదనం, పూల లోని సౌకుమార్యం, తొలి వెలుగు లోని వెచ్చదనం, పిల్లగాలి చల్లదనం, ఇవన్నీ కలబోసిన  "పాల రాతి శిల్పం" లా ఉంది తను. ఛా...."పాల రాతి శిల్పం" అంటే రొటీన్ కదా .........ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం మనం. ఆ......."అమూల్ లేడి" లా ఉంది తను. అలా ఆమెని చూస్తున్నంత సేపు నా పై వర్షం పడుతున్న ఫీలింగే................బ్యాక్ గ్రౌండ్ లో "ఏమైంది ఈ వేళ, ఎద లో ఈ సందడేలా? మిల మిల మిల మేఘమాల" అంటూ సాంగ్ ఒకటి వేసుకున్నాను యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్షన్ లో.

కృష్ణ కి విజయనిర్మల లా, అజిత్ కి శాలిని లా, రాజశేఖర్ కి జీవిత లా పిచ్చ పిచ్చ గా నచ్చేసింది నాకు. వెంటనే వెళ్లి ఐ లవ్ యూ అని చెబుదామనుకున్నా............ కాని "అన్నప్రాసన రోజే ఆన్ లైన్ లో బ్రౌజింగ్ ఎందుకని ఆగి పోయాను". కాని పేరు మాత్రం తెలుసుకున్నాను. ఆమె పేరు కిరణ్మయి.

ఇక  ఆ రోజు నుండి మొదలు కష్టాలు. నా ఊహల్లో, నా గుండెల్లో, నా జేబుల్లో ఎక్కడ చూసినా ఆ అమ్మాయే. గోడ మీద పోస్టర్ల లో హీరోయిన్ లాగా, జెమిని టివి టెలిషాపింగ్ లో తెలుగు లో పచ్చి బూతులు మాట్లాడే యాంకర్ లా, అంతెందుకు మొన్న పంపు దగ్గర నీళ్ళ కోసం దెబ్బలాడుకుంటున్న అమ్మాయి లా కనబడితే ఆపడానికి వెళ్ళాను.తద్వారా వచ్చిన రిసల్ట్ "నా మాడు పగలడం". ప్లాస్టిక్ బిందె తో తల సొట్ట పడేలా కొట్టడం కేవలం హైదరాబాద్ ఆడపడుచులకు మాత్రమే సాధ్యమని అప్పుడే తెలిసింది.

ఇంత జరిగినా సహించాను భరించాను. కాని చివరాకరికి ఒక రోజు వెరైటి కొప్పులేసుకుని టివి 9 లో వార్తలు చదివే అమ్మాయి లా కనబడితే ఆపుకోలేక గట్టిగా అరిచాను. "దేవుడా....................."

"వాట్ మై సన్ వాట్ హాపెండ్....." అన్న పిలుపు తో వెనక్కి తిరిగి చూసాను. చూసే సరికి ఐమాక్స్ ముందున్నాను. నా ముందు ఆర్. ఎస్ జువేలర్స్ షాపు బంగారం మొత్తం ఒంటి మీదే వేసుకుని ఒకాయన ఉన్నాడు.

"ఎవరు మీరు"? ఏంటి ఇలా వచ్చారు ?
"అయాం నాట్ కమ్మింగు, నిన్నే ఇక్కడికి బ్రింగింగు"
అయినా యూ ఆస్కావు, కాబట్టి టేల్లింగు"                  

"ఐ యాం గాడ్. జేమ్స్ గాడ్". మై ఫ్రెండు టోల్డ్ దట్టు,  మాయ బజార్ సినీమా మళ్ళి రంగుల్లో రిలీజింగు. అది  చూడడానికి ఐ మాక్స్ కు కమ్మింగు .... అంతలోనే యూ  పిలుపు ఐ హియరింగు. ఇదిగో ఇలా నిన్ను ఇక్కడికి బ్రింగింగు ....నౌ టెల్ నీకేం వాన్టింగు.  అసలే నాకు  నో టైం , అక్కడ షో టైం గోయింగు".

"సరే కాని స్వామి, అదేంటి మీ బాషలో ఆంగ్లం దోర్లుతున్నట్టు, కింద పడి కొట్టుకున్నట్టు కనబడుతుంది నాకు".
"అదేం అడుగుతావులే సన్ను, ఇంగ్లీష్ రాక దేవతలు వెనక పడుతున్నారని వేరే లోకాలకెళ్ళి చచ్చిన నారదుడు ఫిట్టింగు, దాంతో  లార్డు శివా కి కోపం వచ్చి జి.వో. పాసింగు".    

"నా సంగతి పక్కకి కీపు" నీ డిసైరు డిసైడుకో అర్జెంట్లి" ఐ గో..........  

సరే స్వామీ "నేను ఆ అమ్మాయి ని ................"

ఇంగ్లీష్ మాట్లాడి మాట్లాడి ఆయాసపడుతూ ..."చెత్త వెధవ".... స్టోరి ఐ నో. అగైన్ టెల్లి  బోర్ బీటించకు" .

