Monday, December 28, 2009

కాకి గోల

                     లేదు,ఉంది,లేదు,ఉంది,ఉంది,లేదు. "డాడీ" అని పెద్ద అరుపు, "ధమాల్" మని పెద్ద సౌండ్. లోపలికి పరుగెత్తుకెళ్ళి చూసే సరికి కన్ను నల్లగా కమిలి పోయి కింద పడి ఉన్న మా అశ్విన్ గాడు, మహా దేవి సినిమా లో అమ్మ వారి గెటప్ వేసుకున్న రమ్యకృష్ణ లా చేతిలో పగిలిన ఫ్లవర్ వాజు తో మా అను.సీన్ నాకు అర్థం అయింది. కానీ ఫ్లాష్ బ్యాకే అర్థం కాలేదు. సీన్ కట్ చేస్తే అందమైన నర్సుల మధ్య హాస్పిటల్ లో వాడు, ఆ హాస్పిటల్ బిల్లు కి కట్టాల్సిన డబ్బు కోసం నేను,అను రోడ్డు మీద.సారి మీకు చెప్ప లేదు కాదు అశ్విన్, అను నాతోనే కలసి చదువుకున్న నా ఫ్రెండ్స్.

                   అంతా సర్దుకున్నాక (అశ్విన్ గాడి ఆరోగ్యం కాదు, అందుకు బిల్లు కట్టిన మా ఆరోగ్యం) ఒక మంచి ముహూర్తం చూసుకుని అను కి ఒక లాలీపాప్ కొనిచ్చి అడిగాను అసలు విషయం ఏంటి అని." రేయ్ అదేం లేదు రా అదంతా నీ గురించే. ఆ రోజు నీకు క్రియేటివిటి వుంది అని నేను, లేదు అని వాడు ఒకటే వాదన.చివరికి వాడు ఏమన్నాడో తెలుసా? పిచ్చి వాడికి బిచ్చమేస్తే క్రియేటివిటి అనుకుంటావెంటే వెర్రి మొహం విజయ శాంతి.అన్నాడు. నన్ను వెర్రి మొహం అన్నా ఫరవా లేదు కానీ విజయ శాంతి తో పోల్చాడు వెధవ. అందుకే ఫ్లవర్ వాజు పుచ్చుకుని ఒక్కటిచ్చా వెర్రి కుదిరింది వెదవ కి" అని అమాయకంగా ఫేసు పెట్టి అసలు విషయం చెప్పింది.

                  "ఐనా ఇదంతా నీ వల్లే రా, ఏదో బ్లాగులు, కథలు రాస్తే క్రియేటివ్ అంటారంట కదా, అదేదో రాసి ఆ ముక్కేదో అశ్విన్ గాడితో అనిపించుకోవచ్చు గా. నీ అవసరం చాలా ఉంది రా మన తెలుగు వాళ్లకి. ఆ మధ్య అమెరికా లో ఆర్ధిక మాంద్యం, హిల్లరి ఓటమి, ఇండోనేసియా లో సునామి, 20-20 ల్లో ఇండియా వెనుకంజ, రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ లో కే.సి.ఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఇవన్ని నువ్ బ్లాగులు రాయకపోవటం వల్లనే" అని నన్ను ప్రపంచ స్థాయి లో ఒక్క మగాడ్ని చేసి సిచువేషన్ తగ్గట్టు గా ఒక కథ చెప్పటం ప్రారంబించింది అను.అదేంటో మీరు కూడా బ్లాగండి సరదాగా.             
   
