Tuesday, September 22, 2020

ఓ అనిత కథ

 ఈ కథ ఎవ్వరినీ ఉద్దేశించి కాదు....కేవలం కల్పితం మాత్రమే....ఊరి పేర్లు వాడుకున్నా ఈ కథ మాదే అని లబో దిబో మొత్తుకుని కేసులేస్తే కూడా ఇవ్వడానికి చిల్లి గారే కూడా లేనందున ఊరి పేర్లు కూడా నిజమైనవి వాడుకోవట్లేదు. మరి రీడర్స్ అందరూ గమనించాలి....


ఇక కథ లోకి వెళ్తే బస్సు లోనా? ప్లెయిన్ లోనా? అని అడక్కండి...బడ్జెట్ లేదు అందుకని నడుచు కుంటూనే వెళ్దాం... అది బీదావరిఖని అనే పట్టణం...అందులో ఉమేష్ నగర్ అనే ఏరియా....సమయం : వైన్ షాపుల్లో సెకండ్ క్వార్టర్ అమ్మే సమయం (ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్ మన క్యారెక్టర్ తాగేశాడు)

అప్పన తన మన అందరికీ దండాల్లన్న... అప్పన్న తన మన... అందరికీ దండాల్లన్న తాగినోడినోట నిజం తన్నుకొని  వత్తాదన్నా...అంటూ సూపర్ స్టార్ కృష్ణ పాటను ఖూని చేసుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. వచ్చి రాగానే కూతుర్ల పేలు కుక్కుతున్న వాళ్ళ ఆవిడ దుర్వార్త అలియాస్ దువర్ణ ను చూసి కుక్కకున్నా సరే కుక్కిన పేను లాగా సైలెంట్ ఐపోయాడు. అది ఆయన కూతుర్లుగమనించారు. అలానే మంచం లో పడుకుండి పోయాడు. నిద్ర లోకి జారుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని జారుడు బల్ల లాంటిది లేక పోవడం తో పాపం నిద్ర పట్టట్లేదు అతనికి...ఇంతకీ ఇతని పేరు చెప్పలేదు కదూ ఇతని పేరు చమురయ్య.

అతను సగం నిద్రలో కలవరిస్తున్నాడు.

"ఏయ్...చెట్టుకి కొమ్మ బరువా...కొమ్మకి పండు బరువా... పండు కి తొక్క బరువా...నా బిడ్డను నేనే సాదుకుంటా నా బిడ్డ బిడ్డలను నేనే సాదుకుంటా ...

సరిగ్గా అప్పుడే భూ లోకం లో ఎవరి కోరిక తీరుద్దామా అంటూ తిరుగుతున్న దేవతలకు అతని "తాగుబోతు మాటల్లో తండ్రి ప్రేమ" కనిపించింది. అంతే "తదాస్తు" అని దీవించారు దేవతలు...(నోట్ దిస్ పాయింట్ యువరానర్...ఈ పాయింట్ మీదే కథంతా తిరుగుతుంది)

సమయం: వైన్ షాపులు బంద్ అవడానికి సరిగ్గా అరగంట ముందు....

మన చమురయ్య రాష్ట్రప్రభుత్వ ఖజానా నింపడానికి వెళ్తున్న టైం లో...

నాన్న....అంటూ అరుపు...

వెనక్కి తిరిగి చూసేసరికి స్వర్ణ( పది సం"లు), అనిత (ఏడు), భవిత (నాలుగు) (చమురయ్య కూతుర్లు) 

స్వర్ణ: నాన్న నీకు సరిగా మాటలు రాకపోయినప్పటికీ మీడియా ముందు బాలకృష్ణ లా బానే మేనేజ్ చేస్తావ్ కదా బయట...మరి అమ్మ ను చూడగానే ఎందుకు సూర్యకాంతాన్ని చూసిన రేలంగి లా వణికి పోతావ్... సైలెంట్ ఐపోతావ్.

చమురయ్య "ష్" అంటూ తన కూతురు నోరు మూసి ...

గట్టిగా మాట్లాడకండే...మీ అమ్మ వింటుంది...నేనైతే ఓన్లీ మీడియా ముందు బాలకృష్ణ నే...కాని మీ అమ్మ లెజెండ్ లో బాలకృష్ణ....చంపేస్తుంది...అసలే దాని పేరు దుర్వార్త. మీ మాటలు విందంటే దాని నోటి నుండి వచ్చే దుర్వార్తలు నేను వినలేను.