"అదేంటి స్వామీ, తెలుగు లో ఇడియట్, పోకిరి, దేశ ముదురు సినీమాలున్నాయ్. కాని ఈ "చెత్త వెధవ" అనే సినిమా ఏమి లేదే! పూరి జగన్నాథ్ కొత్త సినీమా నా? అది. ప్లీస్ బాబ్బాబు  మా దేవుడి వి కాదు నాక్కూడా కొంచం చెప్పవూ ఆ స్టోరి".  
"యూ ఇడియట్".
"అదేంటి స్వామీ, కింద ట్యాగ్ లైనా?"
చెత్త వెధవ "చెత్త వెధవ" అన్నది "యూ" నే  రా..... నీకేం కావాలో మూడు ముక్కల్లో చెప్పేయ్. ఇదే నీకు లాస్ట్ చాన్స్. నేను వెళ్లి పోతున్నాను.

నాకు ఒకటి.......
ఆ అమ్మాయి రెండు.....
కావాలి మూడు.......
ఆ...మూడు ముక్కలు అయి పోయాయి స్వామీ ఇప్పుడు చెప్పండి.

"ఐ గివ్ ఓన్లీ  మూడు ముక్కలు బట్ నువ్ చించి దాన్ని డిడ్  పదమూడు ముక్కలు". దానికి శిక్ష గా ...........అంటూ ఆపి
అవును శిక్ష ని ఆంగ్లం లో ఏమంటారు?..........
నేను కాసేపు ఆలోచించి ఆ...దొరికింది. "శిక్షింగు" .....

దానికి "శిక్షింగు" గా ఆ లేడి ని  ప్రేమిస్తే నీ జీవితం "రెండు రెళ్ళు ఆరు" అవుతుంది, నీ హార్టు వేయి పీసులవుతుంది . ఇదే నా కర్సు.......కర్సు .....కర్సు ......."
"కర్సు.......కర్సు .....కర్సు ......" అంటుంటే ఖర్చులకి ఏమైనా డబ్బులు కావలేమోనని, డబ్బులు లేవంటే ఫీల్ అవుతాడేమో నని ఖాళీ పర్సు తీసి చేతి లో పెట్టా.....
"యూ రాస్కెల్ నాకే లంచం ఇస్తావా"? "నాకు అన్ని లోకాల్లోను నచ్చని ఒకే ఒక్క పదం లంచం" అని పర్సు తీసుకుని జేబు లో పెట్టుకుని,  నేను పెట్టిన కర్సు కి త్వరలోనే తదాస్తు .....తదాస్తు ........తదాస్తు అని మూడు సార్లు అని  దేవుడు ఐమాక్స్ లో దూరిపోయాడు.                 
రోజులు గడుస్తున్నాయి, ఆమె వెంట పడి తిరుగుతుంటే చెప్పులు అరుగుతున్నాయి, ఆమెని అలా చూస్తూ చూస్తూ ఉంటే గడ్డాలు, మీసాలు పెరుగుతున్నాయి తప్ప ఆమె గుండె అరిగి కరగడం లేదు,  ఆమెకి నా మీద ప్రేమ మాత్రం పెరగడం లేదు. ఇలా అయితే లాభం లేదని ఒక రోజు అందరి ముందు కాలేజ్ లో డైరెక్ట్ గా వెళ్లి చెప్పేసాను "ఐ లవ్ యూ" అని.

కొద్ది క్షణాల తరువాత "టప్...".మని పెద్ద శబ్దం. ఆ శబ్దం ఆమె చేయి నుండి వచ్చిందా లేక నా చెంప నుండి వచ్చిందా అని నాకు అర్థమయ్యే లోపే అక్కడి నుండి ఆమె వెళ్లి పోయింది. పాపం డైరెక్ట్ గా అందరి ముందు అడిగేసరికి "మనో భావాలు దెబ్బ తిన్నట్టున్నాయ్".

ఐన మనం వదులుతామా? లేదు. హచ్ డాగ్ లా రేయింబవళ్ళు  బడి లోకి, గుడి లోకి జడ లోకి అని తేడా లేకుండా ఆమె ఎటు వెళితే అటు ఆమె వెంటే తోకాడిస్తూ తిరిగాను కనికరించక పోతుందా అని.

ఈ సారి డైరెక్ట్ గా కాకుండా కొంచం ఇంట్రడక్షన్ ఇచ్చి ఆ తరువాత "ఐ లవ్ యూ" చెబుదామని డిసైడ్ అయి వెళ్ళాను తన దగ్గరికి.

"కిరణ్మయి నీతో కొంచం మాట్లాడాలి. కాస్తా పర్సనల్ గా, ఒక్క చాన్స్. ప్లీజ్ కాదనకు చచ్చి మీ అత్త కడుపున పుడతా.."
తను ఏమి మాట్లాడ లేదు. సైలెంట్ గా నన్ను ఫాలో అయింది. మా కాలేజ్ కాంపస్ లో ఒక మాంచి లొకేషన్ (కాలేజ్ బిల్డింగ్ పైన) చూసి అక్కడికి తీసుకెళ్ళాను. అశ్విన్ గాడు ఎవరు రాకుండా కాపలా ఉన్నాడు.

