Thursday, December 31, 2009

శంకర్ దాదా టు సమరసింహా రెడ్డి

                     రోజుకి 20 గంటలు నిద్రపోతూ, 2 గంటలు ఆఫీసుకి వెళ్తూ(మార్కెటింగ్ జాబు) , ఇంకా 2 గంటలు బార్లలో ఎంజాయ్ చేస్తూ, వారానికి 5 సినిమాలు చూస్తూ, 4 రోజులు ఫ్రెండ్స్ రూం లో 3 రోజులు అక్క వాళ్ళింట్లో ఉంటూ, నెలకొకసారి నెల పూర్తి కాక ముందే జీతం తీసుకుంటూ ట్యాంక్ బ్యాండ్ మీద రేడియో మిర్చి ఫ్లెక్సి లను చూస్తూ ఆనందంగా, హాయ్ గా జీవితాన్ని జుర్రుకుంటున్న రోజులవి.  రాజ్ భవన్ లో అప్సరసల మధ్య గవర్నర్ ఎన్.డి.తివారి లా జీవితాన్ని అనుభవిస్తున్న నాకు వీటన్నిటికి తెర దించుతూ, ఒక ఫోన్ కాల్." కిషోర్ వేర్ ఆర్ యు. కం టు ది ఆఫీస్ ఇమ్మీడియట్లీ." అని.

                     ఎప్పుడైనా ఫోన్ చేసి "సారీ నిద్ర ని డిస్టర్బ్ చేసినందుకు, కలలోకి కలర్స్ స్వాతి వచ్చిందా? లేక పోతే మా టి.వి యాంకర్ వచ్చిందా? కలర్స్ స్వాతి అయితే ఒక సారి నా దగ్గరికి కూడా రమ్మను" అని చెప్పిన తర్వాత అసలు విషయనికోచ్చే మా మేనేజర్ డైరెక్ట్ గా పాయింట్ కొచ్చాడంటే ఏదో ఉంది, అనుకుని నా తాగుబోతు గాళ్ ఫ్రెండ్ (నా బైకు) కి 2 లీటర్ల మందు పట్టించి ఆఫీస్ కి బయలు దేరాను.

                      నా బైక్ ని ఆఫీస్ కి కొంచం దూరం లో ఉన్న "నో పార్కింగ్" బోర్డు దగ్గర పార్క్ చేసి ఆఫీస్ లో అడుగు పెట్టాను. ఆఫీస్ లో ఎవరు కనబడట్లేదు.ఒక్క మా మేనేజర్ మాత్రం చైర్ లో సరిగా కూర్చోకుండా, వెనక్కి తిరిగి కూర్చున్నారు. నేను వెళ్లి "సార్" అనగానే గట్టిగా 'కిషోర్ నీకు ప్రమోషన్' అని గ్రహాంతర వాసులకి వినబడేలా అరిచి, కౌగిలించుకున్నారు. ఇప్పటి దాక యే బూజు పట్టిన ఫైళ్ళ మద్యన దాక్కున్నారో తెలియదు కాని అందరు ఒకే సారిగా వచ్చి నన్నుఎత్తుకున్నారు. అంతలో అక్కడ ఉన్న నా ఫ్యాన్ ఐన ఫ్యూన్ "శంకర్ దాదా జిందాబాద్.హు. హ. హు. హ. అంటూ పాట పెట్టాడు. మా మేనేజర్ ఆవేశం లో ఒక డెంగి దోమ ని చంపి దాని రక్తం తో నాకో వీర తిలకం దిద్ది మెడ లో ప్లాస్టిక్ పూల దండేసి కమాన్ డాన్స్ కిషోర్ అన్నాడు. ఇంకేముంది, ఒక్క సారి పవన్ కళ్యాణ్ ని తల్చుకుని శంకర్ దాదా జిందాబాద్ హు......హ.........హు........హ......అరె శంకర్ దాదా జిందాబాద్ హు...హ..హు...హ..శంకర్ దాదా , శంకర్ దాదా అంటూ గుడ్డోడు కళ్ళు తెరిచి కింద డబ్బులేరుకునే స్టెప్ ఒకటి, తాగి తూలుతూ అడుగులేసే స్టెప్ ఒకటి, గాలి లో దారం లేకుండా పతంగులు ఎగిరేసే స్టెప్ ఒకటి, మొత్తం ముచ్చట గా మూడు స్తేప్పులేసి ముగించాను.ఆ సీన్ లో నేను చిరంజీవి, మిగతా వాళ్ళు రవితేజ,అల్లు అర్జున్, శ్రీకాంత్, పవన్ కళ్యాణ్ అయ్యామన్న మాట.