రెండో కూతురు అనిత కలుగ జేసుకుంటూ...నాన్న అమ్మ పేరు దువర్ణ కదా ...దుర్వార్త అంటావేంటి...

చమురయ్య : దాని అసలు  పేరు దుర్వార్తే కాని పెళ్లి ఐన తర్వాత దువర్ణ గా మారింది. ఆ పేరు కూడా ఎలా మారిందో తెలుసా ....

అనిత : ఎలా నాన్న ..

చమురయ్య :ఆ రోజు నాకు రన్నింగ్ పోటీ..గెలిస్తే దొంగరేణి జాబు వస్తది. మీ అమ్మ చెప్పింది దొంగరేణి జాబు కొడితే మతం మార్చుకుని పేరు మార్చుకుంటానని..అంతే నాకు వెయ్యి కుక్కల బలం వచ్చింది.

భవిత (బుజ్జి బుజ్జి మాటలతో) : అదేంటి నాన్న అందరూ వెయ్యి ఏనుగుల బలం అంటారు కదా...ఈ వెయ్యి కుక్కలేంటి నాన్న ... 

చమురయ్య :ఏనుగులు అయితే పరిగెత్త లేవు కదా రా బుజ్జి కన్నా..అందుకే కుక్కలతో పోల్చా..కుక్కలైతే బాగా పరిగెడతాయి కదా.. మరి డాడి కి కుక్కల శక్తి వస్తేనే కదా పరిగేట్టేది... 

భవిత (బుజ్జి బుజ్జి మాటలతో) ఓకే... కంటిన్యూ ..కంటిన్యూ

చమురయ్య: ఇప్పుడంటే ఏజ్ కొంచం ఎక్కువై డైలీ హాఫ్ తాగుతున్నాను కాని అప్పుడైతే డైలీ రిక్షా లాగి లాగి ఒక ఫుల్ తాగేవాన్ని...అలాంటి నేను గెలవాలనే తపన తో మందు ఒక్క చుక్క కూడా ముట్టుకోకుండా గెలిచేందుకు దాటే లైన్ దగ్గర "ఇక్కడ ఫ్రీ గా మందు పోయబడును" అనే బోర్డును ఊహించుకుని పరిగెత్తాను చూడండ్రా .....దెబ్బకు జాబు వచ్చింది...మీ అమ్మ పేరు మారింది...

భవిత (బుజ్జి బుజ్జి మాటలతో): ఓహో..అయితే మీ అన్న అక్కడ "ఇక్కడ ఫ్రీ గా మందు పోయబడును" అనే బోర్డును ఊహించుకోలేదా డాడి...

 చమురయ్య:ఎందుకు కన్నలు అట్ల అడిగినవ్...

భవిత (బుజ్జి బుజ్జి మాటలతో): పెదడాడికి దొంగరేణి పని రాలే కదా డాడి అందుకు...

చమురయ్య: హేయ్...జబర్దస్త్ పంచు....

భవిత: హి,,హి,,హి .. 

స్వర్ణ: నాన్న నాకు ఇంకో డౌట్...నువ్ తాగినపుడల్లా "చెట్టుకి కొమ్మ బరువా...కొమ్మకి పండు బరువా... పండు కి తొక్క బరువా...నా బిడ్డను నేనే సాదుకుంటా నా బిడ్డ బిడ్డలను నేనే సాదుతా "  అని ఎందుకంటావ్ నాన్న ....

చమురయ్య: అదేమోరా... చిన్నప్పటి నుండి నాకు తాగితే  నా నోటి నుండి ఆ డైలాగే అస్తది.. ఎందుకత్తదో ఆ దేవుడే చెప్పాలే... అంటూ రాష్ట్రప్రభుత్వ ఖజానా నింపడానికి వెళ్ళాడు..

తరువాత రోజు ....ఆడాళ్ళు జడలు అల్లుకునే సమయం....

(ముగ్గురు పిల్లలు కలిసి జడ అల్లుకుంటున్న వాళ్ళ అమ్మ దుర్వార్త దగ్గరకు వెళ్లి...) అమ్మా ...నాన్న నీకు భయపడతాడు కదా ఎందుకమ్మా ... 

దుర్వార్త: నాన్న నాకెందుకు భయపడుతాడు రా ..