"మిమ్మల్ని చూడక ముందు నేనెవరో నాకు తెలిసేది కాదు, కాని నిన్ను చూసిన తర్వాత ఈ ప్రపంచం మొత్తం తెలియట్లేదు. మిమ్మల్ని చూసిన తర్వాతే ప్రేమ అంటే ఏంటో తెలిసింది. అడుక్కునే వాడు తన వృత్తి ని ఎంత ప్రేమిస్తాడో, అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ ని ఎంత ప్రేమిస్తాడో, నేను కూడా నిన్ను అంతే ప్రేమిస్తున్నా............

జీవితం లో లేక లేక ఒకే  ఒక అమ్మాయినే ప్రేమించాను. అది నువ్వే". డైలాగులు మంచి ఫ్లో లో వస్తున్నాయ్... సేబాష్ రా బేటా సేబాష్ అని కంటిన్యు చేయబోతుంటే............

పక్క నుండి అశ్విన్ గాడి వాయిస్.............

"ఏంట్రా లేక లేక ప్రేమించావా? ఆరవ తరగతి లో ఆసియా బేగం, టెన్త్ క్లాస్ లో కేరళ టీచర్ టీనా , ఇంటర్ లో ఇంటి పక్క రజిత మరీ వీళ్ళందరి మాటేమిటి?"

అని చప్పున నాలుక్కరుచుకున్నాడు అశ్విన్ గాడు.

"వాడు నాలుక్కరుచుకున్నా, నేను వాడి తోడ పిండినా", ఏం లాభం. అప్పటికే జరగాల్సింది జరిగి పోయింది. కాని ఈ సారి వచ్చిన శబ్దం  మాత్రం నా చెంప లోంచే అని తొందరగానే తెలుసుకున్నా. ఎందుకంటే తను కొట్టింది "చెప్పు"కోలేని దానితో కాబట్టి. ఐనా "తెలుగు దేశం పార్టి మీటింగ్ లో చంద్రబాబు ని పొగడడానికి వెళ్తూ తారక రత్న ని  చంక లో పెట్టుకెళ్ళడం  నాదే పొరపాటు".  
 
అప్పటి నుండి తను క్లాస్ రూం లో ఉంటే నేను క్లాస్ బయట, తను కాంటిన్ లో ఉంటే నేను లైబ్రరి లో. తను ఈనాడు, నేను సాక్షి. తను ప్రత్యేక తెలంగాణా, నేను మాత్రం సమైక్యాంద్ర కాదు. ఏకంగా ప్రత్యేక ఆంధ్రానే. మేమిద్దరం ఎదురు పడ్డపుడు మాత్రం "చూడోద్దె నను చూడోద్దె చుర కత్తి లాగ నను చూడోద్దె" అనే సాంగ్ మాత్రం వినపడేది బ్యాక్ గ్రౌండ్ లో.

అలా కొన్ని నెలలు గడిచి 'పోయి', మాకు డిగ్రీ పరీక్షలు 'వచ్చాయి'.
  
ఎగ్జాం హాల్లో నా పక్కనే తను, నా వెనకాల అశ్విన్ గాడు. "క్వశ్చన్ పేపర్ లో ఇచ్చింది కాక నాకు వచ్చిందేదో నేను రాస్తున్నాను". వెనక నుండి అశ్విన్ గాడు ఒకటే పొడుస్తున్నాడు.వాడు పోడిచినపుడల్లా తను నవ్వుతుంది. నాకేమో ఎక్కడో బర్న్ అవుతుంది. ఈ అశ్విన్ "గాడిదే"మో నన్ను వదలట్లేదు.  

"రేయ్, రేయ్ ఇటు చూడరా! ఒక సారి చిన్న డౌటు". అంటూ అశ్విన్ గాడు.

"ఏంట్రా చెప్పి తగలడు"

"అది కాదు రా .....ఇన్విజిలేటర్ వచ్చి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు, మరి ఆన్సర్ పేపర్ ఇవ్వడానికి ఎవరు రావట్లేదేంటి రా.......?"

వాడి అడిగిన దానికి నా నుండి సమాధానం రాకపోయే సరికి, వాడు "చెల్లి, చెల్లి" అని కిరణ్మయి ని కాక పట్టి తన ఆన్సర్ షీట్ ని తీసుకుని కాపీ కొడుతున్నాడు. కొద్ది సేపటి తర్వాత నాకు వచ్చినవి కూడా అయిపోయాయి. కూర్చుని దిక్కులు చూస్తుంటే, అశ్విన్ గాడు నన్ను చూసి "దిక్కులు పిక్కటిల్లేలా"  నవ్వుకుంటున్నాడు లోలోపల.

నేను లేచి వెళ్ళిపోదాం అనుకునే సరికే ఏదో స్పర్శ నన్ను తాకింది. పక్కకి తిరిగి చూస్తే తన ఆన్సర్ షీట్ నా పక్కనుంది.
ఇది "కలా? నిజమా"?....................
టెస్ట్ చేసుకుందామని ఒక్క సారి వెనక్కి తిరిగి అశ్విన్ గాడి వైపు చూసా.....
వాడి నా అనుమానం అర్థమైనట్టు చూసి "జస్ట్ ఎ మినట్" అని. 
వాడి చేయి ని వాడే గట్టిగా కొరుక్కుని మెల్లిగా "మ్యావ్" అని అరిచాడు.(పరీక్ష హాలు కదా గట్టిగా అరిస్తే ఇబ్బంది..........)     
ఖచ్చితంగా సందేహం లేదు. ఇది నిజమే............అని డిసైడ్ అయ్యి.......
ఇలాంటి సమయం లో మొహమాట పడితే "అరిటాకు వచ్చి ముళ్ళు  మీద పడ్డా, ముల్లోచ్చి అరిటాకు మీద పడ్డా"   బొక్క మనకే అని చప్పుడు కాకుండా తీసి రాసుకున్నాను.