      
                        నెక్స్ట్ సీన్ లో హెడ్ ఆఫీస్ లో బాస్ కాల్ గురించి వెయిటింగ్, అదేంటో నన్ను చూసి అందరు వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఎందుకు నవ్వుతున్నారో  క్లినిక్ ఆల్ క్లియర్ పెట్టి తల స్నానం చేయించి, పారశూట్ ఆయిల్ రాసుకునే నా బుర్ర కి మాత్రం అర్థం కావట్లేదు.కాని అది క్లియర్ గా అర్థం కావటానికి ఎంతో సమయం పట్టలేదు. నేను బాస్ కాబిన్ లోకి అడుగు పెట్టాను, బాస్ ఏదో ఇంటరెస్టింగ్ వీడియో చూస్తున్నారు సిస్టం లో. నేను కుర్చీ లో కూర్చోగానే టేబుల్ మీద లెటర్స్ ఉన్నాయి  చూడు అన్నట్టు చేతి తో సైగ చేసాడు. నాకు రావలసింది ప్రమోషన్ లెటర్ ఒకటే కదా ఈ రెండోది ఏంటి అని చూసా, నా గుండెల్లో గులక రాళ్ళు పడ్డంత పని ఐంది. అది "ట్రాన్స్ ఫర్" లెటర్, ఐన పర్లేదు కాని అది పోయి  పోయి మా "సమర సింహ రెడ్డి" బ్రాంచ్ ఆటో నగర్ కి.

                       మీకు ఆ బ్రాంచ్ గురించి చిన్న ఇంట్రడక్షన్. ఆంధ్ర ప్రదేశ్ కి అనంతపురం  ఎలాగో మా అసోసియేటెడ్ రోడ్ కార్రియర్స్ కి ఆటో నగర్ బ్రాంచ్ అలాగా. అక్కడ ఫాక్షనిజం అయితే ఇక్కడ యాక్షనిజం. అక్కడ పని చేసే వాళ్ళంతా 40 కిలోలకి మించకుండా మాసిన గడ్డాలతో(షేవ్ చేసుకోవడానికి కూడా లీవ్ ఇవ్వడు సమర సింహ రెడ్డి.), ఇవన్ని కాదు ఒక్క మాటలో చెప్పాలంటే, భూతాల దీవి (పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్) లో శాపగ్రస్తుల్లా, ఇంకా చెప్పాలంటే డైరెక్టర్ తేజ సినిమాల్లో హీరోల్లా ఉంటారు. అన్నీటి కంటే బయం ఏమిటంటే ఇంతవరకు అక్కడ మార్కెటింగ్ వాళ్ళు  వరుసగా 2 నెలలు కూడా పని చేయలేదు. ఒక అర్బకుడు (ఇంకేవాడు మా అశ్విన్ గాడే) ఆ రికార్డ్ బద్దలు కొడతానని వెళ్లి అక్కడ టార్చర్ తట్టుకోలేక, మన దురదమూరి వంశ గిన్నిస్ స్టార్ తారక రత్న సినిమాల డి.వి.డి ప్యాక్ కొనుక్కుని తలుపులు మూసుకుని తారక రత్న సినిమాలన్నీ వరుసగా చూస్తూ ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. కాని అదృష్టం కొద్ది షాపు వాడిచ్చిన సమాచారం తో పోలీసులు తలుపులు బద్దలు కొట్టి రక్షించారు.(రికార్డులు బద్దలు కొడతానని చెప్పి బంగారం లాంటి ఇంటి తలుపులు బద్దలు కొట్టేలా చేసుకున్నాడు ఎదవ).