భవిత (బుజ్జి బుజ్జి మాటలతో): అవును భయపడడు....సుసూ పోసుకుంటాడు..హి,,హి ,,హి ..

స్వర్ణ: నువ్ ఆగవే ....నువ్ చెప్పమ్మా....

దుర్వార్త: జ్వరం వచ్చినప్పుడు పొద్దున్న ఒక టాబ్లెట్ మధ్యాహ్నం ఒక సిరప్..రాత్రొక సూది ఎసుకుంటాం కదా ...అలానే చాన్సు వచ్చినప్పుడల్లా పొద్దునోసారి అలగాలి.. మధ్యాహ్నం ఓ సారి ఏడవాలి..రాత్రోసారి గొడవ పెట్టుకోవాలి..అప్పుడప్పుడు సూసైడ్ చేస్కోవాలే...బెదిరించాలే ..అదిరించాలే...అర్థమయిందా...

స్వర్ణ : అయినా మాట వినక పోతే ..

దుర్వార్త: మీరు కొంచం గొడవ స్టార్ట్ చేయండి..దాన్ని అటు లాగి ఇటు పీకి..పెద్దది చేసి దాంట్లో వాళ్ళ అమ్మను నాన్నను లాగి నానా రభస చేసి వాళ్ళ పరువు బజారుకీడ్చే భాద్యత నాది...

అనిత: అయినా వినక పోతే ....

దుర్వార్త:పెట్టె, బేడా సర్దుకుని ఓ ఆర్నెల్లు ఇంటికొచ్చేయండి....నాకేమైనా కొడుకులా పాడా ...కోడలు మిమ్మల్ని ఏమైనా అనడానికి..మీకు మీ మొగుడి మీద కసి తీరుతుంది..నాకు ఇంట్లో పని చేయడానికి ఆసరాగా ఉంటారు....పని మనుషుల గొడవా తప్పుతుంది.

స్వర్ణ : (వీరత్వం తో) అమ్మా ....ఇదే నా ఆన...నీకు మాటిస్తున్నా అమ్మా ...నీ పరువు నిలబెడతా..

నా మొగుడు నా మాట వినక పోతే ప్రాణ త్యాగానికైనా సిద్దమమ్మా...

అనిత: ( సేం అదే వీరత్వం తో) అమ్మా ... దానియ్ ఒక ఆన అయితే నాయి మూడు ఆనలమ్మ ...

దుర్వార్త: మూడు ఆనలేంటే ....

అనిత: అంటే ఆన... ఆన... ఆన..జయం మనదేరా లో వెంకటేష్ టైపమ్మా....

దుర్వార్త: సరే చెప్పి సావ్..

అనిత: నేనెందుకు సత్తమ్మా ...అదంటే బిత్తిరిది..సూసైడ్ అయినా చేసుకుంటది...నేను నా జీవితాంతం ఇక్కడే తినుకుంటుంటా గాని అవసరమైతే విడాకులైనా తీసుకుంటగని నీ మాట మాత్రం జవదాటను....

దుర్వార్త: నువ్వేం చేప్తలేవెందే  భవిత...ఒట్టెయ్...

భవిత (బుజ్జి బుజ్జి మాటలతో): పెద్దదంటే ముందు పుట్టింది దానికి నువ్ తొందరగా పెళ్లి జేత్తవ్...దానికి  బోచ్చడుటైం ఉంటది లోల్లికి.. దాని పెళ్లి అప్పు తీర్చేసరికి రెండో దానికి 24  అత్తయ్. అప్పుడు దానికి పెళ్లి జేత్తవ్... దానిక్కూడాఎంతో కొంత టైముంటది లోల్లికి ... దాని అప్పు తీర్చేసరికి నాకు 30 అత్తయ్. గా వయసు ల పెళ్లి జేస్కొని నా మొగునితోని గొడవపెట్టుకోవాల్నా....నేనిన నీ మాట ....నా మొగునితోని తన్నులన్న తింటగని నేనైతే అక్కల లెక్క చెయ్య.....నీ మాటిన... 

దుర్వార్త: (ఆశ్చర్యం తో ) ఆహ్...


(ఇంకా ఉంది)

so friends it is my first episode...  

నచ్చితే ఊ కొట్టండి...నచ్చకపోతే మాత్రం ఛీ కొట్టకండి...జస్ట్ కామెంట్ చేయండి..