ఇలా మా పరీక్షలు పూర్తి అయ్యేసరికి మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాం, ఇక్కడి తో ఆగితే బానే ఉండేది. కాని మా వేసవి కాలం సెలవుల్లో హైదరాబాద్ ఎండలకి తట్టుకోలేక ఇద్దరం కలసి డబ్బులు దండిగా ఉన్నపుడు స్నో వరల్డ్ కి, మామూలుగా ఉన్నపుడు  ఏ.సి సినీమా హాళ్ళలోకి, డబ్బుల్లేనపుడు ఏ.సి ఉన్న A.T.M సెంటర్లలోకి వెళ్లి అలా అలా మెల్లి మెల్లి గా దగ్గరయ్యాం. 

నెక్స్ట్ సీన్ లో లవ్ సక్సెస్ అయినందుకు అదే A.T.M నుండి డబ్బు డ్రా చేసి రాత్రి మందు పార్టి ఫ్రెండ్స్ తో .

"రేయ్ ఎవడు ఎక్కువ చేయొద్దు ఇది కంప్లీట్  ఐన వెంటనే తినేసి పడుకోవాలి చెప్పింది అర్థమయిందా"? అశ్విన్ గాడు అన్నదానికి మేమందరం "సరే" అన్నాం. కాని మాకందరికీ తెలుసు వాడే ఏదో ఒకటి చేస్తాడని. మాకిదంతా మామూలే.

రౌండ్ల వారిగా అశ్విన్ గాడి డైలాగులు, చేష్టలు ..........
మొదటి రౌండ్ పూర్తి అయింది. "రేయ్ గ్లాసు లో మందు పోసి ఒక ట్వంటి పర్సెంట్ సోడా కలపండి రా"
రెండవ రౌండ్ పూర్తి అయింది.కొంచం తూలుతూ "రేయ్ ఏంట్రా ఇ..ఇ ..ఇంత లేటు, త్వరగా పోయ్ రా అది  గ్లాస్ లో (సోడా సంగతి మరచి పోయాడు)"
మూడవ రౌండ్ పూర్తి అయింది. పడుకుని పాకుతూ  "రే.......య్, రే..........య్, దీంట్లో.......దీంట్లో....."
నాల్గవ రౌండ్ పూర్తి అయింది.
"ఒసేయ్ రజిత... నాకు లెక్కలు రావని నన్ను వెధవని చేసి  నెల రోజుల కిందిచ్చిన  అప్పు కి సంవత్సరం వడ్డీ దొబ్బుతావాటే.......నువ్వు బాగుపడవే!....... నీకు సహారా ఎడారి లో చేపలు పట్టే వాడు మొగుడి గా దొరుకుతాడే!.........  నిన్ను వాడు రాచి రంపాలు, గొడ్డళ్ళు, కత్తులు పెడతాడే...... నీకు "రామపిథికస్, అపోలోపిథికస్, మైట్రో కాండ్రియా"  అనే దిక్కుమాలిన జబ్బోచ్చి, మెడిసిన్ లేని చావు చస్తావే............
ఐదవ రౌండ్ పూర్తి అయింది.
"రేయ్ ఈ.........శికెన్ లెగ్ పీస్........ ఏంటి రా.......... ఎంత పీకినా రావట్లేదు. దీనమ్మ".
పక్కనున్న సుమన్ గాడు అరిచాడు, "రేయ్ ఎవడ్రా సాలె గాడు వద్దంటే రూం లోకి చెప్పులేసుకోచ్చింది". వాడు చెప్పుని పట్టుకుని చికెన్ అనుకుంటున్నాడు తీసేయండి రో......య్.........    
ఆరవ రౌండ్ పూర్తయింది.
"వా.....వా......," అని అశ్విన్ గాడు సడెన్ గా ఏడుపు మొదలు పెట్టాడు.
"అసలేమయింది రా ఎందుకేడుస్తున్నావ్"?
ఈ సారి ఇంకా సౌండ్ పెంచాడు
"వా...............................వా............................",
గుక్క పట్టి మరీ ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు.
"రేయ్ నీయబ్బా!  ఎందుకు ఏడుస్తున్నావో  చెప్పరా"
"అదేరా  ఎందుకు ఏడుస్తున్నానో అది గుర్తుకు రాకనే ఏడుస్తున్నా రా" అన్నాడు అశ్విన్ గాడు.
"రేయ్ వీడికి బాగా ఎక్కువైంది, ఆ బాత్రూం లోకి తోసేయండి రా" అంటూ సుమన్ గాడు.