                      ఇప్పుడు మళ్ళి సీన్ లోకొస్తే, నేను మా బాస్ తో ఆవేశంగా డైలాగ్ చెబుతున్నాను."సార్ మీరు నన్ను ఎడారిలో ఏనుగు లతో తొక్కించినా, బాలయ్య బాబు సినిమా లు చూపించినా, తేజ సినిమా లో హీరోగా వేషం ఇప్పించినా నేను మాత్రం ఆ బ్రాంచ్ కి వెళ్ళను సార్" కాని మా బాస్ ఏ మాత్రం ఆవేషపడకుండా సింపుల్ గా సిస్టం ఎల్.సి.డి మానిటర్ నా వైపు తిప్పి ఇప్పుడు చెప్పు అన్నాడు.(సిస్టం లో నా వీడియో నే వస్తుంది. నిన్న నేను ప్రమోషన్ వచ్చిన ఆనందం లో చేసిన డాన్స్, సారి ఇందాక మీకు మూడు స్తేప్పులే అని అబద్దం చెప్పాను, సల్మాన్ ఖాన్ లా షర్ట్ విప్పేసి, అరవ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో వచ్చే సైడ్ డాన్సర్ లాగ నాలుక మడత పెట్టి కొన్ని వెర్రి స్టెప్స్ కూడా వేసాను). మీరు ఇంత బుద్ది గా చెప్పిన తర్వాత కూడా ఎందుకు వెళ్ళను సర్? ఇదిగో ఇప్పుడే.. ఇలాగే... ఉన్నపళంగా.. ఇప్పుడే వెళ్తా సర్, అన్నాను ముఖం మీద లేని నవ్వును అలీ దగ్గర్నుంచి అరువు తెచ్చుకుంటూ.ఇప్పుడు వద్దు రేపే వెళ్ళు అన్నాడు మా బాస్, తారక రత్న సినిమా చూడడానికి ఫస్ట్ డే అయితే ఏంటి? నెక్స్ట్ డే అయితే ఏంటి రిసల్ట్ ఒకటే కదా అని అక్కడి నుంచి బయలు దేరాను.
 