                    " పూర్వం ఒక ఊరి లో ఒక కాకుల గుంపు ఒకటి ఉండేది.వాటికీ చాలా ఆకలి ఎక్కువ. కానీ తిండి సరిగా లేక అవి ఎప్పుడు కావ్,కావ్ మని అరుస్తూనే ఉండేవి. వాటి కూతలకి ఆ ఊళ్ళో ప్రజలకి నిద్ర లేక మనశ్శాంతి కరువై   ఆ కాకులు ఎక్కడా వాలకుండా తమ చెట్లు తామే నరికేసుకుని, తమ కరెంట్ తీగలు తామే తెంపేసుకుని అంధకారం లో ఉండే వారు. చెట్లు లేక వర్షాలు పడడం ఆగి పోయింది. తద్వారా పంటలు పండలేదు. పంటలు లేక ప్రజలందరూ అలమటించి పోతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ ఊరి లోకి ఒక పులి ప్రవేశించింది.డైలీ తాను వండుకున్న బిర్యాని కొద్ది కొద్ది గా  ఒక్కో కాకి కి పెట్టటం ప్రారంబించింది.అలా ఆ కాకుల ఆకలి తగ్గింది. అవి కావ్ కావ్ మని అరవడం ఆపేసి పులి పులి అని బిర్యాని కోసం సైగలు చేయటం మొదలు పెట్టాయి. కొన్ని రోజులకి మళ్ళి చెట్లు చిగురించడం మొదలు పెట్టాయి.ఊళ్లోకి కరెంట్ వచ్చింది. వర్షాలు పడ్డాయి.పంటలు పండాయి. ప్రజలందరూ ఆనందం తో పండగ చేసుకున్నారు."
                   సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది,  సరైన తిండి లేక కాకులన్ని అలమటిస్తున్నాయి. ఇక్కడ తిండి సరిగా లేదని ఒక కాకి రాజకీయాల్లోకి వెళ్ళింది.ఆ కాకి తమ్ముడి కాకి కత్తి పట్టుకునే కరాటే, కుం ఫూ ఉంటేనే తింటా అంటుంది. ఒక కాకి ట్రైన్ల మీద బైక్ నడుపుతుంది, ఆ మధ్య ముంబై దాడుల పై మీ అభిప్రాయం అని అడిగితే ""లగాన్" సినిమా దక్షిణ బారత దేశం లో ఎందుకు ఆడిందో, "గదర్" సినిమా కి కలెక్షన్లు ఎందుకు వచ్చాయో కారణాలు చెప్పి ఆ రిపోర్టర్ కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది".(పాపం ఇప్పటికి ఆ రిపోర్టర్ కోలుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం). ఇక  కొన్ని కాకులు స్లిమ్, సిక్స్ పాక్ అంటూ బక్క పడ్డాయి.ఇంకో కాకి తిండి సరిగా లేకున్నా సరే కొత్త హీరోయినే కావాలంటుంది. మరో కాకి, కాకి చేష్టలు మని కోతి చేష్టలు చేస్తే ఒకసారి ఎవరో చిల్లరేసారట, అప్పటి నుండి అది కోతి చేష్టలే చేస్తా అంటుంది. మరో ఇంకో గిన్నిస్ బుక్ కాకి అయితే ఏకంగా ఇనుప మాస్కులేసుకుని జనాల్ని బయపెడుతోంది.         
                  ఈ కాకి గోల చూడలేక జనాలందరూ తమ డి.టి.హెచ్ లు తామే పేల్చుకుని తమ సి.డి.లు తామే విరగ్గొట్టుకుని తమ టి.వి.లు తామే కట్టేసుకుని, తమ చొక్కాలు తామే చింపేసుకుని మెంటల్ హాస్పిటల్ కి మీటర్ దూరం లో ఆనందానికి ఆఫ్గనిస్తాన్ అంత దూరం లో అందకరానికి మాత్రం అతి దగ్గరలో బ్రతుకుతున్నారు.


                                                   
               కాబట్టి ఇప్పుడు పులి వచ్చే సమయం ఆసన్నమైంది. ఆ పులి మరెవరో కాదు నువ్వే కావాలి." కనీసం నువ్ వండే బిర్యాని ఐనా వాసన వచ్చి గూగుల్ సెర్చ్ లో తిండి అని టైపు చేసి ఆ  కాకులు తింటాయేమో.అని అను బోరున విలపించింది.

                 ఇప్పటి కైనా నీకు ఆ కాకుల మీద కనికరం కలగలేదా? నువ్ బ్లాగ్ రాయను అనే ఒట్టు ని తీసి గట్టు మీద పెట్టి "తోడగొట్టు చిన్నా" అంది అను. దాంతో నేను ఒట్టును తీసి గట్ట్టు మీద పెట్టకుండా ఎప్పటికైనా పనికొస్తుందని నా రీ సైకిల్ బిన్ లో పెట్టి మెడ సైడ్ కి వంచి తోడ కొట్టాను. ఆ శబ్దానికి ఆకాశం లో ఒకటే ఉరుములు మెరుపులు, భూమ్మీద  భూ కంపాలు, సముద్రం లో సునామీలు వచ్చి, కలియుగాంతం మొదలైందని సూచిస్తున్నాయి. ఇక నుండి నేను 21.12.2012 ని నమ్ముతాను. ఎందుకంటే నా మొదటి బ్లాగ్ ప్రచురితం అయ్యేది ఈ రోజే (21.12.09). ఇంకా సరిగ్గా 3 సంవత్సరాల టైం ఉంది.అంటే దానర్థం ఈ ప్రపంచానికి మూడింది(మూడు ఉంది ) అని.   
           
               నేను ఈ బ్లాగ్ రాయటం మొదలు పెట్టాను, ఇక మీదట రాస్తూనే ఉంటాను 21/12/2012 వరకు. "నేను రాయటం అంటూ మొదలు పెడితే యే అక్షరం ఎక్కడి నుంచి ఎవరి దగ్గరి నుండి కాపీ కొట్టానో తెలుసుకోవడానికి సంవత్సరం పట్టుద్ది". కాబట్టి తెలుసుకోవడానికి ట్రై చేయకండి. ఇంతకి నా పేరు మీకు చెప్పలేదు కదు.నా పేరు కస్క్రిమాపాదనిహీ.

క - కథ 
స్క్రీ - స్క్రీన్ ప్లే 
మా - మాటలు 
పా - పాటలు 
ద - దర్శకత్వం
ని - నిర్మాత 
హీ - హీరో. 
          

2 comments:

  1. baagunnadanDee mee కస్క్రిమాపాదనిహీ. alaagae blaagu vaarshikoetsava Subhaakaankshalu.

    ReplyDelete
  2. ఓరి నాయనో.. ఇంతగా ఉతగ్గొట్టిన వాళ్ళను చూడలా అంతకుముందు.

    ReplyDelete