కిరణ్మయి తో ప్రేమ రోజు రోజు కి ముదిరి "పాకాన" పడుతుంది. మా రూం  లో తిండి లేనపుడు ఆ పాకాన్నే తీసుకుని "అరిశెలు, రవ్వలడ్డులు" చేసుకుని తింటున్నాను. అంతా బానే ఉంది కాని కిరణ్మయి కి ఉన్న tv 9 పిచ్చి నే తట్టుకోలేక పోతున్నా.. ఇక  ఈ టి.వి. లో వచ్చే "నేరాలు ఘోరాలు" కి అయితే ఆమె పెద్ద ఫ్యాను, A.C, ఫ్రిజ్జు ఇంట్లో ఉండే అన్నీ వస్తువులూనూ.
నా దగ్గరికి రావాలన్నా కూడా...........
నాకు మూడడుగుల దూరం లో నిలబడి చేతి లో మైక్  ఉన్నట్టు గా ఊహించుకుని, పిడికిలి బిగించి..........
"ఇప్పుడు మనం ఎండా కాలం లో నీళ్ళ కోసం కాకి లా, ఎం.పి టికెట్ కోసం పార్టి ఆఫీసు ముందు కార్యకర్తలా" కిరణ్మయి కోసం ఇక్కడ పడిగాపులు పడుతున్న కిషోర్ గారిని ఇప్పుడు మనం కలుసుకోబోతున్నాం.
"చూద్దాం వారేమంటారో"?
"కిషోర్ గారు ఇప్పుడు మీరు చెప్పండి".    
అంటూ ఆ దిక్కు మాలిన tv 9 రిపోర్టర్ బాషనే వాడుతుంది.

ఇక వాళ్ళింట్లో వంట పాడయినా కూడా "నేరాలు ఘోరాలు" తరహా లో........
నూతన్ ప్రసాద్ వాయిస్ ఓవర్ తో "అనగనగా.. అనగనగా.... సికింద్రాబాద్, హైదరాబాద్ అనే రెండు ఊళ్లు ఉండేవి".
"అందులో దిల్ షుక్ నగర్ అనే ఏరియా లో ఒక పాడు బడ్డ సందు చివర ఒక ఇంట్లో రామయ్య, రాములమ్మ అనే ఇద్దరూ దంపతులుండే వారు......"
"వారిద్దరూ మొదట్లో బాగానే వండుకుని  తినే వారు".
"కాని వారి కాపురం మీద ఏ దిష్టి కళ్ళు పడ్డాయో ఏమో..............."      
"ఒక రోజు సడెన్ గా రామయ్య కి జబ్బు చేసింది. దాంతో గత్యంతరం లేక చిల్లర కొట్టు చిట్టెమ్మ దగ్గర అరువు కి తీసుకొచ్చిన సామాన్లతో వంట మొదలెట్టింది రాములమ్మ".
"సాయంత్రం ఇంటికొచ్చిన పిల్లలు తలుపు తెరిచి చూసేసరికి ఒకటే వాసన, అది ఎలక చచ్చిన వాసనో, రబ్బరు కాలిన వాసనో అర్థం కావట్లేదు పిల్లలకి". 
"వంట గది తలుపు తెరిచి చూడ గానే......................"
భయంకరమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో..............


పైన పిక్చర్ చూపిస్తూ విరామం.

డైలీ తెల్లవారు ఝామున ఆరు గంటలకు పెట్టిన అలారం మోగగానే లేచి అలారం ఆఫ్ చేసి పడుకోవడం,  మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిద్ర లేచి స్నానం చేయకుండా అశ్విన్ గాడు పక్క రూం లో కొట్టుకొచ్చి దాచి పెట్టిన స్ప్రే కొట్టుకుని, ఇస్త్రీ చేసి రెడీ గా పెట్టుకున్న అశ్విన్ గాడి డ్రెస్ వేసుకుని కాలేజ్ కి వెళ్ళడం, క్లాస్ లో కుళ్ళు జోకులేసి అటు పైన కిరణ్మయి తో కలసి చెట్ల వెంబడి పుట్టల వెంబడి కాసేపు కూర్చుని, తను బిల్లు కడితే బేకరీలలో హోటల్స్ లో భోజనం చేయడం ,ఆఖరికి ఇంటికోచ్చేప్పుడు తననే పొగిడి తన దగ్గరే ఆటో కి డబ్బులు తీసుకుని రావడం ఇదే దినచర్య గా సాగుతున్న వేళ ...................... 

ఒక రోజు ప్రొద్దునే తను కాల్ చేసింది. అశ్విన్ గాడు ఫోన్ ఎత్తాడు.
"అశ్విన్ , అక్కడ పరిస్థితి ఎలా ఉంది"
"అంతా నార్మల్ గానే ఉంది, కాని నిన్న నన్ను కరచిన కుక్క పరిస్థితే చాలా ఆందోళన కరంగా ఉంది కిరణ్మయి"
"ఆ కుక్క సంగతి పక్కన పెట్టి, పక్కనున్న కుక్క గారి తరుపున బంధువులకి ఇవ్వండి ఫోన్." 
అశ్విన్ గాడు గది సీలింగ్ వైపు చూస్తూ భీకరంగా హా....హ్హా..హా.............అని ఒక నవ్వు నవ్వి ...........
"ఆ, కిరణ్మయి ఇంకా ఇక్కడ నాతో పాటు కిషోర్ గాడు ఉన్నాడు, మీరు వాడితో మాట్లాడండి కిరణ్మయి"
అంటూ ఫోన్ నాకిచ్చాడు.
"ఆ కిషోర్ గారు ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఆ కుక్క పరిస్థితి" అనగానే..............
"అమ్మా తల్లి ప్లీజ్, కొద్దిగా కాసేపు నువ్ కెమెరా మెన్ దినకర్ తో రిపోర్టర్ కిరణ్మయి అని ఊహించుకోకుండా, బాయ్ ఫ్రెండ్ కిషోర్ తో గర్ల్ ఫ్రెండ్ కిరణ్మయి లా మాట్లాడు".
"అదేం లేదు రా  సినీమాకెలదాం, కొంచం తొందరగా కాలేజ్ కి రా".........
"బాయ్ ఫ్రెండ్ కిషోర్ తో గర్ల్ ఫ్రెండ్ కిరణ్మయి TV 9 " అని ఫోన్ పెట్టేసింది.