                                                                                                                                        
                           నేను ఉండే ప్లేస్ జీడి మెట్ల నుండి ఆటో నగర్ కి 22 కిలోమీటర్లు, లాంగ్ అవుతుందని దిల్ షుక్ నగర్ లో మా స్నేహితుడి రూం కి షిఫ్ట్ అయ్యాను. ఫస్ట్ డే అప్పటికే లేట్ అయ్యింది అని రూం లో ఎవరి తోను పరిచయ కార్యక్రమాలు పెట్టుకోకుండా ఆఫీస్ కి వెళ్లి పోయాను. నేను మా సమర సింహా రెడ్డి కి గుడ్ మార్నింగ్ చెప్పగానే టైం ఎంత అని అడిగాడు, నాకు అర్థమయ్యింది నా టైం బాలేదని. అయినా సరే ఈ.వి.వి తరహ లో ఒక ఒక జోకు జోకుదామని జోకా," టైమా సర్ ? డెబ్బై రూపాయలు సర్, కోఠి లో మొన్నీ మధ్యే కొన్నా" అని. "జోకులు బాగేస్తావన్న మాట, బిజినెస్ కూడా బాగా చేయాలి", ఈ మంత్ నీ టార్గెట్ కోటి అన్నాడు నాకు రివర్స్ పంచ్ ఇస్తూ.(చచ్చాను రా బాబోయ్ ఆ బ్రాంచ్ కి టైర్లు అరిగేలా మార్కెటింగ్ చేసినా నలబై లక్షలు దాటదు). సర్ జస్ట్ అ మినట్ అని అలా పక్కకెళ్ళి నా బైక్ అద్దం లో నన్ను నేను చూసుకుంటూ," రేయ్ ఎదవ నీకు ఇదేం పోయే కాలం రా? ఇంకా 1980 ల్లో లాగ ఆ తుప్పు పట్టి చిన్న పిల్లలు, కన్నె పిల్లలు అని తేడా లేకుండా అందరికి స్టమకు లో స్ప్రైట్ పోసి దేవినట్టుండే చెత్త ఈ.వి.వి జోకులేంటి రా? రాత్రి పుట పబ్బు ల ముందు చీరలమ్ముకునే సేల్సు మెన్ మొహం నువ్వునూ" అని తిట్టుకుని మార్కెటింగ్ కి బయలు దేరాను.నేను రాత్రి రూం కి వచ్చే సరికి బయట తలుపులకి స్లిప్ అంటించి ఉంది,"మన పరిచయ కార్యక్రమాలు మా పండగ సెలవుల తరువాత ఇట్లు గది గజినీలు" అని. సరే లే ఈ కారెక్టర్లని మన బ్లాగు లో నెక్స్ట్ పోస్ట్ కి వాడుకుందాం లే అనుకుని ఆ రోజుకి అలా నిద్ర పోయాను. నా మార్కెటింగ్ జీవితం లో ఫస్ట్ టైం రోజుకి 6 గంటలు మాత్రమే నిద్ర పోయి 12 గంటలు పని చేసింది అప్పుడే. నా దరిద్రం కొద్ది మా రూంమేట్స్ కూడాలేరు.

                    నేను డైలీ లేట్ గా ఆఫీస్ కి వెళ్ళటం, మా సమర సింహ రెడ్డి టైం ఎంత అని అడగడం, నేను డోకు ఒచ్చేల ఈ.వి.వి జోకులేయడం, నాకు మా బాస్ చీవాట్లు పెట్టి నా టార్గెట్ పెంచడం,నన్ను నేను కిష్యోటికా, ఇతియోకినారా అంటూ వెరైటీ గా  తిట్టుకోవడం ఇదే నా దినచర్య. ఆ మధ్య ఒకసారి మాటల సందర్బం లో "నువ్ జోకులు బాగా వేస్తావయ" అన్నాడు, నేను ఈ సారి కొద్ది గా థింక్ చేసి ఈ.వి.వి జోకులు మనకు అచ్చి రావట్లేదు అని ఫ్రెష్ గా త్రివిక్రం జోక్ వేసా. " బజ్జీలు కూడా బాగా వేస్తాను సర్" అని. దాంతో డైలీ సాయంత్రం నాతో ఆఫీస్ ముందు బజ్జీల బండి పెట్టించి బజ్జీలు వేయిస్తున్నాడు, మైదా పిండి తో పెసర వడలు, కారం లేకుండా మిరప కాయ బజ్జీలు వేయమనే మొహం వీడును.

                    వీటన్నిటికి తోడు మా సమర సింహా రెడ్డి కి కవితల పిచ్చి, వాడు కవితలు విన్నా ఫర్లేదు, రాసిన కూడా ఫర్లేదు, కాని రాసి వినిపిస్తాడు ఎదవ. ఒక సారి నేను కాలీగా కనిపిస్తే నన్ను పిలిచి నా మీదే కవిత అల్లాడు తారక రత్న సినిమా కి బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే వెధవాయ్. సమర సింహా రెడ్డి కవిత చెప్పడం ప్రారంబించాడు.