"అమ్మయ్యా బతికి పోయాను" అనుకుని నేను రెడీ అయి కాలేజ్ కి  వెళ్ళాను. కరెక్ట్ గా టైం కి అశ్విన్ గాడు బైక్ తీసుకెళ్ళాడు. పోనీ బస్సు లో వెళదామా అంటే  హైదరాబాద్ సిటీ బస్సుల సంగతి మీకు తెలుసు కదా...

హైదరాబాదులో ఐతే సిటీ బస్సులు బస్టాపులో ఆగడం అనేది ఇండియా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ సాధించటం లాంటిది. అది ఏ ఇరవై సంవత్సరాలకో ఒకసారి జరుగుతుంది.మన టైం బాగుండి అది కరెక్ట్ టైం కె వచ్చినా మన కి సీటు దొరుకుతుందా? అంటే అది లేదు. అసలు నన్నడిగితే హైదరాబాద్ సిటీ బస్ లో సీటు కన్నా ఎలక్షన్స్ లో  ఏ ఎం.పి సీటో, ఎం.ఎల్.ఏ సీటో ఈజీగా దొరుకుతుంది.కాబట్టి దాన్ని నమ్ముకుని గర్ల్ ఫ్రెండ్ తో సినీమాకెల్లడం అనేది ఎంత కష్టమైన పని అంటే "బాచిలర్ రూం లో ఉంటూ ఎవరి వస్తువులు వాళ్ళే వాడుకోవాలి అన్నంత కష్టమైన పని".

మేం అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఒక ఆటో వచ్చి మా ముందు ఆగింది.

"క్యా సాబ్ కిధర్ చెల్నే కా హై" అన్నాడు ఆటో వాడు.

నాకసలే హైదరాబాద్ ఆటో వాళ్ళంటే ఈ మధ్య చాలా భయం పెరిగింది, వీళ్ళు ఇప్పుడు చెన్నై ఆటో వాళ్ళతోనూ బెంగుళూర్ ఆటో వాళ్ళతోనూ పోటి పడుతున్నారు అని తెలిసినప్పటి నుండి. ఎక్కాలా , వద్దా? అని నేను ఆలోచిస్తుండ గానే ....

మళ్ళి ఆటో అతనే  'సార్ బోలో సాబ్ .ఎక్కండి'......అనకుండా, "మీ జంట బాగుంది" అన్నాడు.

హైదరాబాద్ ఆటో వాళ్ళ బాషలో 'మీ జంట బాగుంది' అంటే "నా పంట పండింది" అని అర్థం. కాని నాకు తెలిసినంత బాష మా కిరణ్మయి కి తెలియదు కదా. అది నిజంగా పొగిడాడు అనుకుని, కిషోర్ వెళ్తే ఈ ఆటో లోనే వెళ్దాం లేక పోతే నేనసలు సినీమాకే రాను అని మొండికేసి కూర్చుంది.

తప్పుద్దా? ఇక ఆడ వాళ్ళు తలచుకుంటే .......వెళ్లి ఆటో ఎక్కి ఆటో  లోకూర్చున్నంత సేపు ఆటో వాడు తెలుగు ని ఖూని చేస్తూ "తెంది"(తెలుగు సగం హిందీ సగం) బాషలో ట్రాఫిక్ పోలీసుల మీద వేసే జోకులు వింటూ ఆర్.టి.సి క్రాస్ రోడ్ చేరుకున్నాం.

ఆటో దిగగానే ఆటో వాడు " పోస్టర్ వైపు చూసి నేను ఇచ్చిన డబ్బులకు చిల్లర తో పాటు ఒక ఫోన్ నంబర్ కూడా రాసిచ్చాడు".
ఏమైనా తేడా వస్తే గీ నంబర్ కి ఫోన్ కొడితే గాల్లే అచ్చి ఏసుకపోతరు" అని నేను వెళ్ళిపోయాడు.
 
నా తల, నా తల తో పాటే కెమెరా కూడా మెల్లిగా పైన ఉన్న పోస్టర్ వైపు చూసాయి. అది రవితేజ నటించిన, నటించిన అంటే తక్కువేమో జీవించిన "ఖతర్నాక్" సినీమా. 

ఒక్కొక్కడు సినీమా హాల్లోకి వెళ్లక ముందే  పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ "సూపర్ .....బంపర్ ..... 200 డేస్ పక్కా, కేక అదిరింది, మా హీరో (ఎంత పెట్టి కొనుక్కున్నాడో............)  చించేసాడు". అంటున్నాడు.

సినీమా స్టార్ట్ అయింది. అర గంట అయింది నేను స్క్రీన్ మీద వస్తున్న
" దోమ కుడితే చేకేన్ గున్యా,.........ఆ.....ఆ............."
"ప్రేమ కుడితే సుఖం గున్యా..........ఆ......ఆహ్ ......"
అనే పాట ని చూడలేక తన వైపు తిరిగాను.

"తను ఆల్రెడీ నా వైపు తిరిగి ఉంది". నాకు సిచువేషన్ అర్థం అయింది. వెంటనే అశ్విన్ గాడికి కాల్ చేసాను. వాడు ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ లోనే అరుస్తున్నాడు. సూపర్......బంపర్........పంచర్......200 ఇయర్స్ అని.

నాకు అర్థం ఐంది వాడు నెక్స్ట్ షో కి ఇక్కడికే వస్తున్నాడు అని. సరే వాడు వచ్చిన తర్వాత బైక్ తీసుకుని వెళ్దాం. అంతవరకు ఇలానే చూసుకుందాం అని ఇంటర్వెల్ వరకు అలానే చూసుకుంటూ గడిపాం.

ఇంటర్వెల్ అయింది.లైట్లు వెలిగాయ్. నా జీవితం లో చీకటి మొదలైంది. దూరం నుండి చిన్న వాయిస్, "రేయ్ అనిర్వేష్  మీ చెల్లెలు కిషోర్ గాడితో................"    

మళ్ళీ కొద్ది సేపటి తర్వాత లైట్లు ఆరిపోయాయ్, కాని నా జీవితం లో మాత్రం వెలుగు రాలేదు. చీకటే కంటిన్యూ..... అయింది. ఆ థియేటర్ లో జరిగిన గొడవ లో "నేను దానం నాగేందర్, వాళ్ళు ఓ.యూ స్టూడెంట్స్ అయ్యారు".తెలుగు బ్లాగుల్లో తెలుగు  రాజకీయాల గురించి  ఎంతో ప్రేమ తో జుట్టు పీక్కుని, చొక్కా చించేసుకుని  చర్చించుకునే తెలుగు బ్లాగర్లకి అక్కడ స్పెషల్ గా ఏం జరిగిందో చెప్పక్కర్లేదనుకుంటా......... 

నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్ లో నేను దెబ్బలతో , తను హౌస్ అరెస్ట్ అయి ఇంట్లో....................

హాస్పిటల్ లో బెడ్ ఉన్న నాకు బ్లడ్ బాయిల్ అవుతుంది. వాళ్ళెవరో వచ్చి కొట్టినందుకు కాదు, నాకు వచ్చిన బ్రెడ్, పాలు, పళ్ళు, కళ్ళు, చెవులు అన్ని నాకివ్వకుండా అన్నీ "అశ్విన్" గాడే తింటున్నందుకు. 

సరిగ్గా అదే సమయం లో తన ఫ్రెండ్ సరోజ వచ్చి చెప్పింది. "ఇంకో వారం రోజుల్లో కిరణ్మయి పెళ్లి" అని.

నేను గట్టిగా అరచి, గ్లూకోస్ బాటిల్ పీకేసుకుని,తల కి చేయి కి ఉన్న కట్ల తోనే అలానే వెళ్లి అడ్డొచ్చిన ఆ అనిర్వేష్ బామ్మర్ది ని కొట్టి తనను తీసుకొద్దాం అని అనుకున్నాను. కాని నా చేయి లో పెట్టిన చెంచాలు, కాళ్ళలో పెట్టిన కడ్డీలు అడ్డం పడే సరికి, బాడి సహకరించదని తెలిసి ఓన్లీ "అరచి" పడుకున్నాను.

బెడ్ మీద పడుకుని కిటికీ లోంచి చూస్తుంటే సముద్రం కనబడుతుంది.ఆశ్చర్య పోయి అలానే చూస్తుంటే కాసేపటికి తెలిసింది. సముద్రం ఉంది హైదరాబాద్ లో కాదు నా కళ్ళల్లో అని. నర్సు ఆన్ చేసిన ఎఫ్.ఎం లో పాట వస్తుంది.

"కలలై పోయెను నా ప్రేమలు"..............................
"అలలై పొంగెను నా కన్నులు".............................

ఆ తర్వాత కొన్ని రోజులకు మా కాలేజ్ కి శంకర్ దాదా M.B.B.S సినీమాలో లాగా ఐశ్వర్య రాలేదు, కాలేజ్ "ఫేర్ వెల్ డే" వచ్చింది. నేను వెయిటింగ్ కిరణ్మయి ఆ రోజు కాలేజ్ కి వస్తుందని తెలిసి...... 

అక్కడ ఫేర్ వెల్ పార్టి లో అశ్విన్ గాడు లాండ్రి వాడి దగ్గర అద్దెకు తీసుకొచ్చిన సూటు, వాడి తమ్ముడి స్కూల్ టై కట్టుకుని పాలిష్ వాడితో బేరాలాడి మరీ పాలిష్ చేయించుకున్న షూస్ వేసుకుని వచ్చే పోయే అమ్మాయిలకి పూలు ఇస్తూ వాళ్ళ చేతిలో అక్షింతలు వేయించుకున్నాడు.