                            ఒక వింత....
                            ఒక వింత ప్రపంచం లోని సుపరిచిత వ్యక్తి కిషోర్
                            ఇతన్ని పరిచయం చేయడమంటే….( మళ్ళి సాగ దీసి)
                            ఇతన్ని పరిచయం చేయడమంటే….................
                            నేలలో ఇంకి పోయిన మట్టి ని.......( మళ్ళి సాగ దీసి)
                            నేలలో ఇంకి పోయిన మట్టి ని చెట్టు చేతుల్తో తవ్వ్వి ఆకాశం లో నిలబెట్టడమన్నంత సాహసమే..

   నేను: వాహ్వా వాహ్వా (లోలోపల. మట్టి నేల లో ఇంకి పోవడం ఎంటిరా నెల తక్కువ వెధవ)                                     

  అనటం తో రెట్టించిన ఉత్సాహం తో కిషోర్ ఇంకా కవిత అన్నాడు.(చచ్చాను రా బాబు)

                                     
                            నా అనే ప్రపంచం లో వుండడం అంటే
                            ఆకు పచ్చ మబ్బుల మధ్య గుంపును కోల్పోయిన
                            తెల్ల కాకి పిల్ల తుమ్మ చెట్టుకు గాయమై
                            బ్యాండేజ్ వేసుకుని వేలాడడమే !  
           
నేను : అబ్బబ్బబ్బా ,అయ్యయయ్యయ్య్యో సార్ మీరు ఇంత గొప్ప గా కవితలు చెబుతారని తెలిస్తే సిని ఇండస్ట్రి లో పోసాని, మోహన్ బాబు , బాలయ్య బాబు వీళ్ళంతా మీ దగ్గరే పాటలు రాయించుకుంటారు సార్.(లోలోపల  ఆకు పచ్చ మబ్బులు,  తెల్ల కాకి పిల్ల, బ్యాండేజ్ సంబంధం లేకుండా చెప్పావ్ కద రా, రేయ్ నువ్ ఆడపిల్ల్లలతో అక్రమ సంబందానికి కాదు కద, సక్రమ సంబందానికి కూడా పనికి రాకుండా పోతావ్ రరేయ్)
                
సమర సింహా రెడ్డి : అలా అంటావా? మరీ విసరమంటావా ఇంకో......................         
నేను: సార్ ఇప్పుడే మీకు మేడం గారు కాల్ చేసి ఇంటికి రమ్మన్నారు.
                  అని అబద్దం చెప్పి ఆ రోజుకి ఎలాగో బయట పడ్డాను. ఇంతింతై ఉదయ కిరణ్ అంతై అన్నట్టు  వీడి  టార్చర్ రోజు రోజు కి పెరిగి పోతుంది.ఒక సారి కస్టమర్ తో నువ్ మనిషి వా, బాల కృష్ణ వా? అని  సీరియస్ గా తిట్లు తింటుండగా మా హెడ్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, అర్జెంటు గా ఒక ఫైల్ మీద మా సమర సింహా రెడ్డి సైన్ కావాలని, కాని మా బాస్ లీవ్ లో ఉన్నాడు, అదే విషయం వాళ్ళకి చెబితే సమర సింహా రెడ్డి ఇంటి అడ్రస్ చెప్పి అక్కడికెళ్ళి సైన్ తీస్కో అన్నారు. అంతలోనే రేయ్ కిషోర్ ఇక రోజులన్నీ నీవే అన్నట్టు ఆకాశవాణి ఆనందం తో అరిచినట్టు గా వినబడింది. కాని ఎందుకు అరిచిందో నాకు అర్థం కాలేదు. నేను సంతకం గురించి సమరసింహా రెడ్డి ఇంటికి వెళ్ళే సరికి తలుపులకి తాళం వేసి ఉంది. సరేలే తరువాత సంతకం తీసుకుందాం అని వెళ్లి పోతుండగా లోపలి నుంచి ఎవరో ఆనందం తో కేరింతలు కొడుతున్న శబ్దం వినబడింది. నేను అనుమానం తో కిటికీ తలుపులు తెరిచి చూసాను. ముందు షాక్ తిన్నా, తరువాత స్వీట్లు తినే సమయం వచ్చిందని సంబర పడ్డాను.ఆకాశవాణి ఎందుకలా అరిచిందో అప్పుడర్థమైంది నాకు.

                 సమర సింహా రెడ్డి బార్యని, పిల్లల్ని సినిమాకి పంపించి గది లోపల ఒక్కడే వాళ్ళ చిన్న కొడుకు మూడు చక్రాల చిన్న సైకిల్ ని తొక్కుకుంటూ కేరింతలు కొడుతున్నాడు. అదొక్కటేనా చిన్న నిక్కరు వేసుకుని పాల పీక నోట్లో పెట్టుకుని కింద అమ్బాడుతున్నాడు. అన్ని చిన్న పిల్లల చేష్టలు చేస్తున్నాడు. చూస్తుంటే నాకే నవ్వొస్తుంది." అమ్మ మొత్తానికి ఎలా అయితే ఏంటి దొరికి పోయాడు అనుకుని సార్ అని కిటికీ లోంచే పిలిచాను కనబడేట్టు గా". నెక్స్ట్ సీన్ లో "నాని సమర" అక్కడ ఫ్రిజ్ లో ఉన్న బీర్ పట్రా అని ఆర్డర్ వేసా చైర్ లో కూర్చుని. దాందేముంది ఇప్పుడే తెస్తా కిషోర్ అని మా బాస్.ఇక అక్కడి నుండి మళ్ళి నా దశ తిరిగింది.

                    అప్పటినుండి మళ్ళి రోజుకి 20 గంటలు నిద్రపోతూ, అప్పుడప్పుడు ఆఫీసుకి వెళ్తూ, ఇంకా 4 గంటలు బార్లలో ఎంజాయ్ చేస్తూ, వారానికి 7 సినిమాలు చూస్తూ, 4 రోజులు ఫ్రెండ్స్ రూం లో 3 రోజులు మా సమర సింహా రెడ్డ్డి ఇంట్లో ఉంటూ, నెలకొకసారి నెల పూర్తి కాక ముందే జీతం+అడ్వాన్సు తీసుకుంటూ నెక్లెస్ రోడ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి కంట్రి క్లబ్ వాళ్ళు పెట్టిన హాట్  ఫ్లెక్సి లను చూస్తూ ఆనందంగా, హాయ్ గా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను.అలా ఉన్న నాకు మళ్ళి ఒక రోజు ఫోన్ కాల్." కిషోర్ వేర్ ఆర్ యు. కం టు ది ఆఫీస్ ఇమ్మీడియట్లీ." అని. కాని ఈసారి బాస్ కాదు, ఆఫీస్ లో మొన్నీ మధ్య నే జాయిన్ ఐన నా కొత్త గాళ్ ఫ్రెండ్ అను.

6 comments:

  1. mee titlu baagunnaayi jandhyala poyina tarvata kottavi kanukkunevaaru leka konnaalu telugu lokam bosipoyindi:) looking forward to reading more

    ReplyDelete
  2. చాలా బాగా రాశారు. మీ శైలి చాలా బాగుంది. టపా చదువుతున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను.

    >>"నా తాగుబోతు గాళ్ ఫ్రెండ్ (నా బైకు) " ఈ పోలిక అదుర్స్...కేక :) :)

    మీ బాస్ కవితలు కూడా హైలైట్. :) :)

    ఒక చిన్న మనవి: "అనంతపురం" పేరును "అనంతపూర్" అని కాకుండా "అనంతపురం" అని వ్రాయమని మనవి. మన తెలుగులోని పదాల అంతం గురించి మీకు తెలిసిందే కదా.

    అలాగే, Word Verification కూడా తీసెయ్యగలరు.

    ReplyDelete