ఇక్కడ చూస్తే కిరణ్మయి రాలేదు, కాని కిరణ్మయి రాసిన ఉత్తరం మాత్రం నా చేతి కొచ్చింది.నా కళ్ళు అక్షరాల వెంబడి "ఒక పి.టి ఉష లా, ఒక అశ్విని నాచాప్ప లా, నీమ్స్ ఆసుపత్రి లో ఒక లగడపాటి రాజ గోపాల్ లా" పరుగెడుతున్నాయి.
"డియర్ కిషోర్ నేను ఏదోలా ఉన్నాను, నువ్ ఎలా ఉన్నావని అడగను ఎందుకంటే నువ్ ఎలాగు ఆ దిక్కు మాలిన అశ్విన్ గాడు నీ పక్కకి ఉన్నంత వరకు బాగుండవని నాకు తెలుసు".
నేను ప్లే బటన్ ని పాస్ లో పెట్టి, దూరంగా ఉన్న అశ్విన్ గాడి వైపు చూసాను, వాడు ఏదో ఘన కార్యం చేసిన వాడిలా చేయి ఊపుతున్నాడు.  
మళ్ళి ప్లే బటన్ ని  నొక్కాను. కంటిన్యూ అయింది.
"మన రెండు జీవితాలు ఒకటవుతాయి అనుకున్నాం కాని దేవుడు ఇలా మనల్ని వేరు చేసి మన జీవితాల్ని "రెండు రెళ్ళు ఆరు" చేస్తాడని అనుకోలేదు".
ఇది చదివిన వెంటనే ఫ్లాష్ బ్యాక్  లో దేవుడి ఎపిసోడ్ గుర్తుకొచ్చింది. దాంతో పాటు అశ్విన్ గాడు కూడా పరుగెత్తుకొచ్చాడు. మళ్ళి కంటిన్యూ...... 
"నీ మట్టి బుర్ర కి "రెండు రెళ్ళు ఆరు" అంటే అర్థం కాదు అని నాకు తెలుసు, అందుకే వెనక వైపు "సింబాలిక్ గా ఎక్స్ ప్లయిన్" చేసాను, అదీ అర్థం కాకపోతే దాని కిందే రాసాను చదువుకో" 
ఈ వాక్యం చదవగానే అశ్విన్ గాడు నన్ను వెనక్కి తిప్పి, పై నుండి కింది దాకా ఎగా, దిగా చూసి
" చట్ బే!..... ఈ ఆడాల్లెప్పుడు ఇంతే.........అంతా మోసం, వెనక వైపు రాసాను అంది, ఇక్కడ చూస్తే ఏమి లేదు అంతా చీటింగ్"
నేను వాణ్ని ఏమీ అనలేక మళ్ళి ఉత్తరం లో మునిగి తేలాను.    
"ఎనీవే నేను అమెరికా వెళ్తున్నాను కాబట్టి మనం మరో సారి కలవడం కుదరదు అనే అనుకుంటున్నాను. అయినా నువేం బాధ పడకు. నెల నెలా డబ్బులు పంపిస్తుంటా........"
"మాంగాల్యాన్ని కళ్ళకు అద్దుకుంటూ" భారత స్త్రీ గా నేను ఇంతకంటే ఏమి చేయలేను...............బై.
ఇట్లు .....................భర్త కెమెరా మెన్ రాజేష్ తో కిరణ్మయి TV 9.

వెంటనే "రెండు రెళ్ళు ఆరు" కోసం లెటర్ వెనక వైపు చూసాను.......
కాని ఏమి కనబడలేదు. బ్యాక్ సైడ్ మొత్తం నల్ల స్కెచ్ తో పేపర్ మొత్తం గీసి ఉంది.
మన స్టీల్ బుర్ర కి ఏమీ అర్థం కాలేదు. ఇక తప్పక, మనసొప్పక కింద చూసాను. 

" హ..హ్హా...ఏప్రిల్ ఫూల్,ఏప్రిల్ ఫూల్".............. 

"కరెంటు షాక్ కొట్టిన కమెడియన్" లా అయి పోయింది నా పరిస్థితి.

"వెళ్తూ, వెళ్తూ కిరణ్మయి కూడా నా జీవితం తో 'ఒక కిలో జోకు'  జోకేసి వెళ్లి పోయింది. హా..........హత విధి" 
ఇంతకి "రెండు రెళ్ళు ఆరు" అంటే ఏమిటి? ఎంత అశ్విన్ గాడి బుర్ర బద్దలు కొట్టినా అర్థం కాలేదు. అలా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ  చీకటి అయింది .
దూరంగా పాట వినబడుతుంది..........

"చెలియ లేదు... చెలిమి లేదు...., వెలుతురే..... లేదోయ్"
"ఉన్నదంతా చీకటైతే ఉందీ నేనే..... లే. మిగిలుంది.... నేనే లే".

***********************************************
కొన్ని రోజుల తర్వాత.................

"ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..............."
"చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే................"

ప్లాస్మా టి.వి. పగిలి పోయేలా చూస్తున్నాడు మా మామయ